అరచేతిలో కూలర్...
కాసిన్ని నీళ్లు... పిసరంత కరెంటు.. బోలెడు చల్లగాలి. అదీ స్టోరీ! ఫొటోలో కనిపిస్తున్న ఎవాపోలార్ పోర్టబుల్ ఏసీ చేసే అద్భుతమిదే. కేవలం పదివాట్ల విద్యుత్తును మాత్రమే వాడుకుంటే 710 మిల్లీలీటర్ల నీటితో ఏడెనిమిది గంటలపాటు చల్లటి గాలినిస్తుంది ఈ గాడ్జెట్. దీని వెనుక ఉన్న టెక్నాలజీ చాలా సింపుల్. వేసవిలో వాడే ఎయిర్ కూలర్ల మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో అన్నీ హైటెక్. కూలర్‌లో నీటిని చల్లబరిచేందుకు మనం వట్టివేళ్లను వాడితే... ఎవాపోలార్‌లో అత్యంత సూక్ష్మమైన నానోఫైబర్లను ఉపయోగించారు.
ఇదే పదార్థంతో తయారైన ఎయిర్ కండిషనర్లు ఇప్పటికే మాస్కోలోని మెట్రోరైల్ స్టేషన్లలో ఏళ్లుగా పనిచేస్తున్నాయి. ఫలితంగా పదివాట్ల విద్యుత్తుతోనే ఇది 500 వాట్ల కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందని కంపనీ అంటోంది. ప్రస్తుతం ఈ పోర్టబుల్ ఏసీ తయారీకోసం ఇండిగోగో ద్వారా నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాది లోపు ఇది అందుబాటులోకి వస్తుంది.