
కలకలం రేపిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యలు
ఆయన అహంకారానికి అద్దం పట్టాయని విమర్శలు
పార్టీ ఎదుగుదలకు ఆటంకమని ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన
ఇలాంటి నేతకు మంత్రి పదవిపై సర్వత్రా చర్చ
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగే వారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) కుక్కలు, సన్నాసులుగా పేర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక సొంత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ‘జనంలోకి జనసేన’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 2న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో నాగబాబు మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది.
ఇంకా అది చేయలేదు.. ఇది చేయలేదు.. ఆ స్కీం రాలేదు.. ఈ స్కీం రాలేదని నోటికి వచ్చినట్టు వాగే వారు వైఎస్సార్‌సీపీ గూండాలు, కుక్కలు, సన్నాసులు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అటు సొంత పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసి చూపించే బాధ్యత తనది అంటూ జనసేన పార్టీ అధినేతగా పవన్‌కళ్యాణ్ ఎన్నికల ముందు అనేక సభల్లో స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ సొంత పారీ్టలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపై ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2014–19 మధ్య అప్పటి టీడీపీ–బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం ఆ ఐదేళ్లలో అమలు చేయకపోయినా పవన్‌కళ్యాణ్ పెద్దగా ప్రశ్నించని కారణంగానే 2019 ఎన్నికల్లో జనసేన తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే వారిని కించపరిచేలా, చులకనగా మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదని పెదవి విరుస్తున్నారు.
నాగబాబు తర్వలో ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా చేపట్టనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దం పడుతున్నాయని, ఇలాంటి వారికి మంత్రి పదవి ఇస్తే ఇక అంతేనని వివిధ రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో నాగబాబు ‘సైకిల్ తొక్కితే మనకు ఆరోగ్యం – సైకిల్‌ను తొక్కితే రాష్ట్రానికి ఆరోగ్యం’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు టీడీపీ–జనసేన శ్రేణుల మధ్య తీవ్ర దుమారం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment