cooler
-
వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్‌ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..ఇన్‌స్టాగ్రామ్‌లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.ఈ కూలర్‌ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్‌తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్‌ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Sharp Fact Mind (@sharpfactmind) -
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.ఎయిర్ కండీషనర్లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?ఏసీ రిమోట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు. -
చిన్నారి ప్రాణాలు బలిగొన్న కూలర్
పెర్కిట్(ఆర్మూర్): వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారిని కూలర్ బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌లో నివసించే దీపిక, వినీత్ దంపతులకు ఆరేళ్ల కూతురు శృతిక ఉంది. ఎండాకాలం సెలవులు రావడంతో శృతిక పెర్కిట్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ ఇనుప కూలర్ వద్దకు వెళ్లి, దానిని తాకింది. కూలర్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో శృతిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటివరకు ఆడుకుంటూ సరదాగా గడిపిన చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కూలర్లో నీళ్లు పోస్తుండగా..
హైదరాబాద్: ఇంట్లో కూలర్లో నీళ్లు పోస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ రిసాలబజార్‌లో హర్షియాబేగం(29) తన భర్త మహ్మద్‌తో కలిసి ఉంటున్నది. ఆదివారం రాత్రి కూలర్‌ను ఆఫ్ చేయకుండా నీళ్లు పోసింది. అదే సమయంలో ఆమె కూలర్ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను కాపాడబోయిన మహ్మద్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. కాగా కూలర్ ఐరన్‌ది కావడంతో అందులోకి విద్యుత్ ప్రవహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వావ్! వాట్ ఏ కూల్ గ్యాడ్జెట్.. పది నిమిషాల్లోనే మీ వాతావరణం మారుస్తుంది
వేసవిలో ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు చేసుకునేందుకు ఎవరైనా సాహసిస్తారా? వేసవి ఎండలను తలచుకుంటేనే ముచ్చెమటలు పోస్తాయి, ఇక ఆరుబయట పిక్నిక్ పార్టీలు కూడానా అని అనుకుంటున్నారా? మరేం ఫర్వాలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ వెంట ఉంటే, వేసవిలోనైనా ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు భేషుగ్గా చేసుకోవచ్చు. ఇళ్లల్లో అమర్చుకునే ఏసీల మాదిరిగా దీనికి ఇన్స్టాలేషన్ బెడద ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకుపోవచ్చు. దీని బరువు పది కిలోలు మాత్రమే. పవర్ అడాప్టర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతను 16 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కోరుకున్న రీతిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే పరిసరాల్లోని ఉష్ణోగ్రతను ఇది ఇట్టే చల్లబరచేస్తుంది. చైనాకు చెందిన ‘నైట్‌కోర్’ బహుళజాతి సంస్థ ఈ పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
సోలార్ ‘ఆటో’ కూల్
నర్సాపూర్(జి): ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయట కాలుపెట్టేందుకు జనాలు జంకుతున్నారు. మరి పనిచేస్తే గానీ పూట గడవని వారి పరిస్థితి ఏంటి? అందుకే నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ సుదర్శన్ ఎండ నుంచి ఉపశమనానికి తన ఆటోలో చిన్న కూలర్ అమర్చుకున్నాడు. ఆటోపై సోలార్ పలకలను అమర్చాడు. దాని నుంచి వచ్చే విద్యుత్‌తో ఆటోలో అమర్చిన కూలర్ చల్లదనాన్ని ఇస్తోంది. అటు ప్యాసింజర్లూ చల్లగా ప్రయాణిస్తూ ఐడియా అదిరింది గురూ అంటున్నారు. -
అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్ సగటు విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫీడర్లు, డీటీఆర్లపై ఒత్తిడి.. ►గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది. ►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
మేడపై అమ్మాయి.. ఊరంతా గాలింపు..
►5 గంటలపాటు హైరానా పడిన పోలీసులు, కుటుంబ సభ్యులు ►చివరికి ఇంటిపై ఉన్న కూలర్లో దాక్కొనగా కనుగొన్న పోలీసులు ఖమ్మం : ఓ విద్యార్థిని ఆడిన నాటకంతో తల్లిదండ్రులు, పోలీసులు 5 గంటలపాటు నానా అవస్థలు పడ్డారు. అదృశ్యమైందనుకుని ఊరంతా గాలించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ట్రేస్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి విద్యార్థిని ప్రియుడు ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటిపైన ఉన్న వినియోగించని కూలర్లో దాక్కొని ఉన్న విద్యార్థినిని పోలీసులు గుర్తించారు. దీంతో 5 గంటల ఉరుకులు, పరుగుల నడుమ సాగిన హైడ్రామాకు తెరపడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... సారథినగర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని అదే ప్రాంతంలోని ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం రాత్రి మందలించారు. ఉదయం ఆరు గంటలకు లేచి చూడగా సదరు విద్యార్థిని కనిపించలేదు. దీంతో వారు చుట్టు పక్కల వెతకగా ఆచూకీ తెలియరాలేదు. విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యువకుడికి ఫోన్ చేయగా తాను సారపాకలో ఉన్నానని, విద్యార్థిని అదృశ్యం సంగతి తనకు తెలియదని వివరించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ మొగిలి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని సెల్‌ఫోన్ ట్రాకింగ్ పెట్టగా సిగ్నళ్లు సారథినగర్ ప్రాంతం నుంచే వస్తున్నాయని గమనించారు. విద్యార్థిని సైతం తన సెల్‌ఫోన్ ఆఫ్ చేయకపోవడంతో రింగ్ అవుతోంది. దీంతో రైలుపట్టాల వెంట జీఆర్పీ సిబ్బంది, పోలీసులు సుమారు గంటకు పైగా వెతికారు. అక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థిని ప్రియుడికి ఫోన్ చేసిన పోలీసులు గట్టిగా మందలించడంతో తాను ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది కనుక్కుని చెబుతానని చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి విద్యార్థిని వాళ్లింట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంట్లో కనిపించకపోవడం వల్లనే వెతుకుతున్నామని ఎక్కడుందో చెప్పమని హెచ్చరించారు. దీంతో ఆ యువకుడు మరోసారి విద్యార్థినికి ఫోన్ చేసి వివరాలు సేకరించి పోలీసులకు తిరిగి ఫోన్ చేసి విద్యార్థిని మేడపై ఉన్న కూలర్లో ఉందని చెప్పాడు. అనంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు మేడపై ఉన్న కూలర్లో చూడగా అందులో విద్యార్థిని ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. ఆమెను వెంటనే కిందకి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఐదు గంటలపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత చేసిన ఆ విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
ఈ కూలర్‌కు కరెంట్‌తో పనిలేదు
రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు కూడా కొనుగోలు చేయలేని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వీరిని దృష్టిలో పెట్టకుని బంగ్లాదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఇప్పుడు తక్కువ ఖర్చుతోపాటూ, విద్యుత్ అవసరం కూడా లేని 'ఎకో కూలర్' వాడకం పెరిగిపోతోంది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. మన దేశంలో కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ ఎకో కూలర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇది చాలా చిన్న ఐడియానే కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజలకు ఇదో మంచి అవకాశం. ఈ ఎకో కూలర్‌ను చాలా సులభంగా తయారు చేసుకొని కరెంట్ అవసరం కూడా లేకుండా దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. దీనికి ఉపయోగించే పరికరాలు కూడా మనం సాధారణంగా వాడి పడేసే వాటర్ బాటిల్లు, వాటిని గ్రిడ్‌లా అమర్చడానికి ఉపయోగపడే ఓ పరికరం. తయారు చేసే విధానం: ముందుగా సగం కట్ చేసిన కొన్ని వాటర్ బాటిళ్లను తీసుకోవాలి. వాటి మూత పరిమాణంలో ఓ కార్డ్‌బోర్డు అట్టకు సమాన దూరాల్లో బాటిల్‌ను అమర్చాడానికి వీలుగా రంధ్రాలు చేయాలి. వీటికి బయట వైపు వాటర్ బాటిల్లు ఉండేలా, లోపలి వైపు మూత భాగం ఉండేలా కార్డు బోర్డుకు బిగించాలి. ముఖ్యంగా బయటి వేడిగాలి లీకయ్యి లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని గది కిటికీకి అమర్చాలి. ఈ ఎకో కూలర్... బాటిల్ బయటివైపు భాగం నుంచి ప్రయాణించిన వేడిగాలిని కంప్రెస్ చేసి మూత భాగం గుండా చల్లని గాలిని పంపిస్తుంది. దీంతో గదిలో ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గి చల్లదనాన్నిస్తుంది. -
అరచేతిలో కూలర్...
కాసిన్ని నీళ్లు... పిసరంత కరెంటు.. బోలెడు చల్లగాలి. అదీ స్టోరీ! ఫొటోలో కనిపిస్తున్న ఎవాపోలార్ పోర్టబుల్ ఏసీ చేసే అద్భుతమిదే. కేవలం పదివాట్ల విద్యుత్తును మాత్రమే వాడుకుంటే 710 మిల్లీలీటర్ల నీటితో ఏడెనిమిది గంటలపాటు చల్లటి గాలినిస్తుంది ఈ గాడ్జెట్. దీని వెనుక ఉన్న టెక్నాలజీ చాలా సింపుల్. వేసవిలో వాడే ఎయిర్ కూలర్ల మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో అన్నీ హైటెక్. కూలర్లో నీటిని చల్లబరిచేందుకు మనం వట్టివేళ్లను వాడితే... ఎవాపోలార్లో అత్యంత సూక్ష్మమైన నానోఫైబర్‌లను ఉపయోగించారు. ఇదే పదార్థంతో తయారైన ఎయిర్ కండిషనర్లు ఇప్పటికే మాస్కోలోని మెట్రోరైల్ స్టేషన్లలో ఏళ్లుగా పనిచేస్తున్నాయి. ఫలితంగా పదివాట్ల విద్యుత్తుతోనే ఇది 500 వాట్ల కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందని కంపనీ అంటోంది. ప్రస్తుతం ఈ పోర్టబుల్ ఏసీ తయారీకోసం ఇండిగోగో ద్వారా నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాది లోపు ఇది అందుబాటులోకి వస్తుంది. -
సౌర శక్తితో పనిచేసే కూలర్
♦ అందిస్తున్న రాక్వెల్ ♦ త్వరలో మిల్క్ చిల్లర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శీతలీకరణ ఉపకరణాల తయారీలో ఉన్న రాక్వెల్ ఇండస్ట్రీస్ సౌర శక్తితో పనిచేసే కూలర్‌ను రూపొందించింది. కోకకోలా కోసం కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని ప్రాంతాల్లోని మహిళలను వ్యాపారులుగా మలిచేందుకు శీతల పానీయాల విక్రయ సంస్థ కోకకోలా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కూలర్లు సరఫరా చేస్తుంది. కోకకోలా ఒక్కో కూలర్‌కు తమకు రూ.35 వేలు చెల్లిస్తుందని రాక్వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా బుధవారం తెలిపారు. ఇది పూర్తిగా సౌర శక్తితో పనిచేస్తుందని అన్నారు. మేడ్చల్ వద్ద కంపెనీ ఇటీవల కొత్తగా స్థాపించిన ఫ్యాక్టరీ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ పొందిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. జర్మనీ కంపెనీ ఆర్డరు మేరకు సోలార్ ఫ్రీజర్‌ను సైతం రూపొందించామని వెల్లడించారు. భారత్‌లో సోలార్ ఆధారిత ఫ్రీజర్లు, కూలర్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ తమదేనని గుర్తుచేశారు. మిల్క్ చిల్లర్ సైతం: పాడి రైతుల కోసం తక్కువ ధరలో మిల్క్ చిల్లర్‌ను మూడు నెలల్లో ప్రవేశపెడుతున్నట్టు అశోక్ కుమార్ గుప్తా చెప్పారు. పితికిన పాలను చల్లబర్చడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. రాక్వెల్కు మేడ్చల్ వద్ద ఇప్పటికే ఒక ప్లాంటు ఉంది. షిఫ్ట్‌కు 350 యూనిట్లు ఫ్రీజర్లు, కూలర్లు తయారు చేస్తున్నారు. కొత్త ప్లాంటును రూ.28 కోట్లతో నెలకొల్పారు. ఇక్కడ షిఫ్ట్‌కు 500 యూనిట్లు రూపొందిస్తున్నారు. ఏటా 60,000 యూనిట్లు విక్రయిస్తోంది. 2014-15లో రూ.85 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు ఆశిస్తోంది. ఉపకరణాలను విక్రయించేందుకు 1,000 మంది ఫ్రాంచైజీలను నియమించాలన్నది కంపెనీ ప్రణాళిక. -
వాటర్‌మిలన్ కూలర్ స్లషీ
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - 1, చక్కెర - పావు కప్పు, నిమ్మరసం - అరకప్పు, నీళ్లు - పావుకప్పు, క్రష్డ్ ఐస్ - 1 కప్పు, ఉప్పు - అర చెంచా, పుదీనా ఆకులు - కావలసినన్ని తయారీ విధానం: ముందుగా పుచ్చకాయలోని గింజలు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి; ఇందులోంచి అరకప్పు ముక్కలు తీసేసి పక్కన ఉంచుకోవాలి; మిగతా ముక్కలతో పాటు నీళ్లు, చక్కెర కలిపి మిక్సీలో వేసి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి; తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం వేసి మరికాసేపు బ్లెండ్ చేయాలి; తర్వాత గ్లాసుల్లో క్రష్డ్ ఐస్, పుచ్చకాయ ముక్కలు వేసి... ఆపైన జ్యూస్ పోయాలి; చివరగా పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. కొన్ని దేశాల్లో అయితే... నీరు కలపకుండా దీనిని మెత్తని స్మూతీలా చేసుకుని స్పూన్‌తో ఆరగిస్తారు. -
పారిశుద్ధ్యం పాటించకుంటే జరిమానా
నగరవాసులకు పుణే కార్పొరేషన్ హెచ్చరిక పింప్రి, న్యూస్‌లైన్: ఇక మీదట పరిశుభ్రత పాటించని నగర వాసులకు పుణే కార్పొరేషన్ జరిమానా విధించనుంది. ఈ మేరకు రూపొందించిన నియమావళిని సర్వసభ అనుమతి పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వానికి పంపనున్నారు. ఇకపై నగర వాసులు తమ ఇళ్లలోని ఫ్రిజ్, కూలర్లలో నీటిని తరచూ మారుస్తూ ఉండాలని, లేకుంటే దోమల వ్యాప్తికి కారణమవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కీటకాలను నియంత్రించే పనిలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కాక్పొరేషన్ కీటకనాశక విభాగ ప్రముఖుడు డాక్టర్ వైశాలీ జాదవ్ తెలిపారు. కొన్నేళ్లుగా నగరంలో అధిక సంఖ్యలో దోమల గుడ్ల (డాస్) వ్యాప్తి జరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం 1996 అక్టోబర్ మధ్య కాలంలో ఆదేశించింది. దీని అధారంగా గత ఏడాది పుణే కార్పోరేషన్ డాస్ ఉత్పత్తికి కారణమయ్యేవారిపై జరిమానాలను విధించాలనీ, అలాగే వారిపై చట్టపరంగా నేరాన్ని మోపి శిక్షించాలని నిర్ణయించారు. దీనిపై నగర ప్రజల అభిప్రాయాన్ని సూచనలను కోరారు. అయితే ప్రజల నుంచి ఏ విధమైన స్పందన రాలేదని కార్పోరేషన్ ఆరోగ్య విభాగం తెలిపింది. తనిఖీలు ఇలా చేయనున్నారు.. అంటువ్యాధులతో డాక్టర్‌ను ఆశ్రయించే రోగుల వివరాలు సేకరించి వారి ఇంటి పరిసరాల్లోని ఇళ్లలో తనఖీలు చేయనున్నారు. ఫ్రిజ్‌లు, కూలర్లు, టెరస్లపై నీటి నిల్వ ఉండి డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తిస్తే ఆ ఇంటి యజమానికి రూ.1,000 జరిమానా విధిస్తారు. మరుసటి రోజుకూ శుభ్రపరచకపోతే రోజుకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూనే ఉంటారు.