డ్యామ్ స్పిల్‌వేలో గుంతలు పూడ్చి సామర్థ్యం పెంచుతాం
ప్రాజెక్టు మరమ్మతులపై ఐఐటీ రూర్కితో అధ్యయనం
నెల్లికల్లు ఫేజ్–1 కింద వచ్చే ఖరీఫ్‌కు నీళ్లు అందిస్తాం
ఎస్‌ఎల్‌బీసీ హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య లింక్ కాల్వ
సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్‌వేకి పడిన గుంతలను పూడ్చివేసి ప్రాజెక్టును పటిష్టపరిచి.. దాని కింద ఆయకట్టు పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ మరమ్మతులపై ఐఐటీ రూర్కీ నిపుణులతో అధ్యయనం జరిపించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
సాగర్ కెనాల్ నెట్‌వర్క్‌కు సైతం మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
చిన్న లిఫ్టులతోనే అధిక ప్రయోజనం
రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలోని 334 చిన్న ఎత్తిపోతల పథకాలు కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొన్ని లిఫ్టులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. పూర్తి సామర్థ్యంతో సాగునీటి సరఫరా చేసేలా ఈ లిఫ్టులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
చిన్న ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సత్వరం పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఆదేశించారు.
రూ.664.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరందించాలని ఆదేశించారు.
లోలెవల్ కాల్వకు మహర్దశ
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగమైన హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య 15 కి.మీల లింక్ కాల్వ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మేడవార్మ్, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను అనుసంధానం చేస్తూ లింక్ కాల్వను నిర్మిస్తామని చెప్పారు.
రూ.62.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న లింక్ కాల్వ నిర్మాణానికి 65.02 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటికే 43.31 ఎకరాల సేకరణ పూర్తయ్యిందని, తక్షణమే టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో 0–63 కి.మీల లోలెవల్ కాల్వ లైనింగ్ పనులను చేపడుతామని తెలిపారు.
అదనంగా లోలెవల్ కాల్వకు సంబంధించిన డీ–1 నుంచి డీ–27 వరకు డిస్ట్రిబ్యూటరీలకు 60 మి.మీల మందంతో కాంక్రీట్ లైనింగ్ వేసి కాల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 90.43 కి.మీల పొడవైన ఈ డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు రూ.42.26 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఫ్లడ్ ఫ్లో కాల్వగా పేరొందిన లోలెవల్ కెనాల్ 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోనే 50 వేల ఎకరాలకు నీరందిస్తోందని తెలిపారు.
19 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30 వేల ఎకరాలను స్థిరీకరిస్తుందని వివరించారు. అనుమలవారిగూడెం వద్ద శశిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి అనుమతిచ్చారు. సాగర్ పరిధిలోని 39 ఐడీసీ లిఫ్టులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment