కూటమి పాలనలో చెదిరిన చదువులు | Disturbed Education in AP Government Schools | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో చెదిరిన చదువులు

Published Mon, Dec 23 2024 5:35 AM | Last Updated on Mon, Dec 23 2024 7:13 AM

Disturbed Education in AP Government Schools

తల్లిదండ్రులతో కలిసి పిల్లలు వలస వెళ్లడంతో కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు జెడ్పీ హైస్కూల్‌ 9వ తరగతిలో తగ్గిపోయిన విద్యార్థుల హాజరు

విద్యా విప్లవానికి కూటమి సర్కారు పాతర

సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా ప్రభుత్వ పాఠశాలలు

అమ్మ ఒడి రాక.. సీజనల్‌ హాస్టళ్లు లేక కర్నూలు జిల్లాలో పిల్లల వలస బాట

మధ్యలోనే ఆగిపోయిన నాడు–నేడు పనులు.. తడికెల బడిలో చదువులు

మధ్యాహ్న భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు..

ఐక్యరాజ్య సమితి వరకు వినిపించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి ఆర్నెల్లలోనే గాడి తప్పింది! గత ఐదేళ్లూ మహోన్నతంగా విలసిల్లిన సర్కారు స్కూళ్లు మళ్లీ అద్వానంగా మారాయి. పిల్లల మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు. సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా కనిపిస్తున్నాయి. ‘మెగా పేరెంట్స్‌ డే’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ఓ సమావేశాన్ని నిర్వహించి ఒక్క రోజు హడావుడి చేసింది. 

ఈ కార్యక్రమం ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో లిఖించదగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా బోధన ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలున్నాయి? మన విద్యా వ్యవస్థ నాడు – నేడు ఎలా ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో తెలుసుకు­నేందుకు ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లను క్షేత్రస్థాయి­లో పరిశీలించింది.

మొగిలి రవివర్మ – సాక్షి ప్రతినిధి కర్నూలు
కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది.
కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం ముడుమాల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని పాఠాలువింటున్నారు. కొంత మంది అసంపూర్తిగా నిలిచిపోయిన గదుల్లో ఇసుక, మట్టిపై కూర్చుని కనిపించారు. బ్లాక్‌ బోర్డును ఇటుకలపై అమర్చి బోధిస్తున్నారు. 12 తరగతి గదుల నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారు. రూ.46.99 లక్షలు నిధులున్నా, వాటిని పూర్తి చేసే వారు లేరు. సంగాల ఉన్నత పాఠశాల భవనాలను మధ్యలోనే నిలిపేశారు. నాగులదిన్నె, నందవరంతో పాటు జడ్పీ హైస్కూలు భవనాల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేసింది.

నందవరం మండలం నాగులదిన్నె స్కూలులో తాగేందుకు మంచినీరు లేక ట్యాంకుల్లో నింపిన నీటినే పిల్లలు తాగుతున్నారు.
కర్నూలులో స్టాంటన్‌పురం నుంచి  ఎమ్మిగ­నూరు వరకు ఏ స్కూల్లో చూసినా మరుగు­దొడ్లలో దుర్గంధమే.
చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వా­నంగా 
ఉంది. చాలా మంది పిల్లలకు బూట్లు లేవు. చెప్పులు, ఒట్టి కాళ్లతో బడికి వచ్చారు.

 కర్నూలు రూరల్‌ మండలం కోడుమూరు నియోజక­వర్గం సుంకేసుల ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, ప్రహరీ, కిచెన్‌ నిర్మాణాలను  మధ్యలోనే నిలిపివేశారు. కాలనీలో నిరుపేద మహిళలను పలుకరించగా.. ‘సార్‌! మాలాంటోళ్లకు అమ్మ ఒడితో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ అంటూ ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి ఎక్కడిచ్చారు?’ అంటూ మహిళలు శిరోమణి, స్వరూప, మహేశ్వరి నిర్వేదం వ్యక్తం చేశారు.

అమ్మ ఒడి లేదు.. నీడనిచ్చే హాస్టళ్లూ లేవు..!
కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు హైస్కూలులో 608 మంది విద్యార్థులు చదువు­తుండగా 160 మంది మాత్రమే బడికి వస్తున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులతో కలసి ఉపాధి కోసం వలస వెళ్లారు. గతంలో తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లలు సీజనల్‌ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. ఇప్పుడు డిసెంబర్‌ వచ్చినా సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయకపో­వడంతో తల్లిదండ్రులతో కలసి పనుల కోసం పిల్లలు ఊరు విడిచి వెళ్లారు. అమ్మ ఒడి కూడా అందకపోవడంతో కష్టజీవులు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

బడి వదిలి.. పొలం  బాట .. 
సి.బెళగల్‌ మండలం ఈర్లదిన్నెలో శేఖర్‌ అనే విద్యార్థి స్కూలుకు వెళ్లకుండా తండ్రి ఈశ్వర్‌తో కలిసి పొలంలో గడ్డివామి వేస్తున్నాడు. అదే గ్రామంలో సందేశ్, జీవన్‌ అనే మరో ఇద్దరు చిన్నారులు కూడా తల్లి ప్రవీణతో కలసి మొక్కజొన్నకు మందు పిచికారీ చేస్తున్నారు. ‘అమ్మ ఒడి డబ్బులు వస్తే పిల్లల ఖర్చులకు ఉపయోగప డేవి. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్‌! ఏదో వీళ్లు పనికి వస్తే కూలీ డబ్బులైనా మిగులుతాయి’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అమ్మ ఒడి లేక డ్రాపౌట్స్‌!
బిజివేముల రమణారెడ్డి – సాక్షి ప్రతినిధి, బాపట్ల
బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పేద పిల్లలు పాఠశాల­లకు దూరమవుతున్నారు. డ్రాపౌట్స్‌ పెరిగిపోతు­న్నారు. ఈ ఏడాది ఇంకా చాలా మందికి యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అందలేదు... అని చీరాల నియోజక­వర్గం వేటపాలెం మండలం అక్కాయి­పాలెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చెప్పారు. అమ్మ ఒడి అందకపో­వడంతో ఈ పాఠ­శాలలో 23 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ఓ ఉపాధ్యా­యుడు తెలిపారు. 

 చంద్రబాబు ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వక పోవడంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారం­గా ఉందని సముద్ర తీర ప్రాంతం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మ ఒడి రాక తమ పిల్లలను బడి మానిపించినట్లు మహిళలు సురేఖ, కుమారి తెలిపారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్‌ మీడియం చదువులు లేనప్పుడు ఇక పిల్లలను బడికి పంపడం ఎందుకు సారూ.. అని మత్స్యకార మహిళ అక్ష  ప్రశ్నించింది. ఓడరేవు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మొదలైన భవన నిర్మాణ పనులు మధ్య­లోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఆరు బయట ఇసుకలో చదువుకుంటూ కనిపించారు. 

చినగంజాం మండలం అడవి వీధిపాలెం ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయులు అనుమతి నిరాకరించి గేటుకు తాళం వేశారు. నాసిరకం బియ్యం, టమాటా చారుతో పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తినడం లేదని, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని  అనూష అనే మహిళ తెలిపింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని విద్యార్థులు చెప్పారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నాడు–నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.

తడికెల బడి.. కర్నూలులోని స్టాంటన్‌పురం జడ్పీ హైస్కూల్లో అంగన్‌వాడీ నుంచి పదో తరగతి వరకూ ఒకటే బడి. ‘నాడు–నేడు’ కింద మంజూరైన నిధులున్నా  భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో టీచర్లు చందాలు వేసుకుని తడికెలు సమకూర్చుకుని అందులోనే పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆర్నెల్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవి సరిపోవా?

శ్రీకాకుళం జిల్లా ఆనందపురం యూపీ స్కూల్‌లో నిరూపయోగంగా మారిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫిల్టర్‌ 

నిర్వహణ అస్తవ్యస్తం
కందుల శివశంకర్‌ – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, 
శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. రణస్థలం మండలం పైడి భీమవరం హైస్కూ­ల్‌లో వాష్‌బేసిన్‌లు, మూత్రశాలలు నీటి సదుపాయం లేక వెక్కిరిస్తు­న్నాయి. టెక్కలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమైనా వాటిని పట్టించుకునే నాధుడు లేరు. భవనాల్లో అమర్చా­ల్సిన తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రిని పాఠశాలల్లోని స్టోర్‌ రూమ్‌లో పడేశారు. ఈ పనుల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రణస్థలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిర్వహణ లోపంతో పని చేయడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. చాలా చోట్ల ఆరు బయట అపరిశుభ్ర వాతావరణంలో వండటం కనిపించింది. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు సిద్ధం చేసిన వంటల్లో పక్షుల విసర్జితాలు నేరుగా పడుతున్న దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో కంటబడింది. పక్కా భవనం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు, వంట కార్మికులు చెబుతున్నారు.

నాడు–నేడు కింద చేపట్టిన భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అవి పూర్తయితే వంటగదిని కేటాయించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు–నేడుతో తమ పాఠశాల రూపురేఖలు మారాయని, చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతోఎన్నో ఏళ్లుగా వేధించిన వరద నీటి ముంపు సమస్య తొలగిందని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం యూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యా­యుడు ఏ.ఆదినారాయణ చెప్పారు.

కలలో కూడా అనుకోలేదు..
‘ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని దుస్థితి నుంచి కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నే రీతిలో మా స్కూళ్లు మారతాయని ఎన్నడూ ఊహించలేదు. నా సర్వీస్‌లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..’ – డిజిటల్‌ బోర్డు వైపు చూస్తూ శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట యూపీ స్కూల్‌ టీచర్‌ ఉత్తముడి మాట!

ఈ మార్పులు ఎవరి చలువ?
‘ఇటీవల పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌ కోసం పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఉన్నవన్నీ ఎవరు ఏర్పాటు చేసిన వసతులు? ఎవరి హయాంలో వచ్చిన మార్పులు అవి? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మా ఊరి బడి పరిస్థితి మారేదా..?’     
– శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 8వ తరగతి విద్యార్థి తండ్రి ఎస్‌.రామారావు మనోగతం!

జగన్‌ మా బాధలు తీర్చారు..
‘పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఒకటే టెన్షన్‌. చుట్టూ మురుగునీరు.. తీవ్ర దుర్గంధం! చినుకు పడితే పాముల బెడద. ఎప్పుడూ జలమయంగా ఉండే పాఠశాల ప్రాంగణం.. జగన్‌ నాడు–నేడులో భాగంగా చేపట్టిన ప్రహరీ నిర్మాణంతో మా బాధలు తీరాయి’     – డోల చంద్రుడు, విద్యార్థి ఆనందపురం, శ్రీకాకుళం జిల్లా

ఆర్నెల్లుగా జీతాలులేకున్నా..
‘పిల్లల బాగోగులే మాకు కావాలి బాబూ..! జగన్‌ బాబు ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వచ్చేది. ఇప్పుడు జీతం ముఖం చూసి ఆరు నెలలైంది. అయినా సరే పని చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యమే మా జీవితం. మా ఆకలి బాధలు తీరకున్నా మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగానే ఉంచుతున్నాం. మాకు చేతనైంది ఇదే పని బాబూ.. జీతాలిప్పించండి..’ అంటూ పాతర్లపల్లి, పైడి భీమవరంలో ఆయా రాములమ్మతో పాటు మరికొందరు వేడుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement