కొలువుదీరిన కొత్త సభ | Oath taking of ministers and MLAs including CM | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త సభ

Published Sat, Jun 22 2024 4:26 AM | Last Updated on Sat, Jun 22 2024 11:18 AM

Oath taking of ministers and MLAs including CM

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త శాసన సభ కొలువుదీరింది.  16వ శాసన సభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9:46 గంటలకు ప్రారంభం అయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. తొలిరోజే ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కింది. 

వాస్తవంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే, ప్రతిపక్ష నేతకు సముచిత గౌరవం ఇవ్వకుండా మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చివర్లో ప్రమాణం చేయించింది. తద్వారా మున్ముందు ప్రతిపక్షం పట్ల తన వైఖరి ఏ విధంగా ఉండబోతోందో మొదటిరోజే స్పష్టంగా తెలియజెప్పింది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా 40 శాతం ఓట్లతో అత్యంత బలమైన పార్టీగా వైఎస్సార్‌సీపీ ఉంది.

ఆ పార్టీకి ఉన్న ప్రజా బలాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది. 2019లో కొత్త అసెంబ్లీ కొలువుదీరినప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పటి విపక్ష నేత చంద్రబాబును సముచితంగా గౌరవించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో ప్రమాణం చేయించింది. ఆ తర్వాతే ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వాలనే సదుద్దేశంతో అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేత సీఎం తర్వాత ప్రమాణం చేయించి గౌరవించింది. 

ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో టీడీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మంత్రులందరి తర్వాత ప్రమాణం చేయించి సభా సంప్రదాయాలను కాలరాసింది. నిజానికి ప్రతిపక్ష హోదాకు 10 శాతం సభ్యులు ఉండాలనే నిబంధనం ఏ చట్టంలోనూ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభ తొలి స్పీకర్‌ మౌలంకర్‌ సభలో ఇచ్చిన రూలింగ్‌ను కొన్ని రాజకీయ పార్టీలు అవసరార్ధం వాడుకుంటున్నాయి. కానీ చాలా రాష్ట్రాలలో అధికారపార్టీలు మాజీ ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు సముచిత గౌరవం ఇస్తూ సత్సాంప్రదాయాలను పాటిస్తున్నాయి. 

టీడీపీ ప్రభుత్వం అలాంటి వాటిని తుంగలో తొక్కింది. 2019లో టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23 మాత్రమే. అప్పట్లో ఆ పార్టీకి ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లకన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. గెలిచిన 23 మంది సభ్యుల్లోనూ ఐదుగురు టీడీపీని వీడి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మందిలో ఇంకొందరు ఆ పార్టీని వీడేలా చేసి, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకుంటే అప్పటి ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. 

కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేకపోవడంతో టీడీపీ సభ్యుల జోలికి వెళ్లకుండా చంద్రబాబుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్ష నేత గౌరవం ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సభా సాంప్రదాయాలను పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రిని అవమానపరిచేలా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అక్షరక్రమంలో సభ్యుల ప్రమాణం 
శాసన సభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం చంద్రబాబునాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలోని సభ్యులందరికీ వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు. 

ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలతో, అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సహా వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన 11 మంది, జనసేనకు చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 8 మంది, టీడీపీకి చెందిన 131 మంది ఎమ్మెల్యేలు మొత్తం 171 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఏడుగురు సభ్యులు ఆంగ్లంలో, మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణం చేశారు.

టీడీపీకి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, కాకినాడ ఎమ్మెల్యే వి. వెంకటేశ్వరరావు (కొండబాబు) వ్యక్తిగత కారణాలతో ప్రమాణస్వీకారం చేయలేదు. వీరితో ప్రొటెం స్పీకర్‌ శనివారం ప్రమాణం చేయిస్తారని తెలిసింది. తొలి రోజు శాసన సభ సమావేశం మొత్తం ప్రమాణ స్వీకారాలతోనే నడిచింది. అనంతరం సభను శనివారానికి ప్రొటెం స్పీకర్‌ వాయిదా వేశారు. 

అసెంబ్లీ మెట్లకు నమస్కరించిన సీఎం చంద్రబాబు 
శాసన సభ సమావేశాలకు వచ్చిన సీఎం చంద్రబాబు ముందుగా అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద మెట్లకు దండం పెట్టి లోనికి వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్‌లో అడుగు పెట్టే ముందు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసం అసెంబ్లీకి వస్తూ వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విష్ణుకుమార్‌ రాజు 
తొలి రోజు శాసన సభ సమావేశాల్లో బీజేపీకి చెందిన విశాఖపట్నం నార్త్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సభలోకి ప్రవేశించిన వెంటనే ఆయన దగ్గరకు విష్ణుకుమార్‌ రాజు వెళ్లి నమస్కారం చేశారు. కొద్దిసేపు ఆయనతో సంభాషించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వద్ద చాలా సేపు కూర్చుని వారితో ముచ్చటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement