ఈ కూలర్కు కరెంట్తో పనిలేదు
రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు కూడా కొనుగోలు చేయలేని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వీరిని దృష్టిలో పెట్టకుని బంగ్లాదేశ్లోని మారుమూల గ్రామాల్లో ఇప్పుడు తక్కువ ఖర్చుతోపాటూ, విద్యుత్ అవసరం కూడా లేని 'ఎకో కూలర్' వాడకం పెరిగిపోతోంది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది.
మన దేశంలో కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ ఎకో కూలర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇది చాలా చిన్న ఐడియానే కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజలకు ఇదో మంచి అవకాశం.
ఈ ఎకో కూలర్ను చాలా సులభంగా తయారు చేసుకొని కరెంట్ అవసరం కూడా లేకుండా దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. దీనికి ఉపయోగించే పరికరాలు కూడా మనం సాధారణంగా వాడి పడేసే వాటర్ బాటిల్లు, వాటిని గ్రిడ్లా అమర్చడానికి ఉపయోగపడే ఓ పరికరం.
తయారు చేసే విధానం:
ముందుగా సగం కట్ చేసిన కొన్ని వాటర్ బాటిళ్లను తీసుకోవాలి. వాటి మూత పరిమాణంలో ఓ కార్డ్‌బోర్డు అట్టకు సమాన దూరాల్లో బాటిల్‌ను అమర్చాడానికి వీలుగా రంధ్రాలు చేయాలి. వీటికి బయట వైపు వాటర్ బాటిల్లు ఉండేలా, లోపలి వైపు మూత భాగం ఉండేలా కార్డు బోర్డుకు బిగించాలి. ముఖ్యంగా బయటి వేడిగాలి లీకయ్యి లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని గది కిటికీకి అమర్చాలి. ఈ ఎకో కూలర్... బాటిల్ బయటివైపు భాగం నుంచి ప్రయాణించిన వేడిగాలిని కంప్రెస్ చేసి మూత భాగం గుండా చల్లని గాలిని పంపిస్తుంది. దీంతో గదిలో ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గి చల్లదనాన్నిస్తుంది.