
సాక్షి, హైదరాబాద్: నీటి లభ్యత పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నీరందని ఆయకట్టుకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించేందుకు కసరత్తు చేస్తోంది. సాగర్ కింద ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఖరీఫ్‌లో ఏటా సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీటిసరఫరా జరగకపోవడం, రబీలో అయితే నీటిలభ్యతే లేకపోవడంతో ఈ ఆయకట్టును గోదావరినీటితో పునీతం చేసేలా సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ ఆగస్టు నాటికే సీతారామలో మెజార్టీ పనులు పూర్తి చేసి సాగర్ కింద నీరిచ్చేలా కాల్వలు, పంప్‌హౌస్‌ల పనులు చేస్తున్నారు.
సీఎం ఆదేశాలతో పెరిగిన వేగం..
దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించడంతోపాటు దారి పొడవునా చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు తొలి ఫలితాలు ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సాగర్‌కు ఆగస్టు, సెప్టెం బర్ వరకు నీరు రాకపోవడం, ఈ తర్వాత నీటి విడుదల జరిగినా ఖమ్మం పరిధిలోని ఖరీఫ్ పంటలు చివరిదశకు చేరుతుండటంతో మేలు జరగని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా దుమ్ముగూడెం నుంచి 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాలను మొదట పూర్తి చేసి సాగర్ ఎడమ కాల్వ కింద పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రూ.972 కోట్లతో చేపట్టిన కాల్వపనుల్లో రూ.783 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 7.19 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో ఇప్పటికే 4 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మిగతా పనులు వేగంగా జరుగుతున్నా, రెవెన్యూ, పోడుభూముల పట్టాల అంశం కొంత అడ్డంకిగా మారింది.
సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేయాలి. ఒక్కో పంప్‌హౌస్‌లో 6 మోటార్లు అమర్చాల్సి ఉండగా, మూడేసి పంపులను సిద్ధం చేసేలా లక్ష్యాలు విధించారు. ఇందులో మొదటి పంప్‌హౌస్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌస్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌస్‌ను అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసేలా ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించేలా ఈ పనులు జరగాలని సూచించారు. దీనికోసం 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, చెరువులు నింపాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాలకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తదితరులు ప్రాజెక్టు పరిధిలో పర్యటించి వచ్చారు. అటవీ, పోడు భూముల అంశానికి సంబంధించి ఉన్న చిన్న, చిన్న అడ్డంకులను వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment