గోదావరి మంచినీటి సరఫరా పథకం ఫేజ్–2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రూ.5,560 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు
నగరానికి అదనంగా అందుబాటులోకి రానున్న 170 ఎంజీడీల నీళ్లు
మూసీ ప్రక్షాళనతో పాటు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునరుజ్జీవనం
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది.
హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్‌లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది.
డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్‌స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్‌పూర్ వద్ద 780 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు.
ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది.
మొత్తం 15 టీఎంసీల తరలింపు
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment