![Subjee Cooler in farmers markets: IIT develops Subjee Cooler Bombay students](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/FFF.jpg.webp?itok=_ABliwxV)
కూరగాయలు 7 రోజులు నిల్వ చేసుకునే సౌకర్యం
పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రైతులకు పంపిణీ
తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు.. రెండో దశలో రాష్ట్రమంతా పంపిణీకి చర్యలు
ఈ సబ్జి కూలర్లను అభివృద్ధి చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు
కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగాయలతోపాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్ లేదా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. – సాక్షి, అమరావతి
మూడు మోడల్స్‌లో సబ్జి కూలర్లు
ఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసింది.
వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.
కుప్పంలో 50 మంది రైతులకు...
కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్ ఆర్గజనైషన్స్(వీవో) భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment