సీతారామ ప్రాజెక్టు@10 వేల కోట్లు
పనులకు కొత్త రేట్లను అమలు చేయాలని సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేస్తూ ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్) అమలు పరచాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కొత్త అంచనాలతో సిద్ధం చేసిన పనుల్లో తొలి విడతగా రూ.1,863 కోట్ల పనులకు టెండర్లు పిలవనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. దుమ్ముగూడెం నుంచి 39వ కిలోమీటర్ కెనాల్ వరకు పనులకు కొత్త రేట్లను అమలుచేస్తే రూ.457 కోట్ల వరకు భారం పడుతుందని తేల్చారు. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.8 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు.
2018-19 నాటికి పూర్తి చేసే లక్ష్యం
వాస్తవానికి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,967 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.2,790 కోట్ల వ్యయం తో వచ్చే ఏడాది జూన్ నాటికే లక్ష ఎకరాల స్థిరీకరణ, మరో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు వద్ద 19 టీఎంసీలు, జగన్నాథపురం వద్ద ఒక టీఎంసీ, బయ్యారం వద్ద 1.5 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాజెక్టు అంచనాలన్నీ 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో రూపొందించారు. తాజాగా ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చడంతో వ్యయం పెరుగుతోంది.
దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని వరకు పనులకు రూ.1,365.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. తాజా పెంపుతో రూ.1,823.03 కోట్లకు పెరిగింది. దుమ్ముగూడెం నుంచి 10వ కిలోమీటర్ వరకు రూ.778.48 కోట్ల నుంచి రూ.962.43 కోట్లకు, 11వ కిలోమీటర్ నుంచి 21వ కిలోమీటర్ వరకు రూ.157.61కోట్ల నుంచి రూ.247.80కోట్లకు, 21వ కిలోమీటర్ నుంచి 36 కిలోమీటర్ వరకు పనులకు రూ.229.82 కోట్ల నుంచి రూ.360.5 కోట్లకు, 36-39 కిలోమీటర్ల మధ్య రూ.199.27కోట్ల నుంచి రూ.246.3 కోట్లకు వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలతో 39వ కిలోమీటర్ వరకు పనుల టెండర్లు పిలవాలని ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ కొత్త ధరలను అమలు చేస్తే ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్లకు చేరుతుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి.