
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ గత బీఆర్‌ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ పాలకులు దోచుకుపోతుంటే అందుకు సహకరించిన బీఆర్‌ఎస్ పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించగా, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ సంతకాలు చేశారని ఆయన గత బీఆర్‌ఎస్ పాలకులపై మండిపడ్డారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అన్యాయానికి సమ్మతి తెలిపారని ఆరోపించారు.
కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు 2020 వరకు నిర్వహించిన అన్ని సమావేశాల్లో గత ప్రభుత్వం ఈ కేటాయింపులను అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలసి గురువారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఉత్తమ్ తిప్పికొట్టారు.
బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో జరిగిన వరుస అన్యాయాల క్రమాన్ని తేదీలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019–22 మధ్యలో ఏపీ ఏటా వరుసగా 653 టీఎంసీలు, 629 టీఎంసీలు, 621 టీఎంసీలను తరలించుకుపోయినా, గత పాలకులు చూస్తుండిపోయారన్నారు.
ఏపీని అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది..
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోవడంపై తాను ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఫిర్యాదు చేయగా, ఏపీని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకి ఇప్పటికే తాము 67 టీఎంసీల కేటాయింపులను సాధించామని, నెలాఖరులోగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులిస్తామని కేంద్ర మంత్రి మరో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జీరో వడ్డీ, 50 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపారని వివరించారు.

సాగర్‌ను ఏపీకి అప్పగించారు..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో 44 వేల క్యూసెక్కుల నుంచి 92,600 క్యూసెక్కులకు పెంచుకోగా, బీఆర్‌ఎస్ పాలకులు దానికి సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే వెలిగొండ, ఇతర ప్రాజెక్టులను ఏపీ పూర్తిచేసుకునేందుకు కూడా సహకరించారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాత్రి 2023 నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం 400–500 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సగభాగాన్ని ఆక్రమించుకోగా, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 5,000 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలకులు దీనిని చేష్టలుడిగి చూశారని ధ్వజమెత్తారు.
అన్యాయం చేసింది వారే..
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది హరీశ్‌రావు, కేసీఆర్, మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావే అని, వారికి ఉరేసినా తప్పులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వారిది దొంగల తెలివి అని, ప్రశ్నించిన వారిని హత్యలు చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment