
హైదరాబాద్, సాక్షి: మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఓ కొలిక్కి వస్తున్న వేళ.. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
‘‘కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. గతంలో భువనగిరి ఎంపీ పదవిని సమర్దవంతంగా నిర్వహించా. నాకు హోంమంత్రి అంటే ఇష్టం. అయినా ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా. ప్రజల పక్షాన నిలబడతా. ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు ఉంది. నాకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అయితే ఫోన్ రాలేదు’’ అని అన్నారాయన.
నమస్తే మంత్రి వివేక్..
అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య సరదా సంభాషణ జరిగింది. వివేక్ వెంకటస్వామి ఎదురుపడడంతో.. నమస్తే మంత్రి అని పలకరించారు మల్లారెడ్డి. దీనికి థాంక్స్ మల్లన్న అంటూ మురిసిపోయారాయన. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందని మల్లారెడ్డి అనగా.. బీఆర్ఎస్ హయంలో నీ హవా నడిచిందంటూ వివేక్ కౌంటర్ ఛలోక్తి విసిరారు.