సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల విడుదలపై ప్రభుత్వంలో తర్జనభర్జన జరుగుతోంది. నిధుల అవసరాలపై నీటి పారుదల శాఖ, ఆర్థిక శాఖల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నా, ఎంతకూ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ హామీ మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే అవసరమయ్యే నిధులు భారీగా ఉండటం, ఆ స్థాయిలో సర్దేందుకు ఆర్థిక శాఖ సుముఖంగా లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా గరిష్టంగా రూ.25 వేల కోట్లు, కనిష్టంగా రూ.16 వేల కోట్లు ఇవ్వాలని కోరుతున్నా రూ.6 వేల కోట్లకు మించి ఇవ్వడం అసాధ్యమని ఆర్థిక శాఖ తేల్చిచెప్పడంతో నీటి పారుదల శాఖ తలపట్టుకుంటోంది.
ఇరు శాఖల మల్లగుల్లాలు
సాగునీటి ప్రాజెక్టులకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.24,575 కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఇప్పటివరకు రూ.13,124.92 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.4,568.41 కోట్లను మినహాయిస్తే, ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులు రూ.8,556.51 కోట్లు మాత్రమే. ప్రస్తుతం మరో రూ.5,657.13 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక వచ్చే మార్చి నాటికి రూ.10,590 కోట్లు, జూన్ నాటికి మరో రూ.9,492 కోట్లు అవసరం ఉంటుందని ఆర్థిక శాఖకు నీటి పారుదల శాఖ తెలిపింది. మొత్తంగా రూ.25 వేల కోట్ల మేర నిధులపై నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌లతో నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు చర్చలు జరుపుతున్నారు.
సవరించిన వాటిపైనా విముఖత
ప్రస్తుత రాష్ట్ర ప్రాధమ్యాలు, మే నెలలో రైతు పెట్టుబడి పథకం కింద చెల్లించాల్సిన నిధుల దృష్ట్యా.. ప్రతిపాదనలను మరింత తగ్గించాలని నీటి పారుదల శాఖకు ఆర్థిక శాఖ సూచించింది. దీంతో కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులకు జూన్ వరకు కనిష్టంగా రూ.9,255 కోట్లయినా ఇవ్వాలని కోరింది. ఇందులో మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు రూ.955 కోట్లు, ఏఎంఆర్‌పీ, డిండిలకు రూ.1,450 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,600 కోట్లు, ఎల్లంపల్లి, వరద కాల్వలకు రూ.వెయ్యి కోట్లు, తుపాకులగూడెం, ఎస్సారెస్పీ స్టేజ్–2లకు రూ.320 కోట్లు, ఆదిలాబాద్‌లోని మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.750 కోట్లు, దేవాదుల పరిధిలో రూ.వెయ్యి కోట్లు, ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు రూ.1,060 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనలపైనా ఆర్థిక శాఖ నుంచి సుముఖత రానట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు గరిష్టంగా రూ.3 వేల కోట్ల వరకు సర్దుబాటు చేయగలమని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై మరోమారు ఆర్థిక పరిస్థితిని సమీక్షించి నిర్ణయం చెబుతామని తెలిపినట్లు సమాచారం.
కాళేశ్వరానికే మెజారిటీ నిధులు
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా కాళేశ్వరం ఎత్తిపోతలను భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ నాటికి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలనే నిశ్చయంతో ఉంది. ఇందుకు మేడిగడ్డ బ్యారేజ్ మొదలు ఎల్లంపల్లి (లింక్–1) పనులకు రూ.7,400 కోట్లు ఆంధ్రా బ్యాంకు నుంచి, ఎల్లంపల్లి–కొండపోచమ్మ సాగర్ (లింక్–2) కోసం రూ.11,400 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటోంది. ఇందులో లింక్–1 పరిధిలో మార్జిన్ మనీ కింద 30 శాతం, లింక్–2లో మార్జిన్ మనీ కింద 20 శాతం నిధులను ప్రభుత్వం ముందుగానే జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటికే రూ.3,250 కోట్ల మేర అవసరం అవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే లింక్–1 పరిధిలో అక్టోబర్ నాటికి ఆంధ్రా బ్యాంకు రూ.2,634.85 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.2,215.5 కోట్లు మంజూరు చేశాయి. అయినప్పటికీ ఈ లింక్‌ల పరిధిలో రూ.1,694 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం పనులకు మార్చి నాటికి రూ.4,125 కోట్లు, జూన్ నాటికైతే రూ.8,950 కోట్లు అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. జూన్ నాటికి అవసరమయ్యే నిధులతో చూసినా మార్జిన్ మనీ కింద రూ.1,790 కోట్లు, పాత బకాయిలు కలిపి రూ.3 వేల కోట్ల వరకు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment