సరఫరాపై టీటీడీ ఆంక్షలు
స్థానిక బాలాజీనగర్‌కి ఆరు రోజులకు ఒకసారి..
వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలే..
దాతలు నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా బంద్
ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలంటూ సూచన
ఈనెల 25 నుంచి అమలు.. టీటీడీ ఈఓ ఉత్తర్వులు
తిరుమల జలాశయాల్లో నీరున్నా ఇవేం ఆంక్షలంటూ భక్త, జనాగ్రహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సకాలంలో వర్షం కురవనందున జలాశయాల్లో నీటి నిలువలు పూర్తిగా తగ్గిపోయాయని.. ఫలితంగా 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని టీటీడీ ప్రకటించింది.
అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీ నగర్‌తో పాటు వ్యాపార ప్రదేశాలకు, దాతలు నిర్మించిన అతిథి గృహాలకు సైతం కోతలు విధిస్తున్నామని.. ఈనెల 25 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. కానీ, తిరుమలలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై ఆంక్షలు విధించటంపై స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా నీటి వృథాను అరికట్టేందుకు..
ఇక తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండిపోవటంతో నీటిని కిందికి సైతం విడిచిపెట్టారు. ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఒక మనిషి రోజుకి 90 లీటర్ల నీరు అవసరం. అలాగే, టీటీడీ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం తిరుమలలో ప్రతిరోజూ 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలలోని డ్యాంల నుంచి, మిగిలిన నీటిని తిరుపతి కళ్యాణీ డ్యాం నుంచి సేకరిస్తున్నారు.
తిరుమల గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. అయితే, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ చెబుతోంది. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టడంతో పాటు నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది.
నిండుగా తిరుమల జలాశయాలు..
నిజానికి.. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జూలై, ఆగస్టు (వారం క్రితం వరకు) నెలల్లో మంచి వర్షాలు కురవగా.. తిరుమల జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇక తిరుమల జలాశయాలతో పాటు, తిరుపతి కళ్యాణీ డ్యాంలో 210 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులూ చెబుతున్నారు. మరోవైపు.. తిరుమలకు సంబంధించి అక్టోబరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు అధికారులు.
ఇన్ని జలాశయాలు ఉన్నా..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా.. రద్దీ రోజుల్లో లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. తిరుమలలో నివాస ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల వరకు ఉంటారు.
భక్తులు, స్థానికులు, వ్యాపార కేంద్రాలు, అతిథిగృహాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ తిరుమలలో గోగర్భం, పాపవినాశం, ఆకాశగంగా జలాశయాలతో పాటు కుమారధార, పసుధార జంట జలాశయాలను నిర్మించింది. వీటి ద్వారా నిత్యం పరిశుభ్ర జలాలు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి నీటిని వినియోగిస్తున్నారు.
భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి సమీపంలో కైలాసగిరి రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తిరుమలకు తరలించేందుకు టీటీడీ రూ.40 కోట్లు కేటాయించింది. దీంతో భవిష్యత్తులో కూడా తిరుమలకు తాగునీటి కష్టాలు తలెత్తవని భావిస్తున్న తరుణంలో టీటీడీ తాజా నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఇదో అనాలోచిత నిర్ణయం..
ఎండా కాలంలోనే నీటి సరఫరా బాగా జరిగిందని, ఇప్పుడు వర్షాకాలంలో ఈ నీటి ఆంక్షలు, కోతలేంటంటూ భక్తులతో పాటు స్థానికులు టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. పైగా.. తిరుమలలో వ్యాపారులకు, స్థానికులకు నీటి కష్టాలు ఎప్పుడూలేవు. కరువు సమయంలో కూడా నీటి సమస్య తలెత్తకుండా టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించిన ఉదంతాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా మారిపోయాయని.. టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇది ఓ అనాలోచిత నిర్ణయమని వారంటున్నారు.
కైలాసగిరి రిజర్వాయర్‌కు బ్రేక్..
కైలాసగిరి రిజర్వాయర్‌కి సంబంధించిన అదనపు పైప్‌లైన్ నిర్మాణం పనులు ఇప్పటికే 50 శాతం వరకు పూర్తయింది. దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు జరిగి పనులు సకాలంలో పూర్తయితే నీటి కొరత సమస్య తలెత్తే అవకాశంలేదు. కానీ, టీటీడీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరుగుతుండడంతో కైలాసగిరి రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధుల చెల్లింపును ఆర్థిక శాఖ పక్కన పెట్టింది.
నూతన పాలక మండలి ఆమోదం తెలిపిన అనంతరం నిధుల చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంచేయటంతో అవి నిలిచిపోయాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా నీటి సరఫరాపై ఆంక్షలు విధించడం ఏమిటని స్థానికులతో పాటు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
నీటిపై ఆంక్షలిలా..
ప్రస్తుతం తిరుమలలో సుమారు 130 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని టీటీడీ అంటోంది. అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా.. తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్‌లో ఆరు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తారు. వ్యాపార సంస్థలకు ఉ.4 గంటలు, సా.4 గంటలు మాత్రమే సరఫరా జరుగుతుంది. తిరుమలలో నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేస్తారు. నిర్మాణాలకు నీటి అవసరం ఉంటే తిరుపతి నుంచి ట్యాంకర్ ద్వారా దాతలు తరలించుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment