
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యాశాఖ ‘వాటర్ బెల్’ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నందున రోజుకు మూడుసార్లు వాటర్‌బెల్ (Water Bell) అమలు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10, 11, 12 గంటలకు బెల్ మోగించాలని సూచించారు. అన్ని స్కూళ్లల్లోనూ ఈ వేళలు తప్పనిసరిగా పాటించాలని, తాగునీరు (Drinking Water) కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఉన్నత విద్య కరిక్యులమ్ సంస్కరణలకు కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ విద్య కరిక్యులమ్‌లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) –2020కి అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉప కులపతి డాక్టర్ వెంకయ్య చైర్మన్‌గా 12 మంది యూనివర్సిటీ, డిగ్రీ కాలేజీల ప్రొఫెసర్లు సభ్యులుగా కమిటీ నియమించింది. ప్రత్యేక సభ్యులుగా బెంగళూరు ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సదగోపన్, అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ అశ్విని కె ఓలేటిని నియమించింది.
అలాగే, ఇంజినీరింగ్ 3, 4 సంవత్సరాల కరిక్యులమ్ మార్పునకు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ చైర్మన్‌గా 13 మంది ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీలు మూడు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి.
‘ఆస్ట్రేలియాలో విస్తృత విద్యావకాశాలు’
భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య కోణంలో ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, రీసెర్చ్ ఆధారిత కోర్సుల ఫలితంగా వారిలో నైపుణ్యాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రభుత్వ అధినేత) పీటర్ మలినౌస్కస్ తెలిపారు. అదే విధంగా వీసా నిబంధనలు కూడా కఠినంగా లేవని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టడీ అడిలైడ్ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ..
‘ఆస్ట్రేలియాలో ఆర్‌అండ్‌డీ, టెక్, సైన్స్, హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత విద్యార్థులు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇదే వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలు టాప్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రవేశాలు పొందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్స్ కూడా లభిస్తాయి’ అని తెలిపారు.
చదవండి: 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు