కార్పొరేషన్‌కు సొంత ఆదాయమేదీ లేదు
రుణాలపై వచ్చే వడ్డీలతోనే కార్పొరేషన్ నిర్వహణ
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు నివేదించిన కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు.
కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు.
కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.
మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి
నీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం.
ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం.
మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment