Nallamala forest area
-
వనమంటే..వణుకు
నల్లమల అభయారణ్యంలో సంచరించే చిరుతలు మనుషులపై దాడి చేస్తున్న వరుస సంఘటనలు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్వేచ్ఛగా అడవిలోకి వెళ్లి ఫలసాయాన్ని తెచ్చుకునే గిరిజనులు అడవిలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎప్పుడూ చిరుతలు మనుషుల మీద దాడిచేసిన ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. అయితే ఇటీవలి వరుస ఘటనలు అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పచ్చర్ల సమీపంలో పదిహేను రోజుల క్రితం అడవిలో కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి చంపటం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడిని రేకెత్తించింది. దీంతో పాటు చంపిన మహిళ మృతదేహాన్ని చిరుత భక్షించిందన్న వార్తలతో స్థానిక గిరిజనులు హడలిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అటవీ ప్రాంతంలోకి వెళ్లి అటవీ ఫలసాయాన్ని సేకరించే తమకు ఈ సంఘటన అత్యంత భయాందోళన కలిగిస్తోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత మహిళపై దాడి చేయటంతో అది మ్యాన్ ఈటర్‌గా మారి ఉంటుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దశాబ్దాల నల్లమల అభయారణ్య చరిత్రలో ఇలా చిరుతలు మనుషులను చంపి తినటం జరగలేదని గిరిజనులు చెబుతున్నారు. అంతకు ముందు పచ్చర్ల సమీపంలోనే రైల్వే పనులు చేస్తున్న మరో మహిళపై చిరుత దాడికి పాల్పడగా, వారం రోజుల క్రితం పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద మరో యువకుడిపై చిరుత దాడి చేసి గాయపర్చటం, మహానంది ఆలయం పరిసరాల్లో చిరుత సంచరించటం వంటి వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దీంతో పాటు గురువారం రాత్రి శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఓ కుక్కను చిరుత పట్టుకెళ్లిన వీడియోలు వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.నీటి కోసమే అడవులను దాటుతున్నాయా..నల్లమల దట్టమైన అటవీప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయన్న విషయం చర్చనీ యాంశంగా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం చెక్‌డ్యాంలు, సాసర్పిట్లలో నీరులేక అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో చిరుతలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేస్తున్నాయి.చిరుతలు స్వేచ్ఛా జీవులు:తెలుగు రాష్ట్రాల విభజన తరువాత పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లోకే అధికంగా చేరింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మనరాష్ట్రంలోనే ఎక్కువ. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దేశవ్యాప్త పులుల గణన జరుగుతుంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 83 కు పైగా పెద్దపులులు, లెక్కకు మించి చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు స్వేచ్ఛా జీవులని, పెద్దపులిలా ఒక పరిధిని ఏర్పరచుకొని అవి ఒక చోట ఉండవని... ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉంటాయని పేర్కొంటున్నారు. -
చెంచుల చెంతకు అధికారులు
అమ్రాబాద్: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య, పీఆర్ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి జన్మన్ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
అడవే చెంచులకు అమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలోనే నివసించే చెంచుల జీవనశైలి...బాహ్య ప్రపంచానికి కొంచెం వైవిధ్యంగానే ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో చెంచులు కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ సరైన ఆహారానికి నోచుకోవడం లేదు. కారం మెతుకులు, చింత పులుసు, ఎప్పుడోసారి పప్పు ఇదే వారి రోజువారీ మెనూ. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వారి జీవన ప్రమాణస్థాయిల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పౌష్టికాహార లోపం, ఉపాధి సన్నగిల్లడం, సరైన వైద్యం అందకపోవడంతో సగటు చెంచుల ఆయుర్దాయం 50ఏళ్లకే పరిమితమవుతోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న 120 చెంచు పెంటల్లో కలిపి చెంచుల జనాభా పదివేల లోపే. వీరి కుటుంబాల్లోని పిల్లలు కనీసం బడిచదువుకు కూడా నోచుకోవడం లేదు. నిత్యం ఒక్కటే..: చెంచు చిన్నారుల నుంచి పెద్దల వరకు పోషకాహారం కరువవుతోంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెంచులు కూరగాయలు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని మన్ననూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. పదిహేను, నెల రోజులకు ఒకసారి మన్ననూర్ వెళ్లి తెచ్చుకున్న సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏమీ దొరక్కపోతే పప్పులు, తొక్కులు, చింత పులుసుతోనే రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యమే వీరికి ప్రధాన ఆహారం. అడవిలో లభించే చెంచుగడ్డలు, చింతపులుసు, చింతచిగురు, నెమలినార, ఆకుకూరలు, యార్లగడ్డ, మూలగడ్డ, శాదగడ్డ తదితర గడ్డలు, కందమూలాలను చెంచులు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇవి సీజ¯న్లోనే లభిస్తాయి. చెంచుగడ్డలు, ఇతర గడ్డలను ఎండాకాలంలో గడ్డి ఎండిపోయాక మాత్రమే సేకరించేందుకు వీలుంటుంది. దీంతో మిగతా సమయాల్లో వీరికి పోషకాహారం దొరకడం లేదు. బడికి దూరం.... చెంచు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ గేటు నుంచి మల్లాపూర్, రాంపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల తదితర చెంచు పెంటలకు అప్పాపూర్‌లోని ఒక్క గిరిజన పాఠశాలే దిక్కు. ఇందులో ఐదో తరగతి వరకు ఉండటంతో చిన్నారుల చదువు అక్కడికే పరిమితమవుతోంది. అడవి నుంచి బయటకు వెళ్లి విద్యాబోధన సాగించేందుకు చెంచులు ఇష్టపడడం లేదు. అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తే కనీసం పదోతరగతి వరకైనా చదువుతారు. ఇంటర్, డిగ్రీ వరకు చదివేవారు పదుల సంఖ్యలోనే ఉంది. ఉపాధి హామీ పథకమే ఆదాయ వనరు చెంచులు ప్రధానంగా తేనె, చింతకాయలు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో ఉపాధి సైతం కరువైందని చెంచులు వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీ డబ్బులే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. గిరిపోషణ అంతంతే... చెంచు చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన గిరిపోషణ తూతూమంత్రమే అయ్యింది. జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో పౌష్టికాషారాన్ని అందించేలా హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్రిశాట్ సంయుక్తంగా పోషకాహార ప్రణాళిక రూపొందించాయి. ఈ మేరకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో 3,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఐటీడీఏతో పాటు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ లేని చెంచు పెంటల్లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా తృణధాన్యాలతో ఉదయం, సాయంత్రం మలీ్టగ్రెయిన్ మీల్, స్వీట్ మీట్, రాగులు, జొన్నలతో చేసిన చిక్కీలు, పట్టీలు, జవార్ బైట్స్ వంటి బలవర్ధక ఆహారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమం రెండు, మూడు నెలలకే పరిమితమైంది. ఐదో తరగతి వరకే... అప్పాపూర్‌లో ఐదోతరగతి వరకు బడి ఉంది. అంతవరకే చదువుకున్నా. తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లలేదు. నాతో పాటు చాలామంది ఇక్కడితోనే ఆపేశారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. – తోకల గురువయ్య, చెంచు యువకుడు, అప్పాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా దెబ్బ తాకినా, చేయివిరిగినా నాటు వైద్యమే రెండు నెలల కిందట చెట్టు నుంచి జారి కింద పడ్డ. చేయి విరిగింది. డిండికి పోయి కట్టు కట్టించుకున్న. సుస్తీ అయితే ఆస్పత్రికి పోము. ఆస్పత్రికి వెళ్లాలంటే మన్ననూర్ లేకుంటే వటవర్లపల్లికి పోవాలి. అటు ఎటు పోవాలన్నా దూరం 50 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మందులు మాత్రమే ఇస్తారు. మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లామంటారు. అటు 80 కిలోమీటర్ల బదులు డిండికి వెళ్లా. ఇక్కడ అందరికి నాటువైద్యమే. – నాగయ్య, అప్పాపూర్ సార్లు వస్తేనే సౌకర్యాలు గిరిపోషణ కింద ఇంతకు ముందు జొన్నలు, సజ్జలతో ఉదయం, సాయంత్రం ఉప్మా ఇచ్చారు. ఏడాది కాలంగా ఏమీ ఇవ్వడం లేదు. గవర్నర్ మేడం, సార్లు వస్తున్నప్పుడు మాత్రమే సౌకర్యాలు చేస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – నాగమ్మ, మల్లాపూర్ పెంట, నాగర్‌కర్నూల్ -
ఇల వైకుంఠపురంలో..
‘ఇంట్లో దీపం వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు.. అదే దీపం గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు’నిస్తుందని నమ్మారు ఆ ఊరి వాళ్లంతా. తూరుపు దిక్కున ప్రతి గుమ్మానికి ఆత్మ గౌరవమనే తోరణం కట్టారు. అజ్ఞానపు కట్టుబాట్లను తెంచి పడమర దిక్కున పాతేశారు. ఊరికి ఉత్తరాన అంతరాలను కట్టెలపై కాల్చేసి.. జ్ఞాన దివిటీలను గుండెల్లో వెలిగించుకున్నారు. దారికి దక్షిణాన నాగలి పట్టి పుడమి నుదుటిపై తమ జీవిత రాతలు ఎలా ఉండాలో రాసుకున్నారు. అక్షర కాంతులు నింపుకున్న ఆ గ్రామం ఇప్పుడు సామాజిక చైతన్యపు తిలకాన్ని నుదిట దిద్దుకుని కొత్త పొద్దులకు ఆహ్వానం పలుకుతోంది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అడవి అంచున వెలసిన గిరిజన గ్రామం వైకుంఠపురం విశేషాలను పరికిస్తే.. ప్రతి గడపా ఓ విజయగాథకు ప్రతిరూపంగా నిలుస్తోంది. సాక్షి, నరసరావుపేట: ఇప్పటికీ అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ‘యానాదులు’. సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వీరిలో అత్యధికులు చదువులకు నోచుకోక.. ఎదుగుబొదుగూ లేని జీవితాల్ని గడుపుతున్నారు. అష్టకష్టాలు పడి కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. చేపలు పట్టడం.. పొలాల వెంట తిరుగుతూ ఎలుకల్ని పట్టడం.. పంటలకు కాపలాదారులుగా ఉండటం.. కానీ.. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన యానాదులు తమ చరిత్ర గతిని మార్చుకున్నారు. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టారు. గ్రామం మొత్తం రైతన్నలుగా మారిపోయారు. మరో అడుగు ముందుకేసి ఉద్యాన పంటలు సైతం సాగు చేస్తున్నారు. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతులయ్యారు. ఊరిని మద్యనిషేధ గ్రామంగా మార్చుకున్నారు. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి తొలి తరం అభ్యాసకులుగా అక్షర కాంతులు నింపుకుంటున్నారు. 25 ఏళ్లుగా స్థానిక పాలనలో కూడా వారు కీలకంగా మారారు. నాలుగు కుటుంబాలతో మొదలై.. 1965 నాటికి ఇక్కడ ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ నాలుగు కుంటుంబాలు అక్కడ సారవంతమైన భూములు ఉండటంతో పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కో కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు ఆ గ్రామంలో 310 గడపలయ్యాయి. సుమారు 952 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి పొలం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. ప్రతి చేనుకు బోరు మోటార్ ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం సారా తయారీ అడ్డాగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా నిషేధించారు. గ్రామంలో నేరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉండవు. గిరిజనులు ఇలా కష్టాన్ని నమ్ముకుని ఇలలో వారి గ్రామం వైకుంఠపురం నామాన్ని సార్థకం చేసుకున్నారు. అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ప్రస్తుత తరంలో 154 కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇక గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. ఏళ్లుగా బంజరు భూములను సాగు చేస్తున్న 18 మంది రైతులకు త్వరలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామం మొత్తం దాదాపుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి , ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 12 మంది స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. -
చెంచులకు ‘ఉపాధి హామీ’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల బతుకు దెరువు కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మారిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది చెంచులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో అత్యల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధి హామీ కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ప్రత్యేక పథకంగా ఉపాధి హామీని 2009 నుంచి వర్తింపజేసి 180 రోజుల పనిదినాలు కల్పించారు. దీనికి తోడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధన కాకుండా సడలించి.. ముగ్గురికి జాబ్‌కార్డ్ ఇచ్చారు. ఆ ముగ్గురికి మొత్తంగా 540 పనిదినాలు ఇచ్చేవారు. పోషకాహారలోపంతో బలహీనంగా ఉండే చెంచులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇచ్చారు. 70 % పని చేస్తే వంద శాతం పనిచేసినట్టు చూపి చెల్లింపులు జరిపేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 గ్రామాల్లోని చెంచు కుటుంబాల బతుక్కి భరోసా దక్కేది. వారికి కేటాయించే పని దినాలను లెక్కగట్టి ఉపాధి కూలి మొత్తంలో పని చేయకముందే సగం డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చేవారు. మిగిలిన సగం పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేవారు. మొత్తం పనిదినాల్లో మొత్తం కూలిని సగం నగదుగాను, మిగిలిన సగాన్ని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కందిపప్పు, బియ్యం, చింతపండు, బెల్లం, చక్కెర వంటి 20 రకాల సరుకులు ఇచ్చేవారు. దీన్నే ఫుడ్ బాస్కెట్ అని పిలిచేవారు. కాగా, ఫుడ్ బాస్కెట్ పద్ధతి 2012తో ఆగిపోవడంతో మొత్తం నగదును ఇవ్వడం ప్రారంభించారు. వారికి నిర్ణయించిన రోజువారీ వేతనం డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ చెంచు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు లీడర్లకు ఉపాధి హామీ పనుల నగదు చెల్లింపులు బాధ్యతలు అప్పగించేవారు. ఇలా అన్ని రకాలుగా ఊతమిచ్చిన ఉపాధి హామీ కేంద్రం నిబంధనలతో గతేడాదిలో ఆగిపోవడంతో చెంచులు ఆవేదన చెందుతున్నారు. చెంచులకు ఉపాధి కోసం కేంద్రాన్ని కోరాం దేశంలో అత్యంత అల్ప సంఖ్యాకులుగా ఉన్న చెంచుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టాం. వారికి ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిలిపివేయడం ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని 171 చెంచు గూడెంలలో ప్రజలకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సానుకూలంగా ఆలోచించి చెంచులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని కోరాం. ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన శాఖలతో నిర్వహించిన సమావేశంలోను కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌ముండాకు చెంచుల పరిస్థితిని వివరిస్తూ ఉపాధి కొనసాగింపు కోసం నివేదిక ఇచ్చాం. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి -
అడవి తాకిన సంక్షేమం
ఒకటో తారీఖు వచ్చిందంటే పింఛన్ అందాల్సిందే. అది పట్టణమైనా, కీకారణ్యమైనా వలంటీర్లు వెళ్తున్నారు. నల్లమల అడవులూ అందుకు మినహాయింపు కాదు. శ్రీశైలానికి దాదాపు 25 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల్లో ఉండే చెంచుల గూడెం నెక్కంటి పెంటకు వెళ్లడం సాహస యాత్రే. అక్కడ ఇద్దరు చెంచులకు మాత్రం టంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రతి నెలా అక్కడకు 14 కి.మీ. దూరంలోని పాలుట్ల పెంట నుంచి వలంటీర్ బయన్న ట్రాక్టర్‌పై వచ్చి పింఛన్ డబ్బులిస్తున్నాడు. సుమారు పది కుటుంబాలు ఉండే నెక్కంటి పెంటకు సోలార్ ద్వారా కరెంట్, బోరు నీటిని ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు గిరిజన మహిళ చెవుల బసవమ్మ తెలిపింది. సున్నిపెంట నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు: దేశవ్యాప్తంగా అంతరించి పోతున్న 75 గిరిజన తెగల్లో మన రాష్ట్రంలో నివసించే చెంచులు మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మనుగడ పోరాటం చేస్తున్న చెంచు గూడేల్లో వికసిస్తున్న అభివృద్ధి రేఖలు, వారి జీవనశైలిని పరిశీలించేందుకు సున్నిపెంట సమీపంలోని పలు ప్రాంతాలను రెండు రోజుల పాటు సందర్శించి దట్టమైన అడవుల్లో రాళ్లు రప్పలతో నిండిన బాటలో జీపు, కాలినడకన కిలోమీటర్ల మేర ప్రయాణించి ‘సాక్షి’ ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. మూడు జిల్లాల పరిధిలో దట్టమైన నల్లమల అడవుల్లో పర్వతాలతో కూడిన ప్రాంతాలే చెంచులకు ఆవాసాలు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 171 చెంచు గూడేలున్నాయి. వీటిని చెంచు పెంటలుగా పిలుస్తుంటారు. కీకారణ్యంలో క్రూరమృగాలు, వన్యప్రాణులతో కలసి జీవించే వీరంతా బాహ్య ప్రపంచానికి రావాలంటే మొనదేలిన రాళ్లతో కూడుకున్న అటవీ మార్గంలో కిలోమీటర్ల తరబడి నడవాల్సిందే. వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి జీవనోపాధి. విల్లంబులు, చిన్నపాటి కత్తి వీరి ఆయుధాలు. గతంలో ఎలుగుబంటి, జింకలను వేటాడేవారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో వేట వదిలేసి ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలపై ఆధారపడుతున్నారు. భిన్న జీవన శైలి చెంచుల ఆహారపు అలవాట్లు సైతం చాలా సరళమైనవి. జొన్నలు, సజ్జలతో చేసిన జావ తాగుతారు. ఉడకబెట్టినవి, కాల్చిన దుంపలు, గడ్డలు తింటారు. చింతపండును బూడిదలో కలిపి తింటారు. ఉపాధి కోసం ఉదయం బయటకు వెళ్లేప్పుడు అన్నం తింటే తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాకే మళ్లీ ఆహారం తీసుకుంటారు. చెంచు గూడేల్లో పెద్ద ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉంటారు. వివాహ వేడుక పెద్దల అంగీకారంతో జరుగుతుంది. సంసారం పొసగకపోతే విడాకులు మామూలే. వితంతు వివాహాలు జరుగుతాయి. శివుడి ప్రతిరూపంగా లింగమయ్యను పూజిస్తుంటారు. డబ్బులు దాచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వరు. ఆహారాన్ని నిల్వ చేసుకోరు. ఏ రోజుకారోజు అనే రీతిలో జీవిస్తారు. అప్పుడప్పుడు కూలి పనులు చేసినా తమ జీవన విధానమైన అటవీ ఉత్పత్తుల సేకరణకే మొగ్గు చూపుతుంటారు. అడవి తల్లి.. అమ్మవారు శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి తెలిసిన వారు తక్కువే. అక్కడికి ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే. కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే అటవీ శాఖ అధికారుల అనుమతితో నడుస్తాయి. దట్టమైన అడవిలో బండరాళ్లు, మొనదేలిన రాళ్ల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ప్రయాణంతో ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి చేరుకోవచ్చు. అడవి తల్లిని, అమ్మవారిని నమ్ముకుని దాదాపు 26 చెంచు కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి గూడెం అభివృద్ధి ఇలా.. మొత్తం 171 చెంచు గూడేలకు వాటర్ ట్యాంక్‌లు, బోర్లు, పైపులైన్ల ద్వారా ప్రభుత్వం మంచినీటి వసతి కల్పించింది. 166 గూడేలకు సోలార్‌తో విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. 164 గూడేలకు రోడ్డు మార్గం ఉంది. మొత్తం 6,912 కుటుంబాల్లో 3,561 కుటుంబాలకు ఇళ్లు ఉన్నాయి. జగనన్న కాలనీల్లో మరో 2,940 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. 2,364 ఇళ్లకు మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. 14,071.29 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్, అసైన్డ్ భూములను 5,186 కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. నవరత్నాల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా 2,411 మందికి, వైఎస్సార్ చేయూత మొదటి విడతలో 599 మందికి, రెండో విడతలో 825 మందికి అందించారు. వైఎస్సార్ ఆసరా 1,005 మందికి, వైఎస్సార్ పెన్షన్ కానుక 2,186 మందికి ఇస్తున్నారు. విద్య – వైద్యం నిరుపేద చెంచు కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 12 గురుకులాలు, 66 ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తోంది. నాడు–నేడు ద్వారా 9 గురుకులాలు, 42 పాఠశాలలు అన్ని వసతులతో నిర్మించారు. ఆరు సామాజిక, 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 126 సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. మా నాన్నకు ఐదుగురు సంతానం. ప్రభుత్వం అటవీ శాఖలో నలుగురికి ఉద్యోగం ఇచ్చింది. విభిన్న ప్రతిభావంతుడినైన నాకు అటవీ శాఖ ద్వారా ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.12,500 ఇస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 63 బేస్ క్యాంపుల్లో నాలాంటి 300 మందికిపైగా చెంచు యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. – చెవుల బసవయ్య, చెంచు యువకుడు గూడేనికే టీచర్ తాత ముత్తాతల కాలం నుంచి అడవి తల్లినే నమ్ముకుని జీవిస్తున్నాం. మా పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం గూడేనికే టీచర్‌ను పంపిస్తోంది. ఆరు కిలోమీటర్ల దూరంలోని నెక్కంటి పెంట నుంచి రోజూ వచ్చే ఐటీడీఏ టీచర్ శ్రీను ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 20 మంది పిల్లలకు పాఠాలు చెబుతారు. ఒకటో తేదీనే వలంటీర్ మల్లిఖార్జున వచ్చి ఐదుగురికి పెన్షన్ డబ్బులిస్తున్నారు. – చిగుళ్ల వెంకటమ్మ, ఇష్టకామేశ్వరి గూడెం బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయాలు హైదరాబాద్ కేంద్రంగా 1975లో ఏర్పాటైన చెంచు ఐటీడీఏను 1988లో శ్రీశైలానికి తరలించారు. శ్రీశైలం ప్రధాన కేంద్రంగా 3,600 చ.కి.మీ విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల్లో చెంచు ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారు సేకరించే అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేందుకు వన్ ధన్ వికాస కేంద్రాలు 10 కేటాయించాం. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.ప్రత్యేక కార్యాచరణతో వారికి ఆధార్ నమోదు చేపట్టాం. –రవీంద్రారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్,శ్రీశైలం ఐటీడీఏ -
దాక్కో పులి..లేదంటే ఉచ్చుకు బలి
ఆళ్లగడ్డ: నల్లమల అడవుల్లో వన్యమృగ వేటగాళ్ల ముఠా పంజా విసురుతోంది. చాకచక్యంగా పెద్ద పులులను హతమారుస్తోంది. అటవీ శాఖ యంత్రాంగం మాత్రం తనకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తోంది. ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వారు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిరివెళ్ల మండలం మహదేవపురం నుంచి వైఎస్సార్ జిల్లా సరిహద్దు చాగలమర్రి వరకు నల్లమల అడవులు ఉన్నాయి. చిరుతలు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కొండ మేకలతో పాటు నెమళ్లు, కొండకోళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి. అభయారణ్యంలో పులుల వృద్ధి పెరిగి, ఈ ప్రాంతంలో వీటి సంచారం మొదలైంది. వీటిపై వేటగాళ్ల కన్ను పడింది. రెండేళ్లలో నాలుగు పులులు మృతి చెందగా.. ఇంకా వెలుగులోకి రానికి కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు పెద్ద పులిని ఉచ్చులో బిగించి చంపేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వేటగాళ్లు నేరం నుంచి తప్పించుకునేందుకు పెద్దపులి కళేబరాన్ని తెలుగుగంగ కాల్వలో పడేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 15 మంది అనుమానితులను శిరివెళ్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగానే బుధవారం గండ్లేరు రిజర్వాయర్‌లో పెద్దపులి కళేబరం లభ్యమైంది. కొనసాగుతున్న వేట రుద్రవరం, చలిమ అటవీ రేంజ్‌ల పరిధిలో వన్యప్రాణుల వేట ఆగడంలేదు. నిత్యం ఏదో ఒకచోట వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. హద్దులు నిర్ణయించుకుని వేట సాగిస్తున్నట్లు సమాచారం. తెలుగుగంగ కాల్వ వెంట ఉన్న అడవిలో వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను బట్టి కిలో మీటర ఒక హద్దుగా వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వారి హద్దులో ఇంకొక వేటగాడు ఉచ్చులు వేయడం గాని, ఎరలు పెట్టడం గాని చేయకూడదనే నిబంధన సైతం విధించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా ఉండడంతో ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లర్లతో ఒప్పందాలు వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు అడవిలో సన్నని ఇనుప బైండింగ్ వైర్లను అమర్చి, హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అనుసంధానం చేస్తారు. అలాగే క్లచ్ వైర్లతో ఉచ్చులు కూడా వేస్తారు. ఉచ్చులో చిక్కుకున్న జంతువును మారణాయుధాలతో హతమారుస్తారు. మరి కొందరు విషపు, మత్తు గుళికలు ఆహారంలో కలిపి ఎరగా వేస్తున్నారు. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వేటగాళ్లు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరు గన్‌తో గురి చూసి విషపు ఇంజక్షన్లు వన్యప్రాణులకు ఎక్కించి, చంపడంలో నేర్పరులని సమాచారం. కొరవడిన నిఘా వన్యప్రాణుల వేటను అటవీశాఖ అధికారులు అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతులు పంట పొలాల రక్షణ కోసం అమర్చే విద్యుత్ తీగలకు తగిలి వన్యప్రాణులు బలవుతున్నాయని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆత్మకూరు అటవీ సమీపంలో ఓ పులి అనుమానాస్పదంగా మృతి చెందింది. తాజాగా రుద్రవరం మండలం గుండ్లేరు రిజర్వాయర్‌లో మరొక పులి కళేబరం లభ్యమైంది. ఇవే కాదు అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, తోడేళ్లు పదుల సంఖ్యలో అనుమానాస్పదంగా మృత్యువాత పడుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించిన ఘటనలు స్వల్పంగా ఉన్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం, పది రోజులు హంగామా చేయడం, తదనంతరం దానిని పట్టించుకోక పోవడం పరిపాటిగా మారింది. ఇవీ ఘటనలు ► 2019 బాచేపల్లె తండా సమీపంలో తిప్పపై పెద్దపులి మృతి చెందింది. ► అదే సంవత్సరం మరో నెలలో ఎర్రచెరువులో పెద్దపులి మృత్యువాత పడింది. ► రెండు సంవత్సరాల క్రితం గండ్లేరు రిజర్వాయర్‌లో చిరుత కళేబరం కనిపించింది. ► నెల క్రితం ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా కళాశాల సమీపంలో వేటకు జింక బలైంది. ► పక్షం క్రితం రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు మృతి చెందాయి. ► తాజాగా బుధవారం గండ్లేరు రిజర్వాయరులో పెద్దపులి కళేబరం లభ్యమైంది. వన్య ప్రాణుల వేట చట్ట విరుద్ధం పులి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టం. పోస్టుమార్టం ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేట చట్ట విరుద్ధం. ఎవరైనా అటవీ సిబ్బంది ఇందుకు సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై వేటు వేస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. – వినీత్‌కుమార్, డీఎఫ్ఓ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ వన్యప్రాణులను ప్రేమించాలి. వాటిని సంరక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలి. వన్యప్రాణులు నశిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించి పోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించాలి అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్ని రకాల వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణ పరిరక్షణ పూర్తిగా దెబ్బతింటుంది. వన్యప్రాణులను వధించే వారిని కఠినంగా శిక్షించాలి. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
అడవి అంచున.. అల వైకుంఠపురం
వారంతా సంచార జీవులు.. చెరువు గట్లు, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని బతికేవారు. చేలల్లో ఎలుకలు.. బోదెల్లో చేపలు పట్టడం ప్రధాన వృత్తి. అక్కడక్కడా పొలాలకు కాపలాదారులుగా ఉండటం.. కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. తప్పని పరిస్థితుల్లో వేటగాళ్లుగా మారడం.. అదీ కుదరకపోతే ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి సద్దికూడు బిచ్చమెత్తి పొట్ట నింపుకోవడం చేస్తుంటారు. చింపిరి జుత్తు.. చిరిగిన దుస్తులతో దర్శనమిచ్చే యానాదుల జీవన చిత్రమిది. అత్యంత వెనుకబడిన తెగకు చెందిన ఆ కుటుంబాల్లో కొన్ని అడవి అంచున ఓ గ్రామాన్ని నిర్మించుకున్నాయి. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టి రైతు కుటుంబాలుగా మారాయి. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతమయ్యాయి. తమ చరిత్ర గతిని మార్చుకున్నాయి. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి అక్షర కాంతి నింపుకుంటున్నాయి. ఇలపై వెలిసిన ఈ అల వైకుంఠపురంలోకి తొంగిచూస్తే.. సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: గుంటూరు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు శివారు నల్లమల అడవి అంచున ఉంది వైకుంఠపురం. 1965 నాటికి ఇక్కడ నాలుగైదు యానాద కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలతో అక్కడ అప్పట్లో చిన్నపాటి కాలనీ ఏర్పాటైంది. చుట్టూ సారవంతమైన భూములుండటంతో ఆ కుటుంబాలు పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కొక్క యానాద కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు అక్కడ వారివి 310 గడపలయ్యాయి. సుమారు 940 మంది జనాభా నివాసం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన వృత్తిగా మారింది. ప్రతి ఇంటికీ పొలం సమకూరింది. ప్రతి చేనుకు బోరు, మోటార్ సమకూరాయి. సమాజానికి మార్గదర్శకంగా కట్టుబాటు దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీకి అడ్డాగా ఉన్నా.. వైకుంఠపురంలో మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిషేధించారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క నేరం కూడా నమోదు కాలేదు. అక్కడి వారెవరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన దాఖలాలు కూడా లేవు. గ్రామంలోని పిల్లలంతా చదువుకుంటున్నారు. 12 మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇలా వారంతా కష్టాన్ని, విలువల్ని నమ్ముకుని వైకుంఠపురం పేరును సార్థకం చేసుకున్నారు. వందకు పైగా జగనన్న ఇళ్లు వైఎస్సార్సీపీ రాకతో వైకుంఠపురంలో వందకు పైగా కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇకపై గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. గ్రామం మొత్తం వైఎస్సార్ సీపీ కుటుంబమే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి ఎంపీటీసీలుగా పనిచేయగా.. ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. వ్యవసాయంలో ముందడుగు వేస్తున్నాం నిజానికి మాకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. పత్తి, మిరప, వరి, కంది పంటలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యాన పంటలపైనా దృష్టి పెట్టాం. గ్రామంలో పదెకరాల దాకా తైవాన్ జామ తోటలు సాగు చేస్తున్నారు. బత్తాయి, మామిడి తోటలు కూడా పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామంగా రూపుదాల్చక ముందు మేమంతా కరెంటు లేకుండా అడవిలోనే గడిపాం. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని ముందుకుపోతున్నాం. ఇందిరమ్మ, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చలవ వల్ల అందరికీ ఇళ్లు, స్థలాలు సమకూరాయి. విడతల వారీగా ప్రతి ఇంటికి సేద్యం భూమి లభించింది. – ఒబ్బాని కనకయ్య, వైకుంఠపురం గ్రామ స్థాపకుల్లో ఒకరు రైతులుగా ఎదిగాం మా చిన్నప్పుడు ఇల్లు వాకిలి సక్రమంగా ఉండేవి కాదు. ఏదో ఒక చెరువు గట్టున, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని ఉండేవాళ్లం. ఇప్పుడు మాకంటూ ఒక ఊరు ఏర్పడింది. మా పూర్వీకులు తరతరాలుగా గడిపిన జీవితాలను తలుచుకుంటే నిజంగా ఇది ఎంతో ముందడుగే. గతంలో పొలాలకు కాపలా ఉండడం, ఎలుకల బుట్టలు పెట్టడం, చేపలు పట్టడం వంటి పనులతోపాటు కట్టెలు కొట్టుకుని జీవించేవాళ్లం. క్రమేణా ఆ వృత్తుల నుంచి రైతులుగా ఎదిగాం. ఇప్పుడు మంచి పంటలు పండిస్తున్నాం. – చేవూరి లక్ష్మయ్య, గ్రామ పెద్ద, వైకుంఠపురం పొలాలున్నాయ్.. చదువులొచ్చాయ్ మా గ్రామంలో అందరికీ పొలాలున్నాయి. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. జీవితాలు కొంచెం మెరుగుపడగానే పిల్లలను చదివించుకోవాలనే తలంపు వచ్చింది. గ్రామంలో పాఠశాల కూడా పెట్టడంతో పిల్లలను చదివించుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. అనేక శతాబ్దాలుగా సంచార జీవితం గడుపుతూ వేటతో పొట్టనింపుకునే స్థాయి నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చదువులో కూడా ముందడుగు వేస్తున్నాం. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అభివృద్ధికి అడుగడుగునా అండగా ఉంటున్నారు. – యాకసిరి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ -
Prof B Koteswara Rao Naik: ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా..
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్ అందుకున్నారు. నల్లమల పర్వత ప్రాంతంలోని ఓ కుగ్రామంలో మొలకెత్తిన జ్ఞానవృక్షం ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్. ప్రొఫెసర్ నాయక్ ఇప్పటివరకు 70 గొప్ప పరిశోధనా పత్రాలను వివిధ విద్యాలయాలకు సమర్పించారు. ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ లో ఆయన ఆరితేరినవారు. వినూత్నత, సాంకేతిక నిర్వహణలో నిపుణులు. ‘టెక్నో ఆంట్రప్రెన్యూర్షిప్’లో పరిపూర్ణత గలవారు. ఆయన సమర్పించిన సిద్ధాంత పత్రాలు యు.ఎస్.ఎ. జపాన్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, అబు–దాబి, థాయ్‌లాండ్‌ల విశ్వవిద్యాలయాలకు కరదీపికలయ్యాయి. మాటల్లో వర్ణించలేను తల్లిదండ్రుల సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం వారి సంతోషాన్ని చూడడం జీవితకాలపు సంతోషం అందించింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఇంతమందిని గుర్తించి, సన్మానించడం సాధారణ విషయం కాదు. సాక్షి గ్రూప్‌కి, జ్యూరీకి ధన్యవాదాలు. – ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావు నాయక్ -
యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)కు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. గత ఏఎండీ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపం మారడం తో నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అటవీ శాఖ స్పష్టీకరించింది. యురేని యం అన్వేషణకు 2016 డిసెంబర్లో తెలం గాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా స్పష్టం చేసింది. కలిసొచ్చిన నిబంధనలు.. నల్లమలలో ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం లో యురేనియం అన్వేషణలో అడవికి నష్టం కలి గించేలా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదనే అటవీ నిబంధనల్లో పొందుపరచడం రాష్ట్ర అటవీ అధికారులకు కలిసొచ్చింది. అందుకు విరుద్ధంగా ఏఎండీ ప్రతిపాదిత చర్యలున్నందున గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఎలాంటి విలువలేకుండా పోయిందని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 2016లో జరిగిన వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో పర్యావరణవేత్తలుగా ఉన్న పలువురు సభ్యులు టైగర్ రిజర్వ్‌లో అన్వేషణకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని, అందుబాటులో ఉన్న మార్గాలు, ఇతర నియమ, నిబం ధనలను మినిట్స్‌లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2016 సమావేశంలోని నమోదు చేసిన మినిట్స్‌కు వ్యతిరేకంగా తాజా ప్రతిపాదనలున్నందున గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు అటవీశాఖ ప్రకటించింది. శాస్త్ర, సాంకేతికపరమైన అవసరాల కోసం యురేనియం అన్వేషణ అవసరం పడితే అది ఎలా చేస్తారు, దానికి అనుసరించే పద్ధతులు, సాంకేతికతకు సంబంధించి ఏఎండీ కొత్త ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్‌లైఫ్ బోర్డుకు పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఉభయసభల తీర్మానంతో.. రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసేం దుకు అనుమతివ్వబోమని కౌన్సిల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంతో అటవీ అధికారులు తాజాగా శాఖాపరంగా తమ వైఖరి స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అటవీ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడిఉందని, డ్రిల్లింగ్ చేయకుండా యురేనియం నిక్షేపాల అన్వేషణ చేపడతామంటూ ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇచ్చిన అనుమతులు కూడా రద్దయినట్టుగా లేఖ ద్వారా వెల్లడించింది. -
నల్లమల పై ఉరేనియం
-
యురేనియం తవ్వకాలపై పోరు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి కుంతియా అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలు, రైతులు, వ్యవసాయ సమస్యలు, డెంగీ జ్వరాలు, యాదాద్రిలోని చిత్రాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలో పెద్దఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం ఆదివారం యాదగిరిగుట్టకు వెళ్లనుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, వీహెచ్, పొన్నాల, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కొండపల్లి విద్యాసాగర్ ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సభ్యత్వనమోదు కార్యక్రమం షెడ్యూల్ నిర్ణయించనున్నారు. ఇప్పటికే 22 లక్షల సభ్యత్వం ఉండగా, దానిని 40 లక్షలకు పెంచాలని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపైనా చర్చించింది. -
‘తక్షణమే తవ్వకాలు ఆపాలి’
సాక్షి, న్యూఢిల్లీ: నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ కృష్ణలు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారటీ అదనపు డైరక్టర్ డా.అనూప్ కుమార్ నాయక్‌ను కలిసి మెమోరాండం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చాయన్నారు. దాదాపు 25 వేల ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయనుకున్నాం.. కానీ ఇలాంటి అన్యాయాలు చూడాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది లాభం కోసం యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చి బహుళ జాతి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరామన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. తవ్వకాలతో వన్యప్రాణులకు నష్టం: వంశీ కృష్ణ దేశంలోనే అతిపెద్ద ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఆరోపించారు. యురేనియం తవ్వకాలతో అడవులకు, వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ నది నీరు తాగే ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే యురేనియం తవ్వకాలు ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు వంశీ కృష్ణ. గిరిజనుల బాధలు వినిపించాలని వచ్చాం: సంపత్ నల్లమల ఆమ్రాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు గిరిజనుల తరఫున.. వారి బాధలు వినిపించాలని ఢిల్లీ వచ్చామన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్. నల్లమలలో అటవీ సంపదను నాశనం చేసే కుట్ర జరుగుతుందన్నారు. నల్లమల అడవుల్లో ఎవరైనా అడుగుపెడితే బాగోదని, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని సంపత్ హెచ్చరించారు. -
నల్లమలలో వెదురు నరికివేతపై నిషేధం
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు బొంగుల నరికివేతపై ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించిందని కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ మనోహర్ వెల్లడించారు. ఈమేరకు ఇటీవలే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. అడవిలో ఎవరైనా అక్రమంగా వెదురు బొంగులను నరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెదురు బొంగుల నరికివేతను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవుల పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని రేంజర్ కోరారు. -
నల్లమలలో గ్రేహౌండ్స్
విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల అలజడి లేదని చేసిన పోలీసుల ప్రకటనతో మారుమూల గ్రామాలకు వెళ్లి ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా తమ పంథా మార్చుకున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పాటు తెలంగాణ పరిధిలో మావోల మూవ్మెంట్ ఉండటంతో నల్లమలను షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకునే అవకాశాలపై పోలీసులు దృష్టి సారించారు. మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు గ్రేహౌండ్స్ బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దించాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు విశాఖ మన్యంలోలా యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించి టార్గెట్లపై దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై పోలీస్ అధికారులు దృష్టి సారించారు. గతంలో మావోల టార్గెట్‌లో ఉన్న నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కదలికలపై ఎస్పీ సత్య ఏసుబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మార్కాపురం డివిజన్లోని ప్రజాప్రతినిధుల భద్రతపై డీఎస్పీ రామాంజనేయులు సమీక్ష చేసి గన్మెన్లు, పీఏలకు పలు సూచనలు చేశారు. తమ అనుమతి లేకుండా గ్రామాలకు వెళ్లవద్దని, గ్రామ దర్శినితో పాటు పార్టీ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలని, తాము కల్పించే భద్రతతో వెళ్లాలని చెప్పారు. అనుమానిత వ్యక్తులను ఎమ్మెల్యేల వద్దకు రానివ్వద్దని గన్మెన్లకు సూచించారు. మావోయిస్టు సానుభూతిపరులు, లొంగిపోయిన వారిపై కూడా నిఘా పెట్టారు. గతంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన పెద్ద దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని యడవల్లి, గంటవానిపల్లె, చిలకచర్ల, కొత్తూరు, నల్లగుంట్ల, బంధంబావి, చినారుట్ల, పెదారుట్ల, బైర్లూటి, తుమ్మలబైలు, పాలుట్ల, శతకోడు, అక్కచెరువు, గంజివారిపల్లె, గన్నేపల్లి, వెలగలపాయ, బొమ్మిలింగం, కాకర్ల, దిగువమెట్ట, జల్లి వారి పుల్లలచెరువు తదితర గ్రామాలపై పోలీసులు దృష్టి పెట్టారు. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పులు జరగటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురంలో బేస్ క్యాంప్ ఏర్పాటు నల్లమలలో గతంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడ చనిపోయారు. అప్పట్లో గ్రేహౌండ్స్ పార్టీని మార్కాపురంలో ఏర్పాటు చేశారు. అయితే గత మూడు, నాలుగేళ్ల నుంచి మావోల కదలికలు లేకపోవటంతో గ్రేహౌండ్స్ దళాల బేస్ క్యాంప్‌లు తరలించారు. కాగా, మళ్లీ మావోయిస్టుల యాక్షన్ టీం రంగంలోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు మార్కాపురంలోని స్పెషల్ పార్టీ పోలీసులతో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఇదీలా ఉండగా తెలంగాణ ప్రాంతం నుంచి, ఏఓబీ నుంచి మావోయిస్టులు నల్లమలకు షెల్టర్‌గా ఉపయోగించుకునే అవకాశాలు ఉండటంతో గ్రేహౌండ్స్ దళాల కూంబింగ్‌తో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల, గుంటూరు జిల్లా నరసరావుపేట, గురజాల పోలీస్ అధికారులతో స్థానిక డీఎస్పీ రామాంజనేయులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుని సమీక్షించుకుంటున్నారు. గతంలో మావోయిస్టుల ఉద్యమం ఉన్నప్పుడు మార్కాపురం డివిజన్లో పనిచేసిన పోలీస్ అధికారుల సూచనలు, అనుభవాలను విశ్లేషించుకుంటున్నారు. పోలీస్ అధికారులు కూడ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులకు సూచనలు మార్కాపురం డివిజన్లోని ప్రజాప్రతినిధులు, గన్మెన్లకు, పీఏలకు పలు సూచనలు చేసినట్లు రామాంజనేయులు తెలిపారు. మావోయిస్టుల బలపడకుండా, ప్రజలు వారి వైపు ఆకర్షితులు కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీశాఖ, ఐటీడీఏ సిబ్బంది సహకారం కూడ తాము తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు సమీపంలోని ఎస్సైలకు సమాచారం అందించకుండ వెళ్లకూడదని స్పష్టం చేశారు. –డీఎస్పీ రామాంజనేయులు -
నల్లమలలో గంజాయి సాగు
మహబూబ్‌నగర్, అచ్చంపేట: నల్లమల అటవీప్రాంతం గంజాయి సాగుకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ సారవంతమైన భూములు ఉండటంతో అక్రమార్కులు అంతరపంటగా, మామిడి, ఇతర తోటల్లో గంజాయి సాగుచేస్తూ అక్రమ వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. రూ.కోట్ల విలువైన గంజాయిని ఇక్కడినుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయం గురించి పక్కా సమాచారం సేకరించిన ఎక్సైజ్‌శాఖ మంగళవారం అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామశివారులో కంది, పత్తి పంటల్లో అంతర్పంటగా 3ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన సుమారు 5,050 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. దాని విలువ సుమారుగా రూ.50లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే కేజీ ఎండిన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. బొల్గాట్పల్లి శివారులోని సర్వేనంబరు 33/ఆ/2లో రంగాపూర్ గ్రామానికి చెందిన రామావత్ శ్రీను అలియాస్ చిన్న కుచెందిన పొలంలో గంజాయి సాగుచేసినట్లు సమాచారం అందిందని, పోలీసుశాఖ సహకారంతో దాడులు చేసి ఒకరిని అ రెస్ట్చేసినట్టు మహబూబ్‌నగర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సీఐ మహబూబ్అలీ తెలిపారు. దాడుల్లో సిబ్బంది గణపతిరెడ్డి, అచ్చంపేట సీఐ శ్రావణ్‌కుమార్, ఎస్ఐ నిజామొద్దీన్, దామోదర్, స్వామి, చిన్న, సూర్యానారాయణ, బాబు, లక్ష్మినర్సింహారెడ్డి, సంతోష్, అనిత పాల్గొన్నారు. -
నల్లమలలో భారీ డంప్ స్వాధీనం
ఒంగోలు : ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మావోయిస్టులు పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం పాలుట్ల సమీపంలో పాత డంప్‌ను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ డంప్‌లో పెద్ద ఎత్తున తుపాకులు, పలు రకాల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో డంప్ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
చందంపేటలో... రమణీయ సోయగాలు
పచ్చని చీరను పరుచుకున్నట్టున్న కొండలు.. కొండల నడుమ జాలువారే జలపాతాలు.. పురాతన ఆలయాలు.. శివలింగాలను నిత్యం అభిషేకించే జలధారలు.. వేల ఏళ్ల క్రితం నాటి సమాధులు.. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దేవరచర్ల, వైజాగ్ కాలనీ ప్రాంతాల్లోని అందాలివి. ఇంతేకాదు ‘అరకు లోయ’ను తలపించే సోయగాలు.. బొర్రా గుహలను తలపించే గాజుబిడం గుహలు.. వేల ఏళ్లనాటి ఆలయ అద్భుతాలను ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. చుట్టూ కొండలు.. పచ్చని అందాలు.. జలపాతాలు * బొర్రా గుహలను తలపిస్తున్న గాజుబిడం గుహలు * పురాతన ఆలయాలు.. నల్లమల అడవి సొబగులు * పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిన అధికారులు దేవరకొండ/చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. వైశాల్యంలో చాలా పెద్దదైన ఈ మండలం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏరాటైన తర్వాత పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కూడా. ఈ నేపథ్యంలో దేవరచర్లలోని ప్రకృతి అద్భుతాలను, అక్కడి రమణీయ దృశ్యాలను, జలపాతాల గురించి ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు దేవరచర్లను సందర్శించారు. అక్కడి అద్భుతాలను తెలంగాణ ‘అరకు’గా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల డిమాండ్లతో అధికారులు... ఇటీవల ఇక్కడి మరిన్ని ప్రాంతాలను సందర్శించి, ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఎన్నో రమణీయ ప్రదేశాలు అక్కడ ఉన్నాయని.. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందని వారు పేర్కొన్నారు. కాచరాజుపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలోని గుట్టల్లో ఉన్న గాజు బిడం గుహలను పరిశీలించారు. బొర్రా గుహలకు ఇవి ఏమాత్రం తీసిపోవని గుర్తించారు. అంతేకాదు బొర్రా గుహల్లో మామూలుగా రాతి కట్టడం మాదిరిగా ఉండగా గాజుబిడం గుహల్లో మాత్రం ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన రంగుల్లో ఉండడాన్ని గుర్తించారు. ఆ గుహలకు ఎంతో విశిష్టత ఉందని, పురావస్తుశాఖ అధికారులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దేవరచర్లలో ఉన్న శివలింగంతో పాటు చందంపేట పరిసర ప్రాంతాల్లో 9 గుట్టల పరిధిలో పురాతనమైన ఆలయాలున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. అక్కడి నుంచి కృష్ణానదిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలో ముంపునకు గురైన ఏలేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా నదిలోని ఓ దీవిలో ఉన్న మల్లన్న, మల్లప్ప దేవాలయం గురించి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయాల్సి ఉంది.. దేవరచర్ల, వైజాగ్ కాలనీలో గుర్తించిన అంశాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ శివాజీ చెప్పారు. కృష్ణానదిలో ఉన్న పలు దీవులను పరిశీలించిన వారు.. అవి పాపికొండలను తలపించే మాదిరిగా ఉన్నాయని అభివర్ణించారు. అరకును మించిన సోయగాలు చందంపేట ప్రాంతంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశక్యత ఉందని పేర్కొన్నారు. కాగా.. దేవరచర్లలో ఉన్న పురాతన ఆలయాలు, ప్రకృతి అందాల విషయమై తన దృష్టికి వచ్చిందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు నివేదిక తయారు చేశారని హోంమంత్రి నాయిని ఇటీవల దేవరకొండలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. -
కంబాలపల్లిలో బాంబుల కలకలం
దేవరకొండ : జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం కన్పించే ప్రాంతమైన చం దంపేట మండలం కంబాలపల్లిలో బాంబులు కలకలం రేపాయి. ఒకటి కాదు, రెండు కాదు 59 హైలీ ఎక్స్‌ప్లోజివ్ బాంబులను పోలీసులు కనుగొన్నా రు. కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల మోద్గులబొంద సమీపంలో బయటపడ్డ డర్డీ బాంబుల ఘట నతో మళ్లీ పాత కక్షలు భగ్గుమంటాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ గ్రామం పలుసార్లు వార్తల్లోకెక్కింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నోసా ర్లు పాత కక్షలతో బాంబు దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 2008లో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య వర్గపోరుతో బాంబులు వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. 2009లో సుమారు 40 నాటు బాంబులను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. అతి కొద్ది కాలంలోనే మరోసారి కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ రీతిలో ఒకరిపై ఒకరు బాంబు దాడులకు పాల్పడ్డారు. 2011లోనూ ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు బాంబులు వేసుకోవడంతో పలువురు గాయాలపాలయ్యారు. గతానికి భిన్నం గతంలో బాంబు దాడులకు పాల్పడినప్పటికీ, అప్పుడు వేసుకున్న బాంబులు మరీ అంత ప్రమాదకరమైనవి కావు. కానీ ఈసారి బయటపడ్డ బాంబులు పొటాషియం, గంధకం, సీస పెంకులు, పదునైన గాయాలు చేసే రాళ్లతో కూడి డిటోనేటర్‌తో పేలుడుకు గురయ్యే అతి ప్రమాదకరమైన బాంబులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ బాంబులకు వాహనాలను కూడా పేల్చే సామర్థ్యం ఉంటుందని తెలియజేస్తున్నారు. జాతరే లక్ష్యమా ? దాచి ఉంచిన 59 నాటుబాంబులు వెలుగు చూడడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఉన్న రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల గ్రామంలో రెండు పార్టీల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం చినికిచినికి గాలి వానలా మారింది. ఒక వర్గం మరొక వర్గంపై కేసు పెట్టడంతో ఒక వర్గానికి చెందిన ఏడుగురు వారం రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ రెండు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఎవరైనా నాటు బాంబులను తెప్పించి ఉంచారా అన్న అనుమానాలున్నాయి. అంతేకాక ప్రతి ఏటా కంబాలపల్లిలో మహాలక్ష్మమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు పలు జిల్లాల నుంచి కూడా జనం వస్తుంటా రు. కాగా ఈసారి ఈ జాతరను ఒక వర్గం వాయిదా వేయగా, మరో వర్గం నిరాడంబరంగా జరుపుకున్నారు. పోలీసులు ముందస్తుగా బాంబులను గుర్తించడంతో పెనుప్రమాదమే తప్పింది. -
మనుషులు మారారు! బతుకులింకా మారలేదు!!
నల్లమల అడవుల్లో అదో కుగ్రామం.ఒకప్పుడు దాని పేరు సెటిల్మెంట్.ఇప్పుడు సిద్ధాపురం. ఆ ఊరిలో క్రీడా పతకాన్ని సాధించిన యువకుడు ఉన్నాడు. కంప్యూటర్స్‌లో పట్టభద్రులున్నారు. కానీ, పట్టా చేతపుచ్చుకుని ఉద్యోగానికెళితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. పెళ్లి చేసుకుంటామంటే అమ్మాయినివ్వరు. ఆ ఊరి ఆడపిల్లను కోడలిగా చేసుకోవడానికి ఏ ఊరూ ముందుకు రాదు. ఇది ఏ దేవుని శాపమూ కాదు. కేవలం స్వార్థపరుల కుయుక్తుల ఫలితం! బ్రిటిష్ కాలంలో వెలసిన ఈ గ్రామ వివరాల్లోకి వెళితే... ఒకప్పుడు చెన్నై, బేతంచర్ల, దేవరకొండ, కప్పట్రాళ్లతిప్ప ప్రాంతాల్లో కరడుగట్టిన దొంగలుండేవారు. వారిలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దాదాపుగా 30 మంది దొంగలను సమీకరించి, వారిని కుటుంబాలతో సహా ఒక ప్రదేశానికి తరలించింది. తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసి, దానికి సెటిల్మెంట్ అని పేరు పెట్టింది. నిత్యజీవిత అవసరాలకు తగినట్లు సౌకర్యాలు సమకూరుస్తూ క్రమంగా గ్రామంగా రూపుదిద్దింది. బడి, ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆ గ్రామం పేరు... సిద్ధాపురం. నల్లమల అటవీ ప్రాంతంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 82 కి.మీ.ల దూరంలో ఉందీ ఊరు. నిజానికి బ్రిటిష్‌వారి కాలంలో వీరి జీవితాలను బాగు చేయడానికి చాలా కసరత్తే జరిగింది. పని మీద దృష్టి మళ్లిస్తే దొంగతనాలను మరిపించవచ్చనే ఉద్దేశంతో 70 ఎకరాల సర్కారు పొలాన్ని ఇచ్చి, చెరువు తవ్వి సాగుచేసుకోమన్నారు నాటి అధికారులు. పశువుల పెంపకం అలవాటు చేశారు. సభ్యసమాజంలో ధైర్యంగా జీవించగలిగేటట్లు వారిలో పరివర్తన తీసుకువచ్చారు. అంతా అనుకున్నట్లే జరిగితే... ఇది ఓ ఆదర్శగ్రామం అయ్యేది. అయితే నూటికి తొంభై మంది మంచిగా మారిపోయి, గౌరవప్రదంగా జీవిస్తున్నప్పటికీ పదిశాతం మంది దొంగతనాలను వదలకపోవడంతో సిద్ధాపురం ఓ ‘దొంగల గ్రామం’గా ముద్ర వేయించుకుంది. ఆ ముద్ర నుంచి బయట పడడానికి నాటి నుంచి నేటి వరకూ అష్టకష్టాలు పడుతూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది... కానీ! దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ పాలకులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ స్థానిక అధికారులకు సిద్ధాపురం గురించి అవగాహన లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. పరివర్తన చెందకుండా ఉన్న పదిశాతం మంది వీరవిహారం చేయడం మొదలు పెట్టారు. తెలుగు నేల మీదే కాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కడ దొంగతనాలు చేయాలన్నా వీరే ముందుండేవారు. ఒక సమయంలో వీరు తమకు తెలియకుండానే కొందరు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టు నాటు సారా తయారుచేయడం, అడవిలో చెట్లను నరికి అక్రమ రవాణాకు సహకరించడం, జంతువులను వేటాడడం వంటి అరాచకాలకు పాల్పడేవారు. కేవలం వీరివల్ల ఆ ఊరు దొంగల గ్రామంగానే మిగిలి పోయింది. నిజానికి 360 కుటుంబాలున్న ఆ గ్రామం ఇప్పుడు బాగా మారింది. పిల్లలు చదువుకున్నారు. పెద్దలు వ్యవసాయం చేసుకుంటున్నారు. గేదెలను మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం... ఇప్పటికీ ఎప్పుడు ఎక్కడ చోరీ జరిగినా అందరి చూపూ వీరి మీదికే మళ్లుతోంది. మార్పు వచ్చింది..! సిద్ధాపురం వాసుల్లో మంచి మార్పు వచ్చింది. ఇంకా కొందరు దొంగలున్నారు. వారిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. వారికి తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో సంపాదించేందుకు తోడ్పడుతున్నాం. - నరసింహారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ, కర్నూలు జిల్లా కాలం మారింది... మేమూ మారాం! ‘దేశం శాస్త్ర సాంకేతికంగా ఎదుగుతోంది. ఆ ప్రకారమే మేమూ ఎదుగుతాం’ అంటున్నారు సిద్ధాపురం యువకులు. ఈ ఊళ్లో బీఏ, బీకామ్ బీఎస్సీ, కంప్యూటర్స్ కోర్సులు చేసిన వాళ్లు ఉన్నారు. స్పోర్ట్స్ అవార్డు అందుకున్న సుధాకర్ ఉన్నాడు. కానీ వీరిని నిరుద్యోగం పీడిస్తోంది. ‘‘ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా సిద్ధాపురం పేరు చెబితే వెనక్కు పంపేస్తున్నారు. పోనీ ఊళ్లోనే ఉండి ఏ గేదెలో మేపుకుంటూ బతుకుదామంటే ఎక్కడ దొంగతనం జరిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారని భయం’’ అని యువకులు ఆవేదన చెందుతున్నారు. వారి భయంలో నిజం లేకపోలేదు. కొన్నిసార్లు వేరేవాళ్లు చేసిన నేరాలు కూడా వారిమీద పడుతుంటాయి పాపం. ఇటీవల శ్రీశైలం స్వామి దర్శనం కోసం వెళ్లినప్పుడు... సిద్ధాపురం వాసులని తెలిసి బట్టలూడదీసి కూర్చోబెట్టారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడి యువకులకు అమ్మాయినివ్వడానికి ఏ ఊరివాళ్లూ ముందుకు రావట్లేదు. అలాగే ఈ ఊరి అమ్మాయిలను చేసుకోవడానికి కూడా ఏ ఊరి యువకులూ మొగ్గుచూపట్లేదు. మరోపక్క సిద్ధాపురం అన్ని రకాలుగానూ వెనుకబడి ఉంది. అభివృద్ధి పనులు లేవు. సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, మురుగు కాలువలు లేవు. వర్షం వస్తే గ్రామమంతా బురద! బ్రిటిష్ పాలకులు పెట్టిన ఆసుపత్రి మూతపడింది. వందల పశువులున్నా పశువైద్యులు లేరు. పాఠశాల కూడా శిథిలావస్థలో ఉంది. వీరి కోసం ఎవరూ ఏమీ చేయక పోవడం బాధాకరం. అయితే అంతకంటే ఎక్కువ బాధ, తమను ఇంకా దొంగలుగానే చూస్తుంటే కలుగుతోందని అంటు న్నారు వారు. ‘అక్రమ మార్గాన్ని వదిలేశాం, సక్రమంగా బతుకుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, అందరిలో కలుపుకోండి’ అని వేడుకుంటున్నారు. ‘పరివర్తన చెందాం... మమ్మల్ని నమ్మండి’ అని బతిమాలుతున్నారు. వారి వేదన ఇప్పటికైనా అందరికీ అర్థమైతే అదే చాలు! - రవిరెడ్డి, సాక్షి, కర్నూలు ఫోటోలు: హుస్సేన్ -
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
పెద్దదోర్నాల : నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య తెలిపారు. మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని గిరిజన గూడేల్లో డయేరియా, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజన గూడేల్లో చర్మవ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందిస్తామన్నారు. గిరిజన గూడేల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో గుర్తించి, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డయోరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి జ్వర పీడీతుల వద్ద రక్తపూత నమూనాలు సేకరించాలని స్థానిక వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెంచు గిరిజనులకు సంబంధించి ఆస్పత్రిలో గర్భిణులు వేచి ఉండే గదుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, కొందరు వైద్యులు, సిబ్బంది ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆయనతో పాటు త్రిపురాంతకం ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు, వైద్యులు విక్టర్, డెంటల్ సర్జన్ ఉమానందిని, ఇతర సిబ్బంది ఉన్నారు. -
నల్లమలలో అలజడి
అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు గురువారం జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో భారీ కూంబింగ్ ఎన్కౌంటర్లో ముగ్గురుమవోయిస్టులు మృతి..! గాయాలతో తప్పించుకున్న విక్రమ్ కోసం గాలింపు ముమ్మరం అప్రమత్తమైన గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు హడలిపోతున్నజాప్రతి నిధులు,రాజకీయ నాయకులు గుంటూరు : నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సతకోడు గ్రామ శివారుల్లో గురువారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. పదేళ్ల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్ట్‌లకు పోలీసులు పెద్ద దెబ్బ కొట్టినట్లేనని చెప్పవచ్చు. కొంత కాలంగా నల్లమలలో మావోయిస్ట్‌ల కదలికలు ప్రారంభమయ్యాయనే వదంతులను పోలీసు ఉన్నతాధికారులు కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ నెల 9వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘నల్లమలలో మావోయిస్ట్ కదలికలు’ అనే కథనం ప్రచురితమయింది. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమయింది. ఈ నెల 8వ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సభలో సైతం పోలీసులు మావోయిస్ట్‌ల ఫొటోలతో కూడిన బ్యానర్లు పెట్టడం ఇందుకు నిదర్శనం. గుంటూరు పోలీసులు నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా బోర్డర్లో గురువారం మావోయిస్ట్‌లు అకస్మాత్తుగా తారసపడి పోలీసులపై ఎదురు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రిక్రూట్మెంట్ నేపథ్యంలోనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీమాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు నల్లమల ప్రాంతాన్నిషెల్టర్ జోన్‌గా మలుచుకుని తిరిగి రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఆకర్షించి తమవైపునకు తిప్పుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 2004కు ముందు జిల్లాలో వీరి కార్యకలాపాలు యథేచ్చగా సాగేవి. అప్పటి ప్రభుత్వం అనేక మంది మావోయిస్టులను, సానుభూతి పరులను లొంగిపోయేలా చేసి, వారికి జీవన భృతి కల్పించి జన జీవన స్రవంతిలో కలిసే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వె ళ్లిన కొందరు మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలో ఎన్కౌంటర్ జరగడంతో ఈ ప్రాంతంలో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన సంఘటనలో తీవ్ర గాయాలతో తప్పించుకున్న మావోయిస్ట్ విక్రమ్‌గా అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు భారీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ఎస్పీలు అప్రమత్తమై సాయుధ బలగాల ద్వారా నల్లమలను జల్లెడపట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోలతోపాటు తప్పించుకున్న మావోయిస్ట్‌కు నల్లమల అటవీ ప్రాంతంలో అణువణువూ కొట్టినపిండి లాంటిది కావడంతో ఎటు నుంచి ఏ జిల్లాలోకి ప్రవేశిస్తారో ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు కూంబింగ్ పార్టీ పోలీసుల నుంచి వీరంతా త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామాలు మావోల కదలికలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో నిత్యం కంటిపై కనుకు లేకుండా ఉండేవి. తాజా ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని తెలుసుకుని ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామా ల్లో ఉండే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం హడలిపోతున్నారు.