విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి! | Govt proposes to close thousands of primary and upper primary schools in state | Sakshi
Sakshi News home page

విలీనం కిరికిరి.. బడులకు ఉరే మరి!

Published Sat, Feb 8 2025 4:36 AM | Last Updated on Sat, Feb 8 2025 4:36 AM

Govt proposes to close thousands of primary and upper primary schools in state

కొన్ని విలీనం.. మరికొన్ని మూసివేత దిశగా అడుగులు 

మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

మండలానికి సగటున 10–15 బడులు మూతబడే ప్రమాదం 

ఒక్క కృష్ణా జిల్లాలోనే 136 స్కూళ్లు మూసివేత.. మరో 314 విలీనం  

12 వేల స్కూళ్లు మూతబడతాయని ప్రాథమిక అంచనా  

జీవో 117 ఉపసంహరణలో చెప్పిందొకటి.. చేస్తున్నది మరొకటి 

విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక 

మోడల్‌ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కి.మీ దూరానికి తరలింపు  

దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు 

ఎంఈవోలు డమ్మీ.. రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు 

తరలింపును వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళనలు  

ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు–నేడు పథకం కింద ఆధునికీకరించి సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1–5 తరగతుల వరకు పది మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతబడనుంది. ఇదొక్కటే కాదు చల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 పాఠశాలలు మూత పడనున్నాయి. ఇందులో నాడు–నేడు కింద పనులు జరిగినవి నాలుగు స్కూళ్లున్నాయి.

ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో 17 బడు­లను ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసి వేస్తుండగా, మరో 314 పాఠశాలలను ఇతర స్కూళ్లలో విలీనం చేయనున్నారు.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది ప్రాథమిక, ప్రాథ­మి­కోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభు­త్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాల కంటే మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారు.. బడుల మూసివేత, విలీనం దిశగా అడుగులు వేస్తోంది. విద్యా హక్కు(Right to education) చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే బడులకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన చోట వారిని ఒప్పించే బాధ్యతను డీఈవోలు, ఎంఈవోలు, ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నేతలకు అప్పగించింది. 

ముఖ్యంగా 25 లోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీపంలోని మరో పాఠశాలలో విలీనం చేసేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమా­చా­­రం. ఇలాంటి పాఠశాలలు(Schools) రాష్ట్రంలో దాదాపు 12 వేలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ఆ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. జీవో 117 ప్రకారం 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్‌ బోధన అందించేందుకు గత ప్రభుత్వం ఈ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. అదీ కేవలం కి.మీ లోపు పరిధిలోని 4,731 స్కూళ్లలోని 3–5 తరగతుల విద్యార్థులను 3,348 యూపీ, హైస్కూ­ళ్లలో పెట్టారు. మిగిలిన ఒకటి రెండు తరగతులు అవే స్కూళ్లల్లో కొనసాగాయి. 

కానీ, కూటమి సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ స్కూళ్లు మూత­బడేలా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1–5 తరగ­తులు కొనసాగుతున్న స్కూళ్లు 32,596 ఉండగా, వాటిలో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మంది ఎన్‌రోల్‌ ఉందని, మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు తక్కువ మంది ఉన్నందున మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రారంభించలేమని మార్గ­దర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మోడల్‌ ప్రయిమరీ స్కూల్‌ ఏర్పాటుకు అనువుగా ఇతర స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలు­స్తోంది. 

ఈ విలీన ప్రక్రియలో 2014–18 మధ్య మూతబడి, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పునఃప్రారంభమైనవి, నాడు–నేడు పథకంలో అభివృద్ధి చెందిన స్కూళ్లు కూడా ఉండడం గమనార్హం. పైగా ఉన్నత లక్ష్యంగా కి.మీ పరిధిలోని 3–5 తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే, నాడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు.. ఇప్పు­డు వేలా­దిగా స్కూళ్లను మూసివేసే పరిస్థితి తీసుకొ­చ్చినా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.

మార్గదర్శకాలకు భిన్నంగా జీవో 117 ఉపసంహరణ 
గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 ప్రకారం ప్రస్తుతం 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను కి.మీ.లోపు ఉన్న హైస్కూల్, యూపీ స్కూళ్లలో విలీనం చేసి, వారికి స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన అందిస్తున్నారు. మిగిలిన 1, 2 తరగతుల్లో 10 మంది, అంత కంటే తక్కువ విద్యార్థులున్నా ఎస్‌జీ­టీలతో చదువు చెబుతున్నారు. కానీ ఉప సంహరణ మార్గదర్శకాల్లో 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి తెస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ‘మోడల్‌ ప్రైమరీ స్కూల్‌’ను ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లోని 3–5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని ప్రకటించారు.

కానీ, ఇప్పుడు మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా నాలుగు లేదా ఐదు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు 5 కి.మీ పైగా దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కి.మీ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ దూరంలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ, మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ‘ప్రాథమిక’ విద్యార్థులను 3 కి.మీ దూరానికి మించి విలీనం చేయడం గమనార్హం. 

తొలుత 3–5 తరగతు­లను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగిస్తామని ప్రకటించి, తర్వాత ఆ తరగతులను మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మరో ఎంపీపీ స్కూల్లో విలీనం చేసేందుకు నివేదిక సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉన్నారని 2014–18 మధ్య దాదాపు 1,785 స్కూళ్లను నాటి టీడీపీ సర్కారు రద్దు చేసింది. తాజా విలీన ప్రక్రియతో మండలానికి కనీసం 10–16 స్కూళ్లు రద్దవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు(Public schools) మూత బడతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విలీన విద్యార్థులకు రవాణా చార్జీలు!
» తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఒక కి.మీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు మాత్రమే విలీనం చేసేందుకు ప్రతిపాద­నలు సిద్ధం చేయగా, కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అందుకు విరుద్ధంగా ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. 

» విలీన పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక, ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే వరకు ఆయా స్కూళ్లల్లో ఉపాధ్యాయులే ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయం చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

» ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో విలీనం ఉండదని చెప్పి, ఇప్పుడు అదే ప్రక్రియను అనుసరిస్తే వ్యతిరేకత వస్తుందని తాము చెబుతుంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు వాపోతు­న్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని స్కూళ్ల విలీనంతో విద్యార్థులు 10 కి.మీ దూరం వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని, తద్వారా ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. 

»మరోపక్క స్కూళ్ల విలీనంపై పేరెంట్స్‌ కమిటీల అనుమతి తీసుకోవాలని, అంగీకారం తెలిపిన ప్రాంతాల్లోనే విలీనం చేయాలని చెబుతున్నా.. ఇప్పటికే విలీన ప్రక్రియకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 117 ద్వారా ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని, కానీ కూటమి సర్కారు నిర్ణయాలతో భారీగా పాఠశాలలు మూతబడే పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

» పాఠశాలల్లో టీచర్‌ పోస్టులను కాపాడేందుకు ఎంఈవోలు తప్పుడు వివరాలు అందిస్తున్నాంటూ ఆరోపణలు చేసిన పాఠశాల విద్యాశాఖ.. అసలు లెక్కలు తేల్చాలంటూ రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

ఏకపక్ష  తరలింపుపై తీవ్ర నిరసన
» జీవో 117 రద్దు అనంతరం ప్రతిపాదిత పాఠశాలల ఏర్పాటుపై ఇచ్చిన మెమోకు భిన్నంగా, విద్యా హక్కు చట్టానికి విరుద్దంగా ప్రభుత్వం వెళ్లడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దానికి భిన్నంగా తరగతులను తరలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుందని చెబుతున్నారు. 

» జనవరి 9న ఇచ్చిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరుగుదల, డ్రాప్‌ అవుట్ల తగ్గింపు వంటి లక్ష్యాలతో నూతన పాఠశాలల విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఆమోదంతో ఒక కి.మీ. పరిధిలోని 3–5 తరగతులను ప్రతిపాదిత మోడల్‌ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 2 కి.మీ. పైనున్న పాఠశాలల నుంచి కూడా తరగతులను విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

» కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్కూళ్లనే తరలించడాన్ని అంగీకరించడం లేదు. అయినప్పటికీ విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఫౌండేషన్‌ పాఠశాలలో 30 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్‌నే నియమిస్తా­మని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఉపాధ్యాయులను మిగులుగా చూపడమే లక్ష్యంగా సాగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

»   కాగా, ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంబేద్కర్‌నగర్‌ పాథమిక పాఠశాలను 2 కి.మీ దూరంలోని నీలకంఠేశ్వరపురం పాఠశాలలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని అంగీకరించమని, విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement