నీళ్లున్నా.. నిరుపయోగమేనా..?
అస్తవ్యస్తంగా తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ నిర్వహణ
8 నెలల నుంచి నిలిచిన నీటి సరఫరా
హుజూరాబాద్: తలాపునే సమద్రమున్నా చేప దూపకేడ్చినట్లు ఉంది తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ కింద ఎంపిక చేసిన గ్రామాల ప్రజల పరిస్థితి. నీటి వనరుల్లో సమృద్ధిగా నీళ్లున్నా.. ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరా జరగక నిరుపయోగంగా మారింది. ప్రజలకు రక్షిత తాగునీటినందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫిల్టర్‌బెడ్ 8 నెలలుగా పనిచేయడం లేదు. నిర్వహణలోపంతో నీటి సరఫరా నిలిచియింది. సంబంధిత గ్రామాల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. రూ.7.50 కోట్ల నాబార్డు నిధులతో హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లిలో ఫిల్టర్‌బెడ్ నిర్మించారు. దీనిద్వారా హుజూరాబాద్, భీమదేవరపల్లి, శంకరపట్నం, ఎల్కతుర్తి మండలాల్లోని 28 గ్రామాలకు ఫ్లోరైడ్హ్రిత నీటినందించేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. 64లక్షల80వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఫిల్టర్‌బెడ్ ప్రారంభం నుంచి ఈ స్థాయిలో నీటిని శుద్ధి చేసి పంపిణీ చేసిన దాఖలాల్లేవు.
కొరవడిన పర్యవేక్షణ
అధికారుల పర్యవేక్షణ లేక ఫిల్టర్‌బెడ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 8 నెలలుగా పూర్తిస్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలవనరులకు పుష్కలంగా నీరు వచ్చింది. 45 రోజులుగా తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సమృద్ధిగా నీళ్లు వచ్చాయి. అయినా నిధులలేమి కారణంగా నీటిశుద్ధి పనులు చేయక ఫిల్టర్‌బెడ్ నిరుపయోగంగా మారింది.
రూ.40 లక్షల బకాయిలు
ఫిల్టర్‌బెడ్ నిర్వహణను ఏటా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఇండిపెండెంట్‌గా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని, పంపు డ్రైవర్‌తోపాటు మరి కొందరిని కూలీలను ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.40 లక్షల గ్రాంట్ విడుదల చేసేది. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఈ గ్రాంట్ నిధులను 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా జెడ్పీకి విడుదల చేస్తోంది. దీంతో జెడ్పీ నుంచి ఆయా పంచాయతీలకు వెళ్తున్నాయి. వీటిని ఆయా పంచాయతీలు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్నాయి. ఈక్రమంలో ఫిల్టర్‌బెడ్ నిర్వహణ భారంగా మారి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క హుజూరాబాద్ నగర పంచాయతీ నుంచే రూ.11లక్షల బకాయిలు రావాల్సి ఉండగా, నిర్దేశిత ఒక్కో పంచాయతీ నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది.
ఏటా ఇబ్బందులు
తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ నిర్వహణ ప్రారంభం నుంచి అస్తవ్యస్తంగానే కొనసాగుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిల్టర్‌బెడ్ ద్వారా నీరందించేందుకు సింగాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. అయితే రిజర్వాయర్‌కు ప్రత్యేకించి తూము ఏళ్లు గడుస్తున్నా ఏర్పాటు చేయకపోవడంతో ప్రతిఏటా నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరా జరగకపోవడంతో హుజూరాబాద్ పట్టణంతోపాటు నిర్దేశిత గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నోటీసులు జారీ చేశాం
తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి సరఫ రా చేసిన నీటికి చెల్ల్లించాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీ పద్దులో జమయ్యాయి. ఈ నిధులను పూర్తిగా నీటిసరఫరాకు వినియోగించాల్సి ఉంది. దాదాపు రూ.40 లక్షల బకాయిలు రావాల్సి ఉంది. హుజూరాబాద్ నగర పంచాయతీకి బకాయిలు చెల్లించాలని ఆయా పంచాయతీలకు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
- రమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
thummalapalli filterbed, water supply, huzarabad, తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్, నీటి సరఫరా, హుజరాబాద్