
రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి
ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు
రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనకు ఎక్కడా హత్యా రాజకీయాల మరక అంటలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. హత్యా రాజకీయాలు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శాశ్వతంగా శిక్ష పడేలా చేశానని తెలిపారు. మంగళవారం శాసనసభలో శాంతిభద్రతలపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోస్టుమార్టానికి కారణమైనవారు చివరకు పోస్టుమార్టం కావల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా.. రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి.. ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారంటూ హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమని అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటానంటే ఆటలు సాగనివ్వబోనని చెప్పారు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి పండించేందుకు వీల్లేకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఎలా ఉంటున్నారో నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ ఎమ్మెల్యేల బాధ్యతని, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే పేట్రేగుతారని, కఠినంగా ఉంటే అందరూ లైన్‌లోకి వస్తారని అన్నారు. నేరాలు చేసి, సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకునే వారికి కాలం చెల్లిందని చెప్పారు. రాత్రి సమయంలో డ్రోన్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు పెడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులు చనిపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. భూకబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టం తెస్తున్నామని చెప్పారు.
మహిళల రక్షణకు శక్తి యాప్
మహిళల రక్షణ కోసమే శక్తి యాప్‌ని తెచ్చామని, ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడితే వారికి అదే చివరి రోజని చంద్రబాబు అన్నారు. ఆపదలో చిక్కుకున్న మహిళలు శక్తి యాప్‌లో ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షిస్తారన్నారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా లేకపోతే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు కాదా?
మరకల్లేవని బాబు చెప్పడం హాస్యాస్పదమంటున్న విశ్లేషకులు
పలు సంచలన కేసుల్లో ప్రముఖంగా వినిపించింది చంద్రబాబు పేరే !
సాక్షి, అమరావతి: నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాల మరకలు లేవని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమే అని రాజకీయవర్గాలు, విశ్లేషకులు అంటున్నారు. మల్లెల బాబ్జి హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు అన్ని కేసుల్లో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసిన సంచలన పాత్రికేయుడు పింగళి దశరథరామ్‌ను విజయవాడలో నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన వెనుక చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అప్పట్లో అందరూ బహిరంగంగా చర్చించుకొన్నదే.
ఎన్టీఆర్‌పై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జి తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక కుట్రదారు చంద్రబాబే అని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఎనీ్టఆర్‌పై హత్యాయత్నం చేయించిన అసలు కుట్రదారుని పేరు బయటకు రాకుండా బాబ్జిపై ఈ దారుణానికి ఒడిగట్టడం నిజం కాదా? పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను విజయవాడ నడిరోడ్డున హతమార్చడం వెనుక చంద్రబాబు పన్నాగం ఉందన్నది జగమెరిగిన సత్యం అని అప్పట్లో అందరూ చెప్పుకొనేవారు.
ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో.. ప్రధానంగా అనంతపురం జిల్లాలో పరిటాల రవి ప్రైవేటు సైన్యం సాగించిన మారణకాండ వెనుక అసలు సూత్రధారి కూడా చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇన్ని ఘటనల్లో బాబు పేరు మోగిపోతే.. తనకసలు ఏ మరకా లేదని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment