
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో జనాభా నిర్వహణ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పారు. నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు ఇస్తానన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమరావతి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో జరిగిన ‘జనాభా గతి–అభివృద్ధి’ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆరు డెలివరీలైనా అన్నింటికీ ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోతోందని, దీనివల్ల నియోజకవర్గాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడంలేదని, దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే యువత ఉండాలనే చెబుతున్నానని అన్నారు. ప్రస్తుతం పిల్లాడిని కనడంకన్నా స్టార్టప్ ఒకటి ఉంటే చాలనే ధోరణిలో యువత ఉన్నారన్నారు. భార్య, భర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లల్లేకుండా ఎంజాయ్ చేస్తున్నారని, ఇది సామాజిక బాధ్యత కాదని అన్నారు.
త్వరలోనే ప్రధానమంత్రితో అమరావతిలో రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టులను పున:ప్రారంభిస్తామని, వాటిని మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి ప్రపంచంలో అత్యుత్తమ ఇన్‌స్టిట్యూషన్స్‌ను తెస్తున్నామని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చైర్మన్ టీ.ఆర్. పరవేందర్ మాట్లాడుతూ దేశంలో ఇంకా కోట్ల మంది తిండిలేక ఆకలితో ఉంటున్నారని, అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. అంతకు ముందు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పలు భవనాల శంకుస్థాపనల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment