కొత్తగూడెం సీఈకి మంత్రి ఉత్తమ్ ఆదేశం
ఇరిగేషన్ ఈఎన్‌సీ (జనరల్)కి సంజాయిషీ నోటీసులు!.. ‘సీతారామ’ టెండర్ల నిర్వహణలో తప్పిదాలపై ఆగ్రహం
అనుమతుల్లేకుండానే టెండర్లు నిర్వహించడంపై సర్కారుపై విమర్శలు
ప్రభుత్వాన్ని తప్పుబట్టిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాళేశ్వరం, ‘పాలమూరు’పై హాహాకారాలు చేసేవారు ఇలా ఎలా చేస్తారని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా నిలదీత
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.
అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది.
డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్‌సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్‌సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మంత్రుల ఆదేశాల మేరకే..!
వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్‌లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్‌సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు.
మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం.
కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?
డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది.
అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
టెండర్లపై రాజకీయ రగడ
– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్
పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు.
ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తం
కాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment