రేపు రాత్రి 9.58కి ప్రయోగం
నింగిలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు పంపేందుకు ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
ఇందుకోసం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్‌కు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా.. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ విజయాలకు చిహ్నంగా మారిపోయింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు.
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ 44.5 మీటర్లు ఎత్తు, 320 టన్నుల బరువు ఉంటుంది. కానీ పీఎస్‌ఎల్‌వీ 60కి స్ట్రాపాన్ బూస్టర్లు లేనందున 229 టన్నుల బరువే ఉంటుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్‌ను ప్రయోగిస్తారు.
చంద్రయాన్–4కు ఉపయోగపడేలా..
ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రూపొందించింది. వీటికి ఛేజర్, టార్గెట్ అని పేర్లు పెట్టింది. ఈ రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉంటాయి. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది.
భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్–4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయని పేర్కొంది. స్పాడెక్స్‌లో అమర్చిన జంట ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment