
2025–2027 మధ్య మన దేశం ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు ఇవే..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025లో వెల్లడి
తాగునీటి సరఫరాలో ఐదో క్లిష్ట దేశంగా భారత్
మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో మన దేశం ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ఒకటి తాగునీటి సరఫరా కాగా... మరొకటి తప్పుడు సమాచారం. ఈ రెండు 2025–2027 మధ్య దేశానికి అత్యంత క్లిష్టమైన సమస్యలుగా మారుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ సమస్యలను ఇప్పటి నుంచే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించింది. ఇటీవల దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశానికి ముందు డబ్ల్యూఈఎఫ్ వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025ను విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నీటి సరఫరా కష్టాలు ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నట్టు ప్రకటించింది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అంశాలు తాగునీటి సమస్యకు కారణమవుతున్నట్లు వివరించింది. నీటి సరఫరా కొరతను ఎదుర్కొనే ‘టాప్ రిస్క్’ దేశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలిపింది. 2024లో నీటి సరఫరా సంక్షోభాన్ని ఏడు దేశాలు ఎదుర్కోగా, 2025 ప్రారంభంలో ఆ సంఖ్య 27కి పెరిగింది. రానున్న కాలంలో మరిన్ని దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
రెండో స్థానంలో తప్పుడు సమాచారం
భారతదేశం రానున్న రెండేళ్లలో నీటి సరఫరా సమస్యతోపాటు మరో నాలుగు ప్రమాదాలను ఎదుర్కోనుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2025 వివరించింది. వీటిలో తప్పుడు సమాచారం రెండో స్థానంలో, మానవ హక్కుల ఉల్లంఘన–పౌర స్వేచ్చ క్షీణత మూడో స్థానంలోను, కాలుష్యం నాలుగో స్థానంలోను, కార్మికుల కొరత–ప్రతిభ కొరత ఐదో స్థానంలో ఉంటాయని వెల్లడించింది.
గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల భారతదేశానికి గణనీయమైన ఆరోగ్య, ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించింది. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచం ఎదుర్కొనే మరో అత్యంత తీవ్రమైన ప్రమాదం విపరీతమైన వాతావరణ మార్పులేనని కూడా ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా విపరీత వాతావరణ మార్పులు మానవ వినాశనానికి దారితీస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వార్షిక నివేదిక ప్రకటించింది. విపరీత వాతావరణ మార్పుల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా 3,238 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇది 2022తో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది.