![Chandrababu Naidus govt is cancelling house plots allotted by YS Jagan Chandrababu Naidu's government is cancelling the house plots allotted by the YS Jagan govt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/PM_HOUSE.jpg.webp?itok=RXDYG1gQ)
గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం
18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇళ్లు కేటాయించిన కేంద్రం
ఏపీకి కేవలం 684 ఇళ్లే కేటాయింపు.. ఇందులో 505 ఇళ్లే మంజూరు
ఇదీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నిర్వాకం
చిన్న రాష్ట్రమైన మణిపూర్‌కు సైతం7,000 ఇళ్ల కేటాయింపు
లోక్‌సభ సాక్షిగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
వైఎస్ జగన్ హయాంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు.. 22 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: సొంత గూడు లేని గ్రామీణ పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కక్ష కట్టి రద్దు చేయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు కేంద్రం నుంచి గ్రామీణ పేదలకు ఇళ్ల కేటాయింపులు చేయించడంలో సైతం ఘోరంగా విఫలమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202425)లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ(పీఎంఏవైజి) కింద కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇళ్లు కేటాయించింది.
ఇందులో 35.58 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 684 ఇళ్లు కేటాయించి.. 505 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి ఇంత తక్కువ సంఖ్యలో పేదలకు ఇళ్ల కేటాయింపులు, మంజూరైన దాఖలాల్లేవు.
ఆఖరికి చిన్న రాష్ట్రమైన మణిపూర్ కూడా 7,000 ఇళ్లను దక్కించుకోగా.. ఆ మాత్రం కూడా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ గ్రామీణ పేదలకు ఇళ్లు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో ఉండటం గమనార్హం.
భారీగా నష్టపోయిన పేదలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధించడమే లక్ష్యంగా రెడ్‌బుక్ పాలనపైనే దృష్టి సారించింది తప్ప పేదలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేదలకు ఇంటి స్థలాలను కేటాయించి లబ్ధిదారుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది.
అర్హత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఇళ్లు కేటాయిస్తుంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పేదల ఇళ్లకు సంబంధించి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది.
దీంతో దేశంలోని 17 రాష్ట్రాలు లక్షలు, వేల సంఖ్యలో కేంద్రం నుంచి ఇళ్ల కేటాయింపులు దక్కించుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం వందల ఇళ్లతోనే సరిపెట్టుకుంది. దీంతో లక్షల సంఖ్యలో పేదలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
వైఎస్ జగన్ హయాంలో31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు.. 22 లక్షల ఇళ్లు
నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు పథకం కింద గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికిపైగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.
వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. మొత్తంగా దాదాపు 22 లక్షల ఇళ్లు. ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గత ఐదేళ్లలో సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం అందించారు.
ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు ఇస్తూ మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. ఇంతలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఈ ఇళ్లు పూర్తయితే జగన్‌కు మంచి పేరొస్తుందని.. ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తోంది. కాలనీల పేర్లు మార్చేస్తోంది.
నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్మాణం చేపట్టని స్థలాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని ప్రకటించింది. వచ్చే నెల తర్వాత పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వం అని తేల్చి చెప్పింది. ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment