
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–1బీ)ను ప్రయోగిస్తున్నారు.
ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం భారత సైన్యానికి అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి దాకా ఉన్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు.
పూర్తిస్థాయి సమాచారం అందిస్తుంది
భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్ కలిగిన చాయా చిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోనే టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్‌ను రోదశిలొకి పంపిస్తున్నారు. అబార్ట్ దృశ్యాలను అనుకరించడానికి, గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ సిస్టంను ప్రదర్శించడానికి దీన్ని రూపొందించారు.
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ61 ఉపగ్రహ వాహకనౌక