
అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిష్పాక్షికత మరోసారి తేటతెల్లం
కూటమి నేతలది దుష్ప్రచారమేనని స్పష్టీకరణ
జీవో 431 ప్రకారమే 2019 – 24 మధ్య ప్రకటనలు ఇచ్చారని మండలిలో మంత్రి కొలుసు వెల్లడి
గత ఏడాది జూలైలోనూ అసెంబ్లీలో ఇదే విషయం తెలిపిన మంత్రి
‘సాక్షి’ పత్రికతో సమానంగా ఈనాడుకూ ప్రకటనలు
వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలోనే సాక్షిపై వివక్ష
ఆ ఐదేళ్లలో ఈనాడుకు రూ.121.97 కోట్లు, ‘సాక్షి’కి రూ. 30.97 కోట్లే
సాక్షి, అమరావతి: వార్తా పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారంలో వీసమెత్తు వాస్తవం లేదని, నిబంధనల మేరకే ప్రకటనలు ఇచ్చి నట్లు అసెంబ్లీ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారని టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నకు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన సమాధానంతో రుజువైంది.
ఆ ఐదేళ్లలో సాక్షికి రూ.371 కోట్లు, ఈనాడు పత్రికకు మూడున్నరేళ్లపాటు అదే స్థాయిలో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసినట్టు వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో టీడీపీ సభ్యులే దీనిపై ప్రశి్నంచగా.. గత ప్రభుత్వంలో జీవో 431 ప్రకారం నిబంధనలకు లోబడే వార్తా పత్రికలకు ప్రకటనలను జారీ చేశారని ఒప్పుకొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రకటనలు ఇచ్చే విచక్షణాధికారం సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ డైరెక్టర్‌కు ఉంటుందన్నారు.
ఈ మేరకే 2019 – 24 మధ్య సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా, అందులో రూ. 196 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈనాడు సహా ఇతర పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వగా.. అందులో రూ. 360 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. మంత్రి సమాధానం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిష్పాక్షికతను మరోసారి వెల్లడించింది. 2019కు ముందు ప్రభుత్వం జారీ చేసిన జీవో 431 ప్రకారమే 2019 – 24 మధ్య ప్రకటనలు ఇచ్చినట్లు మరోసారి స్పష్టమైంది.
మూడన్నరేళ్లలోనే ఈనాడుకు రూ.243 కోట్ల విలువైన ప్రకటనలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలి మూడున్నరేళ్లలోనే ఈనాడు పత్రికకు సమాచార శాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు చొప్పున మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలను ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు యాజమాన్యం ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని, తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. ఈ లెక్కన పరిశీలిస్తే సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారనేది వాస్తవం.
ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం సాక్షికి ఇచ్చిన ప్రకటనల మొత్తంలో రూ.175 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టమైంది. 2014–19 మధ్య చంద్రబాబు జమానాలో ప్రభుత్వ ప్రకటనల జారీలో ‘సాక్షి’ పత్రిక పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఆ ఐదేళ్లలో ఈనాడు పత్రికకు రూ.121.97 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, సాక్షి పత్రికకు కేవలం రూ.30.97 కోట్ల మేరకే ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment