
జలాశయం స్పిల్‌వే దిగువన విస్తరిస్తున్న భారీ గుంత
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని... తక్షణమే జోక్యం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఎన్.అనిల్‌కుమార్ బుధవారం ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. 1981లో నిర్మించిన శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన భీకర వరదలతో స్పిల్ వే దిగువన నీళ్లుపడే ప్రాంతంలో భారీ గుంత (ప్లంజ్ పూల్) ఏర్పడిందని గుర్తు చేశారు.
ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా ప్లంజ్ పూల్ విస్తరిస్తూ, జలాశయానికి ముప్పుగా పరిణమించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని 14 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేయగా.. 2009లో ఏకంగా 25లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. భారీగా నీటి విడుదలతో.. స్పిల్ వేకు దిగువన భూమి కోతకు గురై భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ గుంతను పూడ్చకపోతే 143.23 మీటర్ల ఎత్తున్న జలాశయం పునాదులను బలహీనపరిచి, డ్యామ్‌కు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ వంటి సంస్థలు అధ్యయనంలో తేల్చాయని వివరించారు.
జలాశయానికి ప్రమాదం జరిగితే భారీ నష్టం
శ్రీశైలం జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలను భారీ వరద ముంచేస్తుందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విపత్తును సృష్టిస్తుందని లేఖలో అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరా, జల విద్యుదుత్పత్తి నిలిచిపోతాయని పేర్కొన్నారు. జలాశయం పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్డీఎస్‌ఏను కోరారు.
వచ్చే వానాకాలంలో గుంత మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం రక్షణకు చర్యలు తీసుకోకపోతే దిగువన ఉన్న నాగార్జునసాగర్, ప్రకాశం బరాజ్‌లు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటాయన్నారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తాగు, సాగునీటితోపాటు చెన్నైకి తాగునీటి సరఫరా సైతం నిలిచిపోతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment