కార్యకర్తలకు ఊపునిస్తున్న జగన్‌ 2.0! | KSR Key Comments Over YS Jagan Recent Speech | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు ఊపునిస్తున్న జగన్‌ 2.0!

Published Sat, Feb 8 2025 1:26 PM | Last Updated on Sat, Feb 8 2025 2:54 PM

KSR Key Comments Over YS Jagan Recent Speech

నాయకుడంటే మాటకు కట్టుబడిన వాడై ఉండాలి. విశ్వసనీయతకు నిలువుటద్దం కావాలి. కార్యకర్తలకు ధీమా ఇవ్వగలగాలి. ప్రజలను ఆదుకునే విధానాల రూపకర్త కావాలి. అప్పుడే ఎవరైనా ఆ నేతను నమ్ముతారు. గెలుపు, ఓటముల్లోనూ వెంట నిలుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ విషయంలోనూ జరుగుతున్నది ఇదే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవలి ప్రసంగాన్ని గమనిస్తే.. పైన మనం చెప్పుకున్న అన్ని లక్షణాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కారణం చేతనే రాష్ట్రంలో ఇతర పార్టీలకు లేని.. బలమైన, విశ్వసనీయమైన కార్యకర్తల వర్గం వైఎస్సార్‌సీపీని అన్నివేళలా అండగా నిలుస్తోందని చెప్పవచ్చు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం వీరందరిలో కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా.. తాము ఆశించినట్టుగానే తమ నేత మాటలు ఉన్నాయన్న ప్రశంసా వినిపిస్తోంది.

వైఎస్‌ జగన్ తన ఐదేళ్ల పదవీకాలంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడటమే కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో 98 శాతం విజయవంతంగా అమలు చేశారు కూడా. అలాగే రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో సరికొత్త వ్యవస్థలను తేవడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారు. మెడికల్‌ కాలేజీలు, నౌకాశ్రయాలు, అన్ని ఆధునిక హంగులతో పాఠశాలలు.. ఇలా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు.

అయితే, ఇన్ని చేసినా వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తూనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల మాయ ఉందన్న అంచనాలున్నా.. ఇతర కారణాలపై కూడా బాగానే చర్చ నడిచింది. ఈ కారణాల్లో ఒకటి.. జగన్‌ ప్రభుత్వం విషయంలో చూపినంత శ్రద్ధ కార్యకర్తల విషయంలో చూపలేదూ అన్నది! వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగినా కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గిందన్న వాదన కూడా ఉంది. జగన్‌ ఏర్పాటు చేసిన వ్యవస్థల కారణంగా ప్రజలు స్థానిక నేతలు, కార్యకర్తల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని, ఇది పార్టీకి కొంత నష్టం చేసిందన్న విశ్లేషణ కూడా జరిగింది.

నిజానికి స్థానిక సంస్థలలో పదవుల మొదలు, వివిధ నామినేటెడ్ పోస్టులలో వేలాది కార్యకర్తలకు అవకాశాలు కల్పించిన చరిత్ర వైఎస్‌ జగన్‌ది. అయినప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొంత తగ్గడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదని అంటారు. ఈ నేపథ్యంలో జగన్‌ ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలను తరచూ కలుస్తుండటం వారితో మాటలు కలుపుతుండటం అడిగిన వారికి లేదనకుండా సెల్ఫీలు ఇవ్వడం కార్యకర్తల్లో కొత్త జోష్‌, ఆనందం కలిగిస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతోంది. కేడర్‌ కూడా జగన్‌ను సెల్ఫీలు, కరచాలనాల విషయంలో మరీ ఇబ్బందికి గురి చేయకుండా ఉంటే మంచిది.

చంద్రబాబు ఏమో జన్మభూమి కమిటీల పేరుతో కార్యకర్తలను నియమించి ప్రజలను నానా పాట్లకు గురి చేశారు. దానివల్ల ఆయన ఓడిపోయినా, కార్యకర్తలు అంతవరకు చేసిన అక్రమ సంపాదన వల్ల  ఆర్థికంగా బలంగా ఉండగలిగారు. జగన్‌ మాత్రం ప్రజలకు నేరుగా ఎలాంటి వివక్ష, వేధింపులు, అవినీతి లేకుండా పథకాలను అందించారు. వాటిలో కార్యకర్తల ప్రమేయం తక్కువగా ఉండడంతో రాజకీయంగా నష్టపోయారు. కేడర్‌కు ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా దక్కలేదని చెబుతారు.

టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సూపర్ సిక్స్ పేరుతో చేసిన అసత్య ప్రచారం ప్రభావానికి ప్రజలు కొంతవరకు గురయ్యారని ఎల్లో మీడియా అసత్య కథనాలూ తోడైన కారణంగానే వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఇచ్చిన మాటను గూట్లో పెట్టేసిన కూటమి నేతల అసలు స్వరూపం ప్రజలకూ అర్థమవుతోంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు. తొమ్మిది నెలల కాలంలోనే రూ.80 వేల కోట్ల అప్పులు చేసి కూడా ప్రజలకు పైసా విదల్చకపోవడం వారికి తెలుస్తూనే ఉంది. సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడేయగా.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం కాస్తా రాష్ట్రంలో పరిస్థితులను అరాచకంగా చేసేశాయి. పేరుకే కూటమి కానీ.. పెత్తనమంతా టీడీపీ, మంత్రి లోకేషలదేనని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. జనసేన అధిపతి పవన్‌ కళ్యాణ్‌, బీజేపీలు పేరుకు మాత్రమే అన్నట్టుగా అయ్యింది.

ఈ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన మీడియాలో ఒక వర్గం.. ప్రతిపక్షంపై బురదజల్లడమే పనిగా పని చేస్తోంది. అయినా కూటమిపై  ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం కారణంగా స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అన్ని రకాల వేధింపులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో జగన్‌ విజయవాడలో చేసిన ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ వాగ్ధాన భంగాన్ని ప్రజలు గమనిస్తున్నారని, విధ్వంసకాండ, కక్ష రాజకీయాలు కూడా వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయని వివరించి, వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయమని చెప్పడం కార్యకర్తలకు పెద్ద భరోసానిచ్చింది.

కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి తనను వ్యక్తిగతంగా అక్రమ కేసులతో వేధించినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని తాను సీఎం పీఠాన్ని అధిరోహించిన విషయాన్ని కూడా జగన్‌ ప్రస్తావించారు. తద్వారా కష్టాలు వస్తూంటాయి.. పోతూంటాయన్న సందేశం ఇచ్చి కార్యకర్తలలో ధైర్యం నింపారు. విజయవాడ వంటి చోట్ల కార్పొరేటర్లు టీడీపీ ప్రలోభాలు, దౌర్జన్యాలను ఎదుర్కుని పార్టీ కోసం నిలబడ్డ తీరును అభినందించిన జగన్‌ చేసిన ఒక వ్యాఖ్య చాలా ఆసక్తికరమైంది. ఓడిపోయినా ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలుగుతున్నామని, గెలిచిన కూటమి నేతలు తొమ్మిది నెలలు తిరగకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజలు నిలదీస్తారన్న భయం కూటమి నేతల్లో ఉందని జగన్‌ చెప్పడం వాస్తవం.

అన్నమయ్య జిల్లాలో స్వయంగా చంద్రబాబే రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ ప్రశ్నలకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక, తనకు సంపాదించే మార్గం చెప్పాలని, ఐడియాలు చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పుకోవాల్సిన వచ్చింది. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతున్నాయి. జనంలోకి వెళ్లి వాస్తవాలను వివరించేందుకు అవకాశం కల్పిస్తోంది. జగన్ ఇస్తున్న సందేశం కూడా ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పాలి. జగన్ మరో మాట అన్నారు. చంద్రబాబు అండ్ కో ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, తాను అలా చేయలేనని చెప్పానని, ఓడిపోవడానికి అయినా సిద్దపడ్డాను కాని ప్రజలను మోసం చేయలేదని అన్నారు. ఇది సత్యం. వైఎస్‌ జగన్ కూడా కూటమికి పోటీగా వాగ్ధానాలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

వైఎస్‌ జగన్ రూ.70 వేల కోట్ల విలువైన హామీలు అమలు చేయడానికి చాలా శ్రమించవలసి వచ్చింది. అయినా అధికారం కోసం చంద్రబాబు లక్షన్నర కోట్ల విలువైన బూటకపు హామీలు ఇచ్చారు. అధికారం అయితే వచ్చింది కాని, కూటమిలో ఆ సంతోషం కనిపించడం లేదు. ఎంతసేపు వారు జగన్ ఫోబియాతో మాట్లాడుతున్నారు తప్ప, సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేకపోతున్నారు. ఒక ఏడాది మొత్తంలో ఒక్క స్కీము కూడా అమలు చేయని విఫల ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తానని జగన్ కేడర్‌కు భరోసా ఇవ్వడం ఒక నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పాలి.


- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement