వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నిర్ణయం రాజకీయాల్లో చంద్రబాబు... జగన్‌ల మధ్య తేడాను మరోసారి స్పష్టం చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ ఆరోపణలపై ప్రభుత్వం తిరుపతిలో సృష్టిస్తున్న అరాచకాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్ అత్యంత వివేచనతో రాజనీతిజ్ఞతన ప్రదర్శిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను చేసిన నీచ రాజకీయం నుంచి ఎలా బయటపడాలా? అని నానా పాట్లూ పడుతున్నట్లు స్పష్టమైంది. జగన్ తిరుమల రావడం చట్ట విరుద్ధమన్నట్టు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి రెండు రోజులుగా నానా రభస చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పాల్గొనొద్దని జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలకూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పార్టీ ప్రముఖుల గృహ నిర్బంధాలకూ పాల్పడ్డారు. అంతటితో ఆగారా? లేదు. డిక్లరేషన్ పేరుతో జగన్‌ను ఇరుకున పెట్టాలని కుట్ర పన్నారు. ప్రత్యేక బోర్డులు పెట్టి మరోసారి స్వామి వారికి అపచారం చేశారు. ఈ బోర్డులు పెట్టడం ద్వారా భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వారిని కూడా అడ్డుకున్నట్లు అయ్యింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన జగన్ ఆలయ సందర్శనను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించడంతో కూటమి నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారి శ్యామలరావు బాబు ఆడమన్నట్టల్లా ఆడుతూండటం కూడా ప్రజలు గమనిస్తునే ఉన్నారు. తప్పులమీద తప్పులు చేస్తున్నారు. తొలుత తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండకుండా, మాటలు మార్చే దుస్తితిని తెచ్చుకోవడం దురదృష్టకరం. అయితే లడ్డూ కల్తీపై చివరికి చంద్రబాబే తన మాటలను తానే మింగాల్సి వచ్చింది.
మాట తప్పడం, అవకాశవాదంతో మాట్లాడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే కానీ.. ఈ సారి ఇంతటి సెంటిమెంట్ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకోవలసి వచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నారో చూశారు కదా!ల డ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న మాటను తప్పించి, ఎక్కడో చోట కల్తీ నెయ్యి వాడారని గాత్రం మార్చారు. లడ్డూను అడ్డం పెట్టుకుని మత రాజకీయం చేయాలని, జగన్ ను దెబ్బకొట్టాలని చంద్రబాబు చేసిన కుట్ర భగ్నమైంది. ఎప్పుడైతే మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ప్రమాణం చేసి మరీ సవాలు విసిరారో.. అప్పుడే బాబు అబద్ధాలాడుతున్నట్లు స్పష్టమైంది. భూమన తిరుమలకు వెళ్లి పుష్కరిణిలో స్నానమాచరించి, ఆలయం ఎదుట ప్రమాణం చేశారు.
ఆ సమయంలో ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించినప్పుడే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమైంది. తిరుమలకు సరఫరా అయిన నేతిలో నాలుగు టాంకర్లు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని టీటీడీ పరీక్షలలో నిర్దారించుకుని వాటిని వెనక్కి పంపించి వేశామని ఈవో శ్యామలరావు స్వయంగా చెప్పారు. అయినా చంద్రబాబు కోట్లాది మంది ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరగించే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రకటించి వారి విశ్వాసాలకు విఘాతం కలిగించారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి వంద అబద్దాలాడుతారన్నట్లుగా చంద్రబాబు తాను చెప్పినదానిని నమ్మించడానికి విశ్వయత్నం చేశారు. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వగైరాలతో అసత్యాలు ప్రచారం చేయించారు. కొన్ని రోజులు సిట్ డ్రామా నడిపారు. అంతిమంగా ఆయనే దిగిరాక తప్పలేదు. తాను తీసిన గోతిలో తానే పడ్డారన్నమాట. సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అర్థం.
లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న వాదన నుంచి చంద్రబాబే తప్పుకున్న తర్వాత సిట్ వేసి ఎవరిని వేధిస్తారో తెలియదు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు ఏమి చెబుతారో అర్థం కాదు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ రాజకీయం చేశారు. జగన్ తిరుమలకు వచ్చి డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఒక రకంగా, సంతకం చేయకపోతే మరో రకంగా మత విద్వేషాలను నింపాలని యోచించారు. తిరుపతిలో అల్లర్లకు కూడా ప్లాన్ చేశారు. వారినెవ్వరిని పోలీసులు గృహ నిర్భందం చేయలేదు. వారికి నోటీసులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహాత్మకంగా తన వాదనను బలంగా వినిపించి తాత్కాలికంగా పర్యటనను వాయిదా వేసుకుంటున్నానని విజ్ఞతను, పరిపక్వతను ప్రదర్శించారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని ఇప్పటికే రావణాకాష్టంగా మార్చారని అలాంటప్పుడు అక్కడకు వెళ్లడం ద్వారా చంద్రబాబుకు మరింత అవకాశం ఇవ్వకుండా జగన్ జాగ్రత్తపడ్డారు. కొంతమందికి జగన్ వెళ్లి డిక్లరేషన్ పై సంతకం చేసి ఉండవచ్చు కదా అని అనిపించవచ్చు. కాని అలా చేస్తే అక్కడ జరిగే గొడవలన్నిటికి జగన్ నే బాద్యుడిని చేసి ఉండేవారు. పని కట్టుకుని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులను నియమించి జగన్ పై రాళ్లు, టమోటాలు, గుడ్లు వంటివి వేయించి, ఇదంతా భక్తుల నిరసనగా చిత్రీకరించేవారని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అది నిజమనిపిస్తుంది.ఈ అరాచకాలన్నిటి నుంచి జగన్ తప్పించుకోగలిగారనిపిస్తుంది. డిక్లరేషన్ పై సంతకం చేస్తే, ఇంతకాలం అలా చేయకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అది అపచారం అని నిస్సిగ్గుగా ప్రచారం చేసేవారు. డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడంతో, జగన్‌కు ఇష్టం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
టీటీడీ డిక్లరేషన్ బోర్డులు పెట్టి భక్తితో కొండకు వచ్చేవారిని అవమానించింది. జగన్ టూర్ వాయిదా పడగానే ఆ బోర్డులను తొలగించడంలోనే వారు తప్పు చేసినట్లు అంగీకరించినట్లయింది. నిజానికి ఇష్టం లేకుండానే, దైవ భక్తి లేకుండానే జగన్ ఇన్నిసార్లు తిరుమలకు వెళతారా? స్వామి వారి తిరునామాలు పెట్టుకుంటారా? సంప్రదాయాలను పాటిస్తూ పూజలలో పాల్గొంటారా? పవిత్ర స్నానంతో సహా పలు హిందూ సంప్రదాయాలను గౌరవించేవారా? చంద్రబాబు తన తండ్రి మరణించినప్పుడు తల వెంట్రుకలు తీయించుకోలేదేమో కాని, పిండ ప్రదానం చేశారో, లేదో కాని, జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిగా కృష్ణా నదిలో పిండ ప్రదానం చేశారు. అయినా ఈ ఉదంతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు దుర్మార్గపు రీతిలో వ్యవహరించారు. పైగా తిరుమలకు వెళ్లొద్దని తాము చెప్పామా అని చంద్రబాబు తన సహజ శైలిలో దబాయించే యత్నం చేశారు.
కాని మనసులో అరేరే...తన కుట్ర సఫలం కాలేదే అన్న భావన ఉండి ఉంటుంది. చంద్రబాబు మతం పూనిన వ్యక్తిగా నటిస్తూ జనాన్ని సూపర్ సిక్స్ హామీల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డిక్లరేషన్ తంతును వాడుకోచూశారు. ఈ విషయం ప్రజలకు అర్థం అవుతోంది. అదే సమయంలో జగన్ చాలా హుందాగా మత విశ్వాసాల గురించి మాట్లాడారు. తన మతమేమిటో చెప్పడానికి, ఇతర మతాలను ఎలా గౌరవించేది చెప్పడానికి వెనుకాడలేదు. డిక్లరేషన్ లో తనది మానవత్వ మతం అని రాసుకోండని చెప్పి ప్రజలలో ఒక ఆలోచన తెప్పించారు. ఒక మాజీ ముఖ్యమంత్రినే ఆలయానికి రానివ్వకుండా అడ్డుకుంటే, దళితుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తద్వారా కూటమి నేతలు చేస్తున్న దరిద్రపు రాజకీయాన్ని జగన్ ఎండగట్టారు. టీటీడీ ప్రతిష్టను నిలబెట్టే విధంగా జగన్ మాట్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పవిత్ర లడ్డూకు అపచారం చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.
దీనిని బట్టే జగన్ ఎంత రాజనీతిజ్ఞతతో వ్యవహరించింది, చంద్రబాబు నీచ రాజకీయం చేసింది తేట తెల్లమైంది. జగన్ ఇంత జాగ్రత్తగా ఉన్నా, చంద్రబాబు బాకా పత్రిక ఆంధ్రజ్యోతి ఎంత దారుణంగా అబద్దాలు రాసిందో చూడండి.. ’ఏమైంది జగనా‘ అంటూ ఒక హెడింగ్ పెట్టి దేశాన్ని, మతాన్ని తప్పు పడుతున్నారంటూ తప్పుడు విశ్లేషణ ఇచ్చింది. పైగా జగన్ ’ఇదేం దేశం..ఇదేం హిందూయిజం‘ అని అన్నారంటూ పచ్చి అవాస్తవాన్ని రాయడానికి ఆంద్రజ్యోతి సిగ్గుడలేదు. జగన్ నిజానికి ఈ వ్యవహారంలో టీడీపీపైన, చంద్రబాబుపైన బాగా అఫెన్స్ వెళ్లాలని అనుకున్నవారు చాలామంది ఉన్నారు.
అయినా జగన్ చాలా సంయమనంతో తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్ట, లడ్డూకు ఉన్న విశిష్టత దెబ్బ తినకూడదని మాట్లాడారు. హిందువులమని చెప్పుకునే చంద్రబాబు, ఆంద్రజ్యోతి ప్రతినిధులు, పవన్ కళ్యాణ్ వంటివారు మాత్రం మతానికి, స్వామివారికి ఎంత అప్రతిష్ట వచ్చినా ఫర్వాలేదు కాని తమకు రాజకీయ లబ్ది చేకూరాలన్న దురుద్దేశంతో ప్రచారం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి వ్యవహారం జరిగినా, దానిని జగన్ పై తోసేసి దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు భావించినట్లు కనబడుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు, తన సొంత కంపెనీ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల లక్ష్యంగా కూడా ఆయన ఈ పని చేసి ఉండవచ్చన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు.
తన కుతంత్రపు వ్యూహాలేవి ఫలించకపోవడంతో చంద్రబాబు జారిపోయి, కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం అని చెబుతూ తప్పించుకోచూస్తున్నారు. అలాగే సూపర్ సిక్స్ హామీల గురించి ఇప్పుడు వద్దు అని అనడం ద్వారా డొల్లతనాన్ని బహిరంగపరచుకున్నారు. చివరిగా ఒక మాట. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్న కామెంట్ ఒకటి అందరూ పరిగణనలోకి తీసుకోవాలి.’ ఏ దేవుడు చెప్పాడు..నా మతం వాడే నన్ను పూజించాలని.. పరమతం వాడు నన్ను దర్శించరాదు అని‘.. జస్ట్ ఆస్కింగ్ అంటూ అర్థవంతమైన వ్యాఖ్య చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పుకు చెంపలు వాయించుకుంటే మంచిది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment