![YS Jagan Mohan Reddy speaks to the media on Thursday](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/555.jpg.webp?itok=pSFYa3og)
ఒక్క సీటు ఉన్న టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి అరాచకం కాదా?: వైఎస్ జగన్
ఈ మాత్రం దానికి ఇక ఎన్నికలు ఎందుకు?
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా తాడిపత్రి, దర్శి.. రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకుగానూ వైఎస్సార్‌సీపీకి 18, టీడీపీకి 20 వచ్చాయి. రెండు స్థానాల వ్యత్యాసం ఉంది. మరి మేం ఆ రోజు తల్చుకుని ఉంటే తాడిపత్రిలో చైర్మన్ పదవిని కైవశం చేసుకునే వాళ్లం! కానీ ఆ రోజు మేం అలా చేయలేదు. అందుకే.. హ్యాట్సాఫ్ టూ జగన్ అని తాడిపత్రి టీడీపీ ఇన్చార్జ్, మున్సిపల్ చైర్మన్ ఆ రోజు ప్రశంసించారు (అప్పట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు! దీన్నే గవర్నెన్స్ అంటారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అధికార బలం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం, మనవి కాని పదవులను రాబట్టుకోవాలని అత్యాశకు పోవడం తప్పు. ఈ జ్ఞానం, బుద్ధి చంద్రబాబుకు లేకనే రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి, అమరావతి: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యం ఖూనీకి ప్రత్యక్ష నిదర్శనమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘తిరుపతి కార్పొరేషన్‌లో 49 స్థానాలు ఉంటే 48 వైఎస్సార్‌సీపీకి వచ్చాయి. అక్కడ టీడీపీకి ప్రజలు ఇచ్చింది కేవలం ఒక్క సీటు. మరి ఏమాత్రం సంఖ్యా బలం లేకుండా టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా దక్కుతుంది? ఇది అరాచకం కాదా?’ అని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
ఏలూరులో 50 మందికిగానూ 47 మంది వైఎస్సార్‌సీపీ బీ ఫామ్ మీద గెలిచారు. నెల్లూరులో 54కు 54.. హిందూపురంలో 38 సీట్లకు 29 స్థానాల్లో వైఎస్సార్‌సీపీకే ప్రజలు ఓటు వేశారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆరు స్థానాలు టీడీపీకి వచ్చాయి. కానీ ఈ రోజు సిగ్గు లేకుండా వాళ్ల మనిషిని చైర్మన్‌గా ఎన్నుకున్నట్టు డిక్లెయిర్ చేసుకున్నారు.
పాలకొండలో 20 సీట్లకు 17... తునిలో 30 స్థానాలకు 30.. పిడుగురాళ్లలో 33 సీట్లకుగానూ 33.. నూజివీడులో 32 సీట్లకు 25.. బుచ్చిరెడ్డిపాలెంలో 20 సీట్లకు 18.. నందిగామలో 20 సీట్లకుగానూ 13 చొప్పున వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. టీడీపీ నెగ్గేందుకు అవకాశం లేని చోట్ల సాకులతో ఎన్నికలు జరపడం లేదు.
నందిగామలో ఏకంగా మంత్రి కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారు. ఓటింగ్‌కు వస్తే చంపేస్తామని పోలీసుల సమక్షంలో బెదిరింపులకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే ఖూనీ చేస్తున్నారు. ఈమాత్రం దానికి ఇక ఎన్నికలు ఎందుకు? మేమే అన్ని గెలిచామని ప్రకటించుకోండి!
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..
మరి అవకాశం ఉన్నచోట చంద్రబాబు ఏమైనా ప్రభావం చూపుతున్నారా అంటే.. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే మన రాష్ట్రానికి వచ్చిందేమి లేదు. 12 మంది ఎంపీలున్న జేడీయూ బిహార్‌కు మఖానా బోర్డు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, కోసీ వెస్ట్రన్ కెనాల్‌కు ఆర్థిక సాయం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, మరో ఎయిర్‌పోర్టు అభివృద్ధి, మరో 4 ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పాట్నా ఐఐటీ ఆధునికీకరణ... ఇలాంటి ప్రత్యేక ప్రాజెక్టులన్నీ ఆ రాష్ట్రం సాధించుకుంది. మరి చంద్రబాబు ఏం సాధించారు?
ఆయన సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. పోలవరానికి డిమాండ్ గ్రాంట్స్‌లో రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తాం..! ప్రాజెక్టులో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తామని కేంద్రం చెబుతుంటే చంద్రబాబు ఏం చేశారు? 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లేనని కేంద్రం బడ్జెట్‌లో తేల్చి చెప్పింది.
పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేయడం గాలికి ఎగిరిపోయింది. పోలవరాన్ని నాశనం చేస్తుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గడ్డి తింటున్నారా? ఏం తింటున్నారు?
పథకాలన్నీ పాయె..
» 9 నెలల్లో రూ 1.45 లక్షల కోట్ల అప్పులు చేశారు.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఇచ్చారా?
» పేదలకేమైనా బటన్ నొక్కారా?
» కనీసం మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలేమైనా కొనసాగిస్తున్నారా? అంటే అదీ లేదు.
» పిల్లల చదువుల కోసం తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పాయే..
» రైతన్నలకు తోడుగా నిలిచిన రైతు భరోసా పాయే.. వసతి దీవెన పాయే..! విద్యాదీవెన అరకొర..!
» చేయూత లేదు.. ఆసరా లేదు!
» సున్నా వడ్డీ.. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎగనామమే!
» వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లా నేస్తం.. ఇలా గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే..!
» ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను ప్రోత్సహిస్తూ ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే..!
» మరి రూ.1.45 లక్షల కోట్లు.. ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?
» లేనిది ఉన్నట్లుగా చెబితే పెట్టుబడులు వస్తాయా?
» దావోస్ నుంచి నీతి ఆయోగ్ దాకా మీదంతా నెగిటివ్ ప్రచారమేగా..
» పెట్టుబడులు ఆకర్షించేలా ఏం చర్యలు తీసుకున్నారు?
» జిందాల్ వంటి సంస్థలను భయపెట్టి పంపేశారు..
» జిందాల్ వంటి వారికే ఈ పరిస్థితి ఉంటే ఎవరైనా ఎందుకు వస్తారు?
Comments
Please login to add a commentAdd a comment