Seetharama Lift Irrigation Scheme
-
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
‘జూన్ నాటికి సాగు నీరందించాలి’
సాక్షి, కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఆదివారం ఆమె భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న ప్రాజెక్టు కెనాల్, పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, కాం ట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2020 నాటికి సాగునీరు అందించేలా పనులు చేయాలన్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా చేస్తున్న పంప్‌హౌస్, కెనాల్ పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పంప్‌హౌస్ డ్రైరన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనకట్ట నుంచి బీజీకొత్తూరు వరకు కెనాల్ పనులు, పంప్‌హౌస్, వంతెనలు జన వరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 2 నెలలు యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. -
సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ అండ!
సాక్షి, హైదరాబాద్: నీటి లభ్యత పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నీరందని ఆయకట్టుకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించేందుకు కసరత్తు చేస్తోంది. సాగర్ కింద ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఖరీఫ్‌లో ఏటా సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీటిసరఫరా జరగకపోవడం, రబీలో అయితే నీటిలభ్యతే లేకపోవడంతో ఈ ఆయకట్టును గోదావరినీటితో పునీతం చేసేలా సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ ఆగస్టు నాటికే సీతారామలో మెజార్టీ పనులు పూర్తి చేసి సాగర్ కింద నీరిచ్చేలా కాల్వలు, పంప్‌హౌస్‌ల పనులు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో పెరిగిన వేగం.. దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించడంతోపాటు దారి పొడవునా చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు తొలి ఫలితాలు ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సాగర్‌కు ఆగస్టు, సెప్టెం బర్ వరకు నీరు రాకపోవడం, ఈ తర్వాత నీటి విడుదల జరిగినా ఖమ్మం పరిధిలోని ఖరీఫ్ పంటలు చివరిదశకు చేరుతుండటంతో మేలు జరగని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా దుమ్ముగూడెం నుంచి 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాలను మొదట పూర్తి చేసి సాగర్ ఎడమ కాల్వ కింద పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రూ.972 కోట్లతో చేపట్టిన కాల్వపనుల్లో రూ.783 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 7.19 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో ఇప్పటికే 4 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మిగతా పనులు వేగంగా జరుగుతున్నా, రెవెన్యూ, పోడుభూముల పట్టాల అంశం కొంత అడ్డంకిగా మారింది. సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేయాలి. ఒక్కో పంప్‌హౌస్‌లో 6 మోటార్లు అమర్చాల్సి ఉండగా, మూడేసి పంపులను సిద్ధం చేసేలా లక్ష్యాలు విధించారు. ఇందులో మొదటి పంప్‌హౌస్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌస్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌస్‌ను అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసేలా ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించేలా ఈ పనులు జరగాలని సూచించారు. దీనికోసం 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, చెరువులు నింపాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాలకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తదితరులు ప్రాజెక్టు పరిధిలో పర్యటించి వచ్చారు. అటవీ, పోడు భూముల అంశానికి సంబంధించి ఉన్న చిన్న, చిన్న అడ్డంకులను వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. -
‘సీతారామ’పై కొత్త ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు మళ్లీ కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ప్రాజెక్టు పాతదేనని తెలంగాణ స్పష్టం చేసినా, దాన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డు మళ్లీ ప్రశ్నలు సంధించింది. నిర్మాణ ప్రాంతం, ఆయకట్టు, నీటి పరిమాణం, వ్యయం మారాయంటూ దానిపై సమాధానాలు కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖ ద్వారా రాష్ట్రాన్ని ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్ ఇన్‌టేక్‌కు చెందిన పనులు ఏపీలోకి వెళ్లడం, రాజీవ్‌సాగర్ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో వీటిని సమీకృతం చేసి కొత్తగా సీతారామ ఎత్తిపోతలను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని గోదావరి బోర్డు గతంలోనే తెలిపింది. దీనిపై వివరణ ఇచ్చిన తెలంగాణ కాళేశ్వరం మాదిరే దీన్ని రీ–డిజైన్ చేశామని అందుకే పాత ప్రాజెక్టుగా గుర్తించాలని కోరింది. దీనిపై బోర్డు ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉందని, ప్రస్తుత రీ–డిజైన్‌లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారని, ఇక గతంలో ఆయకట్టు 3.24లక్షలుండగా, దాన్ని 6.74లక్షల ఎకరాలకు పెంచారని, వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోటుండగా, అది 13,384.80కోట్లకు పెరిగిందని, ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదని ప్రశ్నించింది. -
‘సీతారామ’ కొత్తదా? పాతదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల కొత్తదా, పాతదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టు పాతదేనని రాష్ట్రం పలుమార్లు స్పష్టం చేసినా దీన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తామంటూ గోదావరి బోర్డు పదేపదే లేఖలు రాస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పాతదే అని చెప్పడానికి గల కారణాలను పేర్కొంటూ మరోసారి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్ ఇన్‌టేక్‌కు సంబంధించిన పనులు ఏపీలోకి వెళ్లాయి. ఇక రాజీవ్‌సాగర్ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో అటవీ అను మతులు ఇబ్బందిగా పరిణమించాయి. దీంతో దీన్ని రీ ఇంజనీరింగ్ చేసిన ప్రభుత్వం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి గోదావరి నుంచి 50 టీఎంసీల జలాలను తీసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామ ఎత్తిపోతలను చేపట్టింది. అనంతరం గోదావరి నీటిని 70 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు ఉందని గుర్తించి, అందుకు అనుగుణంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్‌ల్లోని ఆయకట్టుతో తాగు, పరిశ్రమల అవసరాలకు నీరిచ్చే అవకాశం ఉందని గుర్తించి.. దీనికిఅనుగుణంగా ఆయకట్టును 5లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. ఏడాదిగా ఇదే తీరు..: మారిన డిజైన్‌కు అనుగుణంగా కేంద్ర సంస్థల నుంచి అనుమతి కోరుతూ గత ఏడాదే ప్రభుత్వం కేంద్రానికి రిపోర్టు పంపింది. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ గోదావరి బోర్డు నుంచి వివరణ కోరింది. అయితే అప్పటికే ఏపీ చేసిన ఫిర్యాదుల దృష్ట్యా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని, గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని తెలిపింది. దీనిపై అంతకుముందు గోదావరి బోర్డు సమావేశాల్లో తెలంగాణ వివరణ ఇచ్చినా, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ప్రాజెక్టేనని చెబుతూ వచ్చింది. ఇటీవల సైతం ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు సమర్పించాలని బోర్డు రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డుకు వివరణ ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల మాదిరే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాత ప్రాజెక్టులనే రీ డిజైన్ చేశామని, కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘం గుర్తించినప్పుడు సీతారామ సైతం పాతదే అన్న అభిప్రాయాన్ని బోర్డుకు తెలియజేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నట్లు తెలిసింది. -
3,560 కోట్లతో ‘సీతారామ’ రెండోదశ
వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా 4 ప్యాకేజీల అంచనాలు సిద్ధం ఫిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులకు రూ.3,560 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. ఫిబ్రవరి రెండో వారానికి టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. నిజానికి ఖమ్మం జిల్లాలో 5 లక్షలకు ఎకరాలకు నీరిచ్చేందుకు రూ.7,926 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో తొలి దశలో దుమ్ముగూడెం నుంచి 39వ కిలో మీటర్ కెనాల్ వరకు సీతారామ ప్రాజెక్టు పనులను 3 ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. మొదటి కిలోమీటర్ ప్రాంతం ఉన్న అమ్మవారిపల్లి నుంచి బీజీ కొత్తూరు వరకు ఉన్న 10.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్‌కు మొదటి ప్యాకేజీని రూ.1,455 కోట్లు, బీజీ కొత్తూర్ నుంచి వేపలగడ్డ(32వ కిలోమీటర్) వరకు రెండో ప్యాకేజీని రూ.317 కోట్లు, వేపులగడ్డ నుంచి కోయగుట్ట వరకు(39.9వ కిలోమీటర్) వరకు రూ.254 కోట్లతో టెండర్లు పిలిచి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ప్యాకేజీ–2, 3 పనులను ఏజెన్సీలు ఆరంభించగా, మొదటి విడత పనులు మొదలవ్వాల్సి ఉంది. ఈ సమయంలోనే 39.9వ కిలోమీటర్ నుంచి 114.5 కిలోమీటర్ వరకు ప్రస్తుతం సర్వే సంస్థ వ్యాప్కోస్ ఇచ్చిన నిఏదిక ఆధారంగా అంచనాలు సిధ్దమయ్యాయి. ఇందులో ప్యాకేజీల–4, 6లోని కోయగుట్ట, కమలాపురం పంప్‌హౌజ్‌ల అంచనాలు పూర్తి స్థాయిలో సిధ్దమవ్వాల్సి ఉండగా, మిగతా ప్యాకేజీలు 5,7,8,9ల అంచనాలు పూర్తయ్యాయి. ఇందులో ప్యాకేజీ–5 రూ.418కోట్లు, ప్యాకేజీ–7 (59.07వ కి.మీ నుంచి 83 కి.మీ వరకు)రూ.382.74కోట్లు, ప్యాకేజీ–8(83 కి.మీ. నుంచి 110కి.మీ.వరకు) రూ.537.41, ప్యాకేజీ–9 (110.42 నుంచి114.5 కి.మీ వరకు) రూ.176.59 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ప్యాకేజీ–9లో 110.4వ కిలోమీటర్ నుంచి 112.42 కిలోమీటర్ వరకు రెండు కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ నాలుగు ప్యాకేజీలకు పంప్‌హౌస్ కింద వేసిన ప్రాధమిక అంచనా కలిపితే మొత్తంగా రెండోదశ రూ.3,560 కోట్లు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ పంప్‌హౌస్‌ల వ్యయం కచ్చితంగా తెలిసిన వెంటనే వచ్చే పిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచేలా అధికారుల కసరత్తు జరుగుతోంది. -
సీతారామ ప్రాజెక్టు@10 వేల కోట్లు
పనులకు కొత్త రేట్లను అమలు చేయాలని సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేస్తూ ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు (ఎస్ఎస్ఆర్) అమలు పరచాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కొత్త అంచనాలతో సిద్ధం చేసిన పనుల్లో తొలి విడతగా రూ.1,863 కోట్ల పనులకు టెండర్లు పిలవనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. దుమ్ముగూడెం నుంచి 39వ కిలోమీటర్ కెనాల్ వరకు పనులకు కొత్త రేట్లను అమలుచేస్తే రూ.457 కోట్ల వరకు భారం పడుతుందని తేల్చారు. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.8 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు. 2018-19 నాటికి పూర్తి చేసే లక్ష్యం వాస్తవానికి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,967 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.2,790 కోట్ల వ్యయం తో వచ్చే ఏడాది జూన్ నాటికే లక్ష ఎకరాల స్థిరీకరణ, మరో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు వద్ద 19 టీఎంసీలు, జగన్నాథపురం వద్ద ఒక టీఎంసీ, బయ్యారం వద్ద 1.5 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాజెక్టు అంచనాలన్నీ 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్లతో రూపొందించారు. తాజాగా ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చడంతో వ్యయం పెరుగుతోంది. దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని వరకు పనులకు రూ.1,365.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. తాజా పెంపుతో రూ.1,823.03 కోట్లకు పెరిగింది. దుమ్ముగూడెం నుంచి 10వ కిలోమీటర్ వరకు రూ.778.48 కోట్ల నుంచి రూ.962.43 కోట్లకు, 11వ కిలోమీటర్ నుంచి 21వ కిలోమీటర్ వరకు రూ.157.61కోట్ల నుంచి రూ.247.80కోట్లకు, 21వ కిలోమీటర్ నుంచి 36 కిలోమీటర్ వరకు పనులకు రూ.229.82 కోట్ల నుంచి రూ.360.5 కోట్లకు, 36-39 కిలోమీటర్ల మధ్య రూ.199.27కోట్ల నుంచి రూ.246.3 కోట్లకు వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలతో 39వ కిలోమీటర్ వరకు పనుల టెండర్లు పిలవాలని ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ కొత్త ధరలను అమలు చేస్తే ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్లకు చేరుతుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి.