చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన జగన్‌! | KSR Comments On YS Jagan Speech Over Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన జగన్‌!

Published Mon, Feb 10 2025 11:30 AM | Last Updated on Mon, Feb 10 2025 11:49 AM

KSR Comments On YS Jagan Speech Over Chandrababu

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి సర్కార్‌ పనితీరును ఉతికి ఆరేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అరటి పండు ఒలిచి పెట్టినట్లు వివరించారు. పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకి లెక్కలతో కాకుండా.. పక్కా సమాచారంతో, అంకెలతో తన వాదన వినిపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడిగా ప్రజల ముందు నిలబెట్టారు.

దాదాపు రెండు గంటలపాటు సాగిన మీడియా సమావేశంలో జగన్‌ అనేక అంశాలపై మాట్లాడారు. స్థూలంగా వీటిని నాలుగు విడతలుగా చెప్పవచ్చు కానీ.. అన్నింటినీ ఒకేసారి విడమరచి చెప్పడం ద్వారా ఆయన ప్రజలపై ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా చేసిన దావోస్‌ యాత్ర.. తరువాతి పరిణామాలు, ఆ టూర్‌కు ఎల్లోమీడియా ఇచ్చిన బిల్డప్‌ వంటి అంశాలన్నింటినీ ఈనాడు పత్రిక పాత క్లిప్పింగ్స్‌ సాయంతోనే వివరించిన తీరు ఆసక్తికరం. ఆనాటి ఈనాడు కథనాలు చూస్తే.. ఏపీకి పరిశ్రమలు వెల్లువలా వచ్చేస్తున్న భ్రమ కలుగుతుంది. వీటిపై వైఎస్‌ జగన్ వివరిస్తూ ‘2016లో చంద్రబాబు దావోస్ సమ్మిట్‌కు వెళ్లి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా  ప్రముఖ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌ సంస్థ ఏపీకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అది రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. ఆ తర్వాత చంద్రబాబు  మూడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. అయినా ఆ కంపెనీ ఏపీకి వచ్చింది లేదు.

అలాగే, 2017లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం ఏపీకి రాబోతోందని, 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తోందని, 2019లో జెన్‌ప్యాక్ట్‌ సంస్థ ఏర్పాటు కాబోతోంది అని ఎల్లోమీడియా గొంతు చించుకుందని ఆధారసహితంగా వివరించారు. ఇవే కాదు.. అప్పట్లో ఏపీకి ఏకంగా 150 సంస్థలు వచ్చేస్తున్నాయని ఈనాడు దినపత్రిక  కథనాన్ని ఇచ్చింది. మరో పెద్ద సంస్థ అలీబాబా, ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ మొదలైనవి ఏపీ వైపు చూస్తున్నాయని  ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. దావోస్‌లో ఎవరైనా పారిశ్రామికవేత్తతో చంద్రబాబు బృందం భేటీ అయితే చాలు.. ఆ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కావడమే తరువాయి అన్న చందంగా ఊదరగొట్టేవారు. కానీ, వాటిలో 90 శాతం కంపెనీలు రానేలేదు. ఒకటి, అరా వచ్చాయేమో చెప్పలేం.

ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రిక, టీవీలు చూసేవారికి చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ భూతల స్వర్గం కాబోతున్నట్లు అనిపించేలా వార్తలు వస్తుంటాయి. అదే వైఎస్‌ జగన్ అధికారంలో ఉంటే అంతా చీకటే కనిపిస్తుంది. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వచ్చినా అవేవీ వీరికి కనిపించేవి కావు. ఎల్లో మీడియా సరిగ్గా అదే పద్దతిని చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుత టర్మ్‌లో కూడా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ల రెడ్‌బుక్.. పారిశ్రామివేత్తలను భయపెడుతోందని, జిందాల్ అంతటి పెద్ద పారిశ్రామికవేత్తపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే, తరిమేస్తే, ఇక్కడ వేరే వారు పరిశ్రమలు పెట్టాలంటే భయపడరా? అని జగన్ ప్రశ్నించడం కరెక్ట్. ఇక చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడుగా జగన్ అభివర్ణించిన తీరు వింటే ఏపీ ప్రజలను మోసం చేసి కూటమి పాలన చేస్తోందా అన్న భావన కలగక మానదు.

వైఎస్‌ జగన్ తన హయాంలో చేసిన అప్పులు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులను పోల్చి చెప్పారు. తాను పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా, అభివృద్ది కూడా జరిగిందని పోర్టులు, వైద్య కళాశాలలు, గ్రామగ్రామాన ప్రభుత్వ భవనాలు నిర్మించానని జగన్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్‌లో అనుమతించిన అప్పులు చేశారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా మరో రూ.50వేల కోట్ల అప్పు తెస్తున్నారని జగన్ విడమరిచి చెప్పారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ లేదా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌లు ఎవరైనా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడదు. సూటిగా జవాబు ఇవ్వకుండా ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేసి డైవర్షన్ రాజకీయాలు సాగించడమే కూటమి నేతలు తమ వైఖరిగా పెట్టుకున్నారు. కేశవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిధుల మంజూరులో ఆయనది నామమాత్రపు పాత్రే. ఢిల్లీ వెళ్లి నిధులను టాప్ చేసే అవకాశం ఆయనకు లేదు.

వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ సూచన మేరకు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి నిధులు సంపాదించుకు వచ్చిన తీరును ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పోల్చితే ఈ ఏడాది కూటమి సర్కార్‌కు తక్కువ నిధులు అందాయని, అలాగే ఆర్థిక సంఘం నిధులు కూడా సరిగా రావడం లేదని అధికారులు చంద్రబాబుకు వివరించారట. ఇది ఒక కోణం అయితే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నీతి ఆయోగ్ నివేదిక అంటూ తనకు అనుకూలమైన అంకెలను చెప్పి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానికి జగన్ దిమ్మదిరిగే జవాబు ఇచ్చారు.

మొత్తం ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణకు, 2014-19 టర్మ్‌లో ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులకు పోల్చుకుందామా అని సవాల్ చేశారు. పోనీ ఈ ఏడాది చేసిన అప్పులపై చంద్రబాబు వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న వేశారు. నిజంగానే చంద్రబాబు గత టర్మ్‌లో దాదాపు రూ.3.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. చిత్రమేమిటంటే ఆ అప్పులను కూడా కలిపి జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వారు దుష్ప్రచారం చేశారు. ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ దుర్మార్గంగా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈ విషయాన్ని  జగన్ ప్రస్తావించి అప్పుడేమో కాని, ఇప్పుడు మాత్రం అప్పుల్ని రూ.14 లక్షల కోట్లకు తీసుకు వెళ్లేలా ఉన్నారని విమర్శించారు.

రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్‌ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ హయాంలో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్న సంగతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు టైమ్‌లో అలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు అధ్వాన్నంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు అన్నదానికి ఆన్సర్ దొరకదు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అంటూ ఒక్కో పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎగవేసింది జగన్ వివరించారు. అందుకే బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జగన్ అందుకున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన  హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, ఒక్క నెల తప్ప, మిగిలిన ఏ నెలలో అయినా మొదటి రోజు జీతాలు చెల్లించారా అని జగన్ అడిగారు. ఇది ఆశ్చర్యకరమే. అటు స్కీములలో ఒక్కటీ అమలు చేయక, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తీర్చకుండా, జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తయారైందో అర్థం కాదు. జనం సంగతి పక్కనపెట్టి, టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ద వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల లక్షల ఉద్యోగాలు తొలగించారని జగన్‌ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వ మద్యం షాపులలో సుమారు 18వేల మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరికి ఉద్యోగాలు పోయాయి.

రెండున్నర లక్షల మంది వలంటీర్లకు పది వేల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా వైఎస్‌ జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని వైఎస్‌ జగన్  స్పష్టంగా వివరించగలిగారు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement