
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన 44,194 పనులు రద్దు
వాటిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన 7,797 పనులకు మళ్లీ అనుమతి
ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలిస్తామని హామీ
రాష్ట్రంలో ఇంకా 25 లక్షలకు పైగా ఇళ్లకు ఏర్పాటుచేయాలి
కానీ, ఇప్పుడు ఆమోదం తెలిపింది కేవలం మూడు లక్షలే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటుకు అమలు చేస్తున్న జల్‌జీవన్ కార్యక్రమానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికి మళ్లీ అనుమతిస్తోంది.
నిజానికి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, కుళాయిల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 పనులను రద్దు చేసింది. వీటిల్లోని 7,792 పనులను తిరిగి కొనసాగించేందుకు శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రద్దు చేసిన పనుల విలువ రూ.10,680.50 కోట్లు కాగా.. వాటిలో తిరిగి కొనసాగించాలని నిర్ణయించిన పనుల విలువ రూ.2,210 కోట్లు.
ఎన్నికల్లో అందరికీ అని హామీ ఇచ్చి..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ ఉమ్మడి మేనిఫెస్టోలో ‘ఇంటింటికీ తాగునీరు–ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్’ అంటూ హామీ ఇచ్చారు. కానీ, వీరి ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది కేవలం మూడు లక్షలకే. ఈ హామీ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 25.08 లక్షల ఇళ్లకు కుళాయిల ఏర్పాటు పనులను రద్దు చేసేదే కాదు.
పైగా.. అలా రద్దయిన వాటిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ నేతలు సూచించిన కొన్ని పనులను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమే అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కుళాయిలు..
వాస్తవానికి.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లుండగా.. 2019 ఆగస్టు 15 వరకు అంటే గత 72 ఏళ్లుగా కేవలం 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్తగా 39.71 లక్షల ఇళ్లలో ఏర్పాటుకాగా, ఇందులో 39.34 లక్షల కుళాయిలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఇంకా 25.08 లక్షల ఇళ్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment