ఒకటో తారీఖు వచ్చిందంటే పింఛన్ అందాల్సిందే. అది పట్టణమైనా, కీకారణ్యమైనా వలంటీర్లు వెళ్తున్నారు. నల్లమల అడవులూ అందుకు మినహాయింపు కాదు. శ్రీశైలానికి దాదాపు 25 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల్లో ఉండే చెంచుల గూడెం నెక్కంటి పెంటకు వెళ్లడం సాహస యాత్రే. అక్కడ ఇద్దరు చెంచులకు మాత్రం టంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రతి నెలా అక్కడకు 14 కి.మీ. దూరంలోని పాలుట్ల పెంట నుంచి వలంటీర్ బయన్న ట్రాక్టర్‌పై వచ్చి పింఛన్ డబ్బులిస్తున్నాడు. సుమారు పది కుటుంబాలు ఉండే నెక్కంటి పెంటకు సోలార్ ద్వారా కరెంట్, బోరు నీటిని ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు గిరిజన మహిళ చెవుల బసవమ్మ తెలిపింది.
సున్నిపెంట నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు: దేశవ్యాప్తంగా అంతరించి పోతున్న 75 గిరిజన తెగల్లో మన రాష్ట్రంలో నివసించే చెంచులు మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మనుగడ పోరాటం చేస్తున్న చెంచు గూడేల్లో వికసిస్తున్న అభివృద్ధి రేఖలు, వారి జీవనశైలిని పరిశీలించేందుకు సున్నిపెంట సమీపంలోని పలు ప్రాంతాలను రెండు రోజుల పాటు సందర్శించి దట్టమైన అడవుల్లో రాళ్లు రప్పలతో నిండిన బాటలో జీపు, కాలినడకన కిలోమీటర్ల మేర ప్రయాణించి ‘సాక్షి’ ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
మూడు జిల్లాల పరిధిలో
దట్టమైన నల్లమల అడవుల్లో పర్వతాలతో కూడిన ప్రాంతాలే చెంచులకు ఆవాసాలు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 171 చెంచు గూడేలున్నాయి. వీటిని చెంచు పెంటలుగా పిలుస్తుంటారు. కీకారణ్యంలో క్రూరమృగాలు, వన్యప్రాణులతో కలసి జీవించే వీరంతా బాహ్య ప్రపంచానికి రావాలంటే మొనదేలిన రాళ్లతో కూడుకున్న అటవీ మార్గంలో కిలోమీటర్ల తరబడి నడవాల్సిందే. వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి జీవనోపాధి. విల్లంబులు, చిన్నపాటి కత్తి వీరి ఆయుధాలు. గతంలో ఎలుగుబంటి, జింకలను వేటాడేవారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో వేట వదిలేసి ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలపై ఆధారపడుతున్నారు.
భిన్న జీవన శైలి
చెంచుల ఆహారపు అలవాట్లు సైతం చాలా సరళమైనవి. జొన్నలు, సజ్జలతో చేసిన జావ తాగుతారు. ఉడకబెట్టినవి, కాల్చిన దుంపలు, గడ్డలు తింటారు. చింతపండును బూడిదలో కలిపి తింటారు. ఉపాధి కోసం ఉదయం బయటకు వెళ్లేప్పుడు అన్నం తింటే తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాకే మళ్లీ ఆహారం తీసుకుంటారు. చెంచు గూడేల్లో పెద్ద ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉంటారు. వివాహ వేడుక పెద్దల అంగీకారంతో జరుగుతుంది. సంసారం పొసగకపోతే విడాకులు మామూలే. వితంతు వివాహాలు జరుగుతాయి. శివుడి ప్రతిరూపంగా లింగమయ్యను పూజిస్తుంటారు. డబ్బులు దాచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వరు. ఆహారాన్ని నిల్వ చేసుకోరు. ఏ రోజుకారోజు అనే రీతిలో జీవిస్తారు. అప్పుడప్పుడు కూలి పనులు చేసినా తమ జీవన విధానమైన అటవీ ఉత్పత్తుల సేకరణకే మొగ్గు చూపుతుంటారు.
అడవి తల్లి.. అమ్మవారు
శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి తెలిసిన వారు తక్కువే. అక్కడికి ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే. కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే అటవీ శాఖ అధికారుల అనుమతితో నడుస్తాయి. దట్టమైన అడవిలో బండరాళ్లు, మొనదేలిన రాళ్ల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ప్రయాణంతో ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి చేరుకోవచ్చు. అడవి తల్లిని, అమ్మవారిని నమ్ముకుని దాదాపు 26 చెంచు కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి గూడెం
అభివృద్ధి ఇలా..
మొత్తం 171 చెంచు గూడేలకు వాటర్ ట్యాంక్‌లు, బోర్లు, పైపులైన్ల ద్వారా ప్రభుత్వం మంచినీటి వసతి కల్పించింది. 166 గూడేలకు సోలార్‌తో విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. 164 గూడేలకు రోడ్డు మార్గం ఉంది. మొత్తం 6,912 కుటుంబాల్లో 3,561 కుటుంబాలకు ఇళ్లు ఉన్నాయి. జగనన్న కాలనీల్లో మరో 2,940 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. 2,364 ఇళ్లకు మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. 14,071.29 ఎకరాల ఆర్వోఎఫ్‌ఆర్, అసైన్డ్ భూములను 5,186 కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. నవరత్నాల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా 2,411 మందికి, వైఎస్సార్ చేయూత మొదటి విడతలో 599 మందికి, రెండో విడతలో 825 మందికి అందించారు. వైఎస్సార్ ఆసరా 1,005 మందికి, వైఎస్సార్ పెన్షన్ కానుక 2,186 మందికి ఇస్తున్నారు.
విద్య – వైద్యం
నిరుపేద చెంచు కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 12 గురుకులాలు, 66 ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తోంది. నాడు–నేడు ద్వారా 9 గురుకులాలు, 42 పాఠశాలలు అన్ని వసతులతో నిర్మించారు. ఆరు సామాజిక, 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 126 సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు..
మా నాన్నకు ఐదుగురు సంతానం. ప్రభుత్వం అటవీ శాఖలో నలుగురికి ఉద్యోగం ఇచ్చింది. విభిన్న ప్రతిభావంతుడినైన నాకు అటవీ శాఖ ద్వారా ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.12,500 ఇస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 63 బేస్ క్యాంపుల్లో నాలాంటి 300 మందికిపైగా చెంచు యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది.
– చెవుల బసవయ్య, చెంచు యువకుడు
గూడేనికే టీచర్
తాత ముత్తాతల కాలం నుంచి అడవి తల్లినే నమ్ముకుని జీవిస్తున్నాం. మా పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం గూడేనికే టీచర్‌ను పంపిస్తోంది. ఆరు కిలోమీటర్ల దూరంలోని నెక్కంటి పెంట నుంచి రోజూ వచ్చే ఐటీడీఏ టీచర్ శ్రీను ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 20 మంది పిల్లలకు పాఠాలు చెబుతారు. ఒకటో తేదీనే వలంటీర్ మల్లిఖార్జున వచ్చి ఐదుగురికి పెన్షన్ డబ్బులిస్తున్నారు.
– చిగుళ్ల వెంకటమ్మ, ఇష్టకామేశ్వరి గూడెం
బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయాలు
హైదరాబాద్ కేంద్రంగా 1975లో ఏర్పాటైన చెంచు ఐటీడీఏను 1988లో శ్రీశైలానికి తరలించారు. శ్రీశైలం ప్రధాన కేంద్రంగా 3,600 చ.కి.మీ విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల్లో చెంచు ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారు సేకరించే అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేందుకు వన్ ధన్ వికాస కేంద్రాలు 10 కేటాయించాం. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.ప్రత్యేక కార్యాచరణతో వారికి ఆధార్ నమోదు చేపట్టాం.
–రవీంద్రారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్,శ్రీశైలం ఐటీడీఏ
Comments
Please login to add a commentAdd a comment