
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరిక
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు సంఘ కార్యకలాపాల్లో సహాయకారులుగా పనిచేసే వెలుగు వీవోఏలు (గ్రామ సమాఖ్య సహాయకులు–డ్వాక్రా యానిమేటర్స్) కూటమి ప్రభుత్వ తీరుపై కదం తొక్కారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘కూటమి అధికారంలోకి వచ్చాక 4,500 మందిని తీసేశారు. అధికార పార్టీ నేతలు తమ వారిని నియమించుకునేందుకు 25 ఏళ్లుగా పనిచేస్తున్న వీవోఏలను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ అని నిలదీశారు.
మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది వీవోఏలు విజయవాడ చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనాలు వర్తింపజేయాలని, 3 నెలల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల ఇవ్వాలని, రూ.10 లక్షలు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల సమాఖ్యలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమై కొత్త పుస్తకాలు తెచ్చుకుని, కొత్త వీవోఏల పేర్లు రాసుకుని ఆన్‌లైన్‌లో ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు.
‘వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి విధిస్తూ అమల్లో ఉన్న సర్క్యులర్ రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచి్చంది. గెలిచాక ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా? అంటూ మాట మార్చారు’ అని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి విమర్శించారు. వీవోఏలకు పని ఒత్తిడి ఎక్కువైందని, ఇవి చాలదని రాజకీయ పార్టీలు ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. పొదుపు సంఘాల మహిళల ఉత్పత్తుల ఆన్‌లైన్ అమ్మకాల కోసం వీవోఏలకు టార్గెట్లు పెట్టడాన్ని ఆపాలని వీవోఏలు డిమాండ్ చేశారు.
తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వీవోఏల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, సీఐటీయూ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వీవోఏ సంఘం కోశాధికారి ఎ.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు ఎ.నిర్మలాదేవి, కె.లక్ష్మి ఆందోళనకు నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment