వంద, రెండు వందల కుటుంబాలకైతే తక్షణ సాయం చేయగలం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.
దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్‌నగర్‌లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్‌లు కూడా వస్తాయన్నారు.
సీనియర్ ఐఏఎస్‌లను విజయవాడకు రప్పించా
ప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్‌నగర్ 16 డివిజన్‌లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
ఇంత వర్షం.. అసాధారణం
రాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.
వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబుకు ప్రధాని ఫోన్
సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.
వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment