సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి మూలకూ నీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం తదనుగుణంగా కార్యాచరణ శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి జలాలపై ఆధారపడి చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా పూర్వ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళికకు కార్యరూపం ఇస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు సాగర్‌లో భాగంగా ఉండే పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎగువన 6.30 లక్షల ఎకరాలకు నీరందించేలా రూ. 1,700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఈ వారంలోనే ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఎగువ నుంచి రాకున్నా ఢోకా లేదు..
సాగర్ పరిధిలో మొత్తంగా 6.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే సాగు ఆధారపడి ఉంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి అక్కడి కోయినా డ్యామ్, ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాకే శ్రీశైలం మీదుగా వరద నీరు సాగర్‌కు చేరుతోంది. అయితే ఏటా ఆగస్టు తర్వాత కానీ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి ప్రవాహాలు ఉండటం లేదు. సాగర్ పూర్తిస్థాయిలో నిండేందుకు సెప్టెంబర్, అక్టోబర్ పడుతోంది. దీంతో సాగర్ కింది ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీరు అందించడం గగనమవుతోంది. ఒకవేళ ఎగువ నుంచి ప్రవాహాలు కరువైతే ఖరీఫ్, రబీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సీజన్‌లలోనూ సాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించేలా గోదావరి జలాల తరలింపు చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు.
సాగర్ ఆయకట్టు పునరుజ్జీవం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని రిటైర్డ్ ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, వెంకట రామారావు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి నివేదికరూపొందించారు. మొత్తంగా సీతారామ ఏడు లిఫ్ట్‌ల ద్వారా 72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలేరు రిజర్వాయర్‌కు ఎగువన 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు, పాలేరు నుంచి సాగర్ రిజర్వాయర్‌కు మధ్య 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా పునరుజ్జీవ పథకాన్ని డిజైన్ చేశారు.
నాగార్జునసాగర్ 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను ఉపయోగించుకొని దాని పరిధిలోని 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు గల 2.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి 80 కి.మీ. నుంచి 104 కి.మీ. లింక్ కెనాల్ తవ్వాలని, దానికి 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను కలపాలని సూచించారు. మొత్తంగా సాగర్ కాలువపై ఆరు లిఫ్టులు, మున్నేరు వద్ద నిర్మించబోయే బ్యారేజీ వద్ద ఒక లిఫ్ట్‌తో కలిపి మొత్తం ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇందులో పంప్‌హౌస్‌ల ఎలక్ట్రో మెకానికల్ వర్క్‌లకు రూ. 725 కోట్లు, సివిల్ పనులకు రూ. 980 కోట్లు, ఇతర పనులకు రూ. 265 కోట్లు, నాన్ కాంట్రాక్ట్ ఐటమ్స్‌కు రూ. 250 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ. 2,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా ఇప్పటికే సీతారామ కింద చేపట్టిన నిర్మాణాలను మినహాయించడంతో రూ. 1,700 కోట్ల అంచనా వ్యయం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చారు.
రూ. 1,700 కోట్లతో ‘సాగర్’ పునరుజ్జీవం
Published Wed, Mar 4 2020 2:14 AM | Last Updated on Wed, Mar 4 2020 2:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment