Water supply
-
ఢిల్లీవాసుల హాహాకారాలు.. ఒకవైపు వాయు కాలుష్యం.. మరోవైపు నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్‌కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు మరమ్మతు పనులు చేయనుంది.ఈ కారణంగా ఈ ప్లాంట్లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
తిరుమలలో నీటి కోతలు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సకాలంలో వర్షం కురవనందున జలాశయాల్లో నీటి నిలువలు పూర్తిగా తగ్గిపోయాయని.. ఫలితంగా 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీ నగర్‌తో పాటు వ్యాపార ప్రదేశాలకు, దాతలు నిర్మించిన అతిథి గృహాలకు సైతం కోతలు విధిస్తున్నామని.. ఈనెల 25 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. కానీ, తిరుమలలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై ఆంక్షలు విధించటంపై స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా నీటి వృథాను అరికట్టేందుకు.. ఇక తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండిపోవటంతో నీటిని కిందికి సైతం విడిచిపెట్టారు. ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఒక మనిషి రోజుకి 90 లీటర్ల నీరు అవసరం. అలాగే, టీటీడీ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం తిరుమలలో ప్రతిరోజూ 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలలోని డ్యాంల నుంచి, మిగిలిన నీటిని తిరుపతి కళ్యాణీ డ్యాం నుంచి సేకరిస్తున్నారు.తిరుమల గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. అయితే, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ చెబుతోంది. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టడంతో పాటు నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. నిండుగా తిరుమల జలాశయాలు.. నిజానికి.. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జూలై, ఆగస్టు (వారం క్రితం వరకు) నెలల్లో మంచి వర్షాలు కురవగా.. తిరుమల జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇక తిరుమల జలాశయాలతో పాటు, తిరుపతి కళ్యాణీ డ్యాంలో 210 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులూ చెబుతున్నారు. మరోవైపు.. తిరుమలకు సంబంధించి అక్టోబరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు అధికారులు.ఇన్ని జలాశయాలు ఉన్నా.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా.. రద్దీ రోజుల్లో లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. తిరుమలలో నివాస ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల వరకు ఉంటారు. భక్తులు, స్థానికులు, వ్యాపార కేంద్రాలు, అతిథిగృహాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ తిరుమలలో గోగర్భం, పాపవినాశం, ఆకాశగంగా జలాశయాలతో పాటు కుమారధార, పసుధార జంట జలాశయాలను నిర్మించింది. వీటి ద్వారా నిత్యం పరిశుభ్ర జలాలు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి నీటిని వినియోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి సమీపంలో కైలాసగిరి రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తిరుమలకు తరలించేందుకు టీటీడీ రూ.40 కోట్లు కేటాయించింది. దీంతో భవిష్యత్తులో కూడా తిరుమలకు తాగునీటి కష్టాలు తలెత్తవని భావిస్తున్న తరుణంలో టీటీడీ తాజా నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.ఇదో అనాలోచిత నిర్ణయం.. ఎండా కాలంలోనే నీటి సరఫరా బాగా జరిగిందని, ఇప్పుడు వర్షాకాలంలో ఈ నీటి ఆంక్షలు, కోతలేంటంటూ భక్తులతో పాటు స్థానికులు టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. పైగా.. తిరుమలలో వ్యాపారులకు, స్థానికులకు నీటి కష్టాలు ఎప్పుడూలేవు. కరువు సమయంలో కూడా నీటి సమస్య తలెత్తకుండా టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించిన ఉదంతాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా మారిపోయాయని.. టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇది ఓ అనాలోచిత నిర్ణయమని వారంటున్నారు. కైలాసగిరి రిజర్వాయర్‌కు బ్రేక్.. కైలాసగిరి రిజర్వాయర్కి సంబంధించిన అదనపు పైప్‌లైన్ నిర్మాణం పనులు ఇప్పటికే 50 శాతం వరకు పూర్తయింది. దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు జరిగి పనులు సకాలంలో పూర్తయితే నీటి కొరత సమస్య తలెత్తే అవకాశంలేదు. కానీ, టీటీడీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుండడంతో కైలాసగిరి రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధుల చెల్లింపును ఆర్థిక శాఖ పక్కన పెట్టింది. నూతన పాలక మండలి ఆమోదం తెలిపిన అనంతరం నిధుల చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంచేయటంతో అవి నిలిచిపోయాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా నీటి సరఫరాపై ఆంక్షలు విధించడం ఏమిటని స్థానికులతో పాటు భక్తులు ప్రశ్నిస్తున్నారు.నీటిపై ఆంక్షలిలా..ప్రస్తుతం తిరుమలలో సుమారు 130 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని టీటీడీ అంటోంది. అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా.. తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్లో ఆరు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తారు. వ్యాపార సంస్థలకు ఉ.4 గంటలు, సా.4 గంటలు మాత్రమే సరఫరా జరుగుతుంది. తిరుమలలో నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేస్తారు. నిర్మాణాలకు నీటి అవసరం ఉంటే తిరుపతి నుంచి ట్యాంకర్ ద్వారా దాతలు తరలించుకోవాల్సిందే. -
హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్‌లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
హైదరాబాద్: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు(బుధ, గురు) నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని జలమండలి వెల్లడించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం కలుగుతుంది.ఎన్పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్‌ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్‌ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్‌లతోపాటు, స్టాండ్‌బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నీళ్లను దాచిపెట్టిన రేవంత్ సర్కార్..
-
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్‌లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్‌ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
fact check: పచ్చమీడియాకు ‘అతి’సారం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్‌పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్‌పాక్స్‌గా వైద్యులు గుర్తించారు. బ్లడ్‌షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్‌లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్‌పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్‌కు వచ్చాడు. వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్‌పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు వారితో ఫోన్లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి. గుండెపోటుతోనే పద్మ మరణం ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్‌లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది. కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా? కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు. అధికారులు అప్రమత్తం ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది. స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్‌పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు. అప్పట్లో జీజీహెచ్‌లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు -
Fact Check: మీ బుద్ధే కలుషితం
సాక్షి ప్రతినిధి, గుంటూరు ః గుంటూరు నగరంలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లలో రూ.కోట్ల ఖర్చుతో అంతర్గత నీటి సరఫరా, నూతన పైపులైన్లు, ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజులుగా గుంటూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వాంతులు, విరోచనాలతో కొంతమంది ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో దానిపై పచ్చమీడియా రాద్దాంతం చేస్తోంది. కలుషి త నీటితో ప్రాణాలు పోతున్నా పట్టవా అంటూ తుప్పు పట్టిన వార్తతో ఈనాడు పత్రికలో తప్పుడు కథనాలు రాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పైపు లైన్లు ప్రాణసంకటంగా మారాయని కలుషి త వార్తను వండివార్చింది. వాస్తవంగా పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పైపులైన్లను మార్చుతూ వచ్చింది. కానీ ఇవన్నీ కప్పిపుచ్చి పైపులైన్లు మార్చకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందంటూ పచ్చమీడియా కట్టుకథలు అల్లింది. వాతావరణ మార్పులు, కృష్ణానదిలో వస్తున్న నీటిలో తేడా వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని కాచి చల్లార్చి తాగాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. దశలవారీగా పైపులైన్లు మార్పు ఆరేడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మారుస్తూ వస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంచినీటి సరఫరా మెరుగు కోసం చర్యలు చేపట్టలేదు. కొత్తగా పైపులైన్లు వేసిన చోట కూడా ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరర్ధకంగా మారాయి. వైఎస్సార్సీపీ గుంటూరులో పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నగరంలో రూ.123.15 కోట్ల అంచనాలతో మంచినీటి సరఫరా కోసం ఖర్చు చేస్తున్నారు. అంతర్గత పైపులైన్లు మార్చడం కోసమే ప్రత్యేకంగా రూ. 44 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గతంలో పైప్లైన్లు వేసినప్పటికీ ఇంటర్ కనెక్షన్, సంజీవయ్యనగర్ రైల్వే ట్రాక్ క్రాసింగ్ చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం సంజీవయ్య నగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ చేయడం, ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్లైన్ అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా నీటి సరఫరాలో గతంలో ఉన్న సమస్యలు లేకుండా పోయాయి. తక్కెళ్లపాడు హెడ్‌వాటర్‌వర్క్స్ నుంచి గోరంట్ల కొండమీదకి పైపులైన్, కొండపై రిజర్వాయర్, కొండ నుంచి చిల్లీస్ రెస్టారెంట్ జంక్షన్ వరకూ 500 ఎంఎం గ్రావిటీ డి్రస్టిబ్యూషన్ పైపులైన్ కోసం రూ. 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోటీ 15 లక్షల రూపాయలతో సంగం జాగర్లమూడి హెడ్వాటర్వర్క్స్లోని పాత ఫిల్టరేషన్ ప్లాంట్‌ను పునరుద్దరించారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి సంజీవ్‌నగర్ రైల్వేగేట్‌కు 900 ఎంఎం పైపు లైన్ కోసం రూ. కోటీ 15 లక్షలు, సంజీవ్‌నగర్ రైల్వే గేట్ వద్ద ఇంటర్ కనెక్షన్‌కు రెండు కోట్ల రూపాయలు, నగరంలో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు రూ. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నగరంలో కొత్త పైపులైన్లు ఇవి కాకుండా గుంటూరు నగరంలో ప్రధానమైన పైపులైన్లతో పాటు అంతర్గత పైపులైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. తాజాగా అమృత్ పథకం కింద రూ. 184 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి మంజూరు అయ్యాయి. కృష్ణానది పక్కన ఉండవల్లి నుంచి మంగళగిరి వరకూ పాత పైపులైన్ మార్చడంతో పాటు అదనంగా కొత్త పైపులైన్ వేశారు. మంగళగిరి నుంచి గుంటూరు నగరంలోని తక్కెళ్లపాడుకు, సంగం జాగర్లమూడి నుంచి గుంటూరు నగరానికి కొత్త పైపులైన్లు వేయడంతో పాటు అంతర్గత పైపులైన్లు మార్చేందుకు ఈ రూ. 184 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. వీటికి సంబం«ధించిన డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయి. వీటన్నింటిని మరుగునపెట్టి బురద జల్లడమే పనిగా పచ్చమీడియా పెట్టుకుంది. -
ఏడు రోజుల్లో పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన బడి నాడు – నేడు తొలి దశ పనులు పూర్తైన పాఠశాలల్లో మరమ్మతులు, నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లకు పాఠశాల విద్య (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కె.భాస్కర్ సూచించారు. నాడు–నేడు తొలి దశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన జారీ చేశారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలన్నారు. ఈమేరకు ఈ నెల 21వ తేదీలోగా సమగ్ర నిర్వహణ, మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలు, బాలురుకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్లదేనని పేర్కొన్నారు. గ్రీన్ చాక్ బోర్డులు, ఐఎఫ్‌పీలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు. టాయిలెట్లలో అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో తలుపులు, కిటికీలు, సీలింగ్, అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ, పంపులు, వాటర్ పైపుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట ఫిల్టర్లను రీప్లేస్మెంట్ చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. స్కూళ్ల ఆవరణలో పెయింటింగ్ సరిగా లేకుంటే ఆయా సంస్థలకు తెలియచేసి రంగులు వేయించాలన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
నేడు నగరంలో తాగునీటి సరఫరా బంద్
వరంగల్ అర్బన్: వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో నేడు (శనివారం) నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద 60 ఎంఎల్డీ నీటి శుద్ధీకరణ కేంద్రంలో అంతర్గత నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వరంగల్ అండర్ రైల్వే గేట్ పరిధిలోని ప్రాంతాలైన తిమ్మాపూర్, కరీమాబాద్, పెరకవాడ, రంగశాయిపేట, ఉర్సు, శంభునిపేట, శివనగర్, ఖిలా వరంగల్, చింతల్, మామునూరు, సింగారం, బొల్లికుంట, భట్టుపల్లి, కడిపికొండ, రాంపేట, రాంపూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో ఒకరోజు నీటి సరఫరా బంద్ ఉంటుందని వివరించారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేయూ ఫిల్టర్ బెడ్ పరిధిలో రెండు రోజులు.. ఫిల్టర్ బెడ్ (కేయూసీ) పరిధిలో రెండు రోజులు (శని, ఆదివారాల్లో)నీటి సరఫరా ఉండదని ఈఈ రాజయ్య తెలిపారు. యాదవ నగర్ ప్రాంతంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అంతర్గత కనెక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేయూసీ ఫిల్టర్ బెడ్ పరిధిలోని విద్యారణ్యపురి, కొత్తూరు, గుడిబండల్, యాదవనగర్, పద్మాక్షికాలనీ, మచిలీబజార్, పలివేల్పుల, గుండ్ల సింగారం, పెగడపెల్లి, వంగపహాడ్, ముచ్చర్ల, భీమారం, చింతగట్టు, ఎరగ్రట్టు గుట్ట, హసన్‌పర్తి ప్రాంతాల్లో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేసినట్లు వివరించారు. అంతరాయానికి ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. -
నీరు లేదు.. వాన నీరే..
నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎస్వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్ 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..? -
హైదరాబాద్: నగరవాసులకు అలర్ట్.. 48 గంటలు నీళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆదివారం జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ –1 లో మెయిన్ పైపులైన్ తరలింపు నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇదీ పరిస్థితి.. దక్షిణ మధ్య రైల్వే శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపులైన్ ఉంది. రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం అక్కడ ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్‌కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్ష¯న్ పనుల చేపడుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాస్తవంగా పనుల పూర్తికి 66 గంటలు సమయం పడుతుందని ముందుగా భావించినప్పటిఈ వాటిని 48 గంటల్లో పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి అంతరాయం కలిగే ప్రాంతాలివే.. నగర శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, డిఫెన్స్ కాలనీ. నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్ మెయిన్–3 లైన్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్/శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు. పాక్షికంగా .. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్‌బీ, మలేసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు. లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్ బాచుపల్లి. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎం తదితర ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలని, అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకుని, నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు -
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సేనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి దృష్టి సారించాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్ మేయర్ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్‌లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్‌గా వినియోగించుకోవాలని తెలిపారు. కీవ్‌లోని సెంట్రల్ జిల్లాలు, డెస్న్యాన్ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు. కాగా రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది. చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్‌లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు.