![39. 34 lakh households in rural Andhra Pradesh to get tap connection in ys jagna govt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/WATER-TAP.jpg.webp?itok=AROwa_Gt)
లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఇళ్లు 95,53,169
2019 ఆగస్టు 15కు ముందు కొళాయిలు ఉన్న ఇళ్లు 30,74,310
2019 ఆగస్టు 15–2024 మే మధ్య కొత్తగా నీటి కొళాయిలు ఏర్పాటైన ఇళ్లు 39,34,705
కూటమి ప్రభుత్వం వచ్చాక కొళాయిలు ఏర్పాటైన ఇళ్లు 36,210
ఇంకా కొళాయిలు ఏర్పాటు చేయాల్సిన ఇళ్లు 25,07,944
సాక్షి, అమరావతి: తాగు నీటి(Drinking water) కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దూరంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకొంటుంటారు. అవీ ఎండితే నీరే దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్ధం చేసుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy).. నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజల నీటి వెతలను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్‌సభకు తెలిపింది.
కేంద్ర జల శక్తి శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్ల ఉన్నాయి. 2019 ఆగస్టు 15 వరకు.. అంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభుత్వాలు తాగు నీటి కొళాయిలు ఏర్పాటు చేశాయి.
2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36 వేల ఇళ్లకే కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/3_57.png)
గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షత మంచి నీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 11,400 కోట్ల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదేమని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment