
కాశినాయన జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం వివక్ష
దెబ్బతింటున్న లక్షలాది మంది భక్తుల మనోభావాలు
తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం – ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు. – కడప/పులివెందుల/కాశినాయన/బద్వేలు అర్బన్
నాటి పాలకుల అండ.. నేటి పాలకుల కూల్చివేతలు
గతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్ద ల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు.
కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం.
కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలి...
క్షేత్రంలో కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ (ఆర్‌సీడీఎస్) అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట సర్వోత్తమరెడ్డి శనివారం ఇక్కడ పేర్కొన్నారు. అడవి మధ్యలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేని నిబంధనలు, కఠిన చర్యలు కాశినాయన ఆశ్రమంపై ఎందుకని ప్రశ్నిoచారు. ఆశ్రమానికి చేరుకోకుండా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పలు అడ్డంకులు సృష్టిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
పోరుమామిళ్ల నుంచి జ్యోతి (కాశినాయన ఆశ్రమం) వెళ్లే ఆర్టీసీ బస్సులను అడవిలోకి ప్రవేశించకుండా చివరి పల్లె అయిన వరికుంట్ల గ్రామం దగ్గరే ఆపి అటునుంచి అటే వెనక్కి పంపిస్తున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేదంటే తీవ్ర ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.
భక్తుల మనోభావాలు కాపాడాలి: ఎమ్మెల్యే సుధ
కూటమి నేతలు ఆలయాలపై రాజకీయాలు చేయడం మానుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేయాలని వైఎస్సార్ జిల్లా బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
సనాతన ధర్మం పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఉపన్యాసా లిచ్చే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చే దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న కాశినాయన ఆలయాన్ని అటవీ అధికారులు కూల్చి వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాశినాయన ఆలయ పరిరక్షణ కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందున తక్షణమే మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు.
దుశ్చర్యలను ఆపేయాలి
సనాతన ధర్మాన్ని, ధార్మికతను కాపాడతానని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను ఆయన నేతృత్వంలోని అటవీశాఖ అధికారులే చేపట్టారు. వెంటనే ఈ దుశ్చర్యలను ఆపేయాలి. హిందువుల మనోభావాలను సంరక్షించాలి. – స్వామి విరజానందా, అచలాశ్రమ పీఠాధిపతి. బ్రహ్మంగారిమఠం
ధర్మ ప్రచారానికి అండగా నిలవండి
ధర్మం కోసం పనిచేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చివేస్తుండడం శోచనీయం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను అందులోని ధార్మిక వేత్తలను కాపాడాలని, కూల్చివేతలను తక్షణం ఆపేయించాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నాం. – శ్రీనివాసానందస్వామి, ఆశ్రమ నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment