మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే! | Sakshi
Sakshi News home page

మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!

Published Mon, Apr 29 2024 9:25 AM

Pensioners fire on Chandrababu about Volunteer issue

కర్నూలు(అగ్రికల్చర్‌): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్‌దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్‌ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్‌ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో  ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోర్టులను, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. 

దీంతో పింఛన్‌దారులకు మొదటిసారిగా ఏప్రిల్‌ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్‌ కోసం  రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న  సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్‌ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని  మార్పులు చేశారు.

నగదు బదిలీ సాధ్యమేనా? 
పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్‌ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, సైనిక్‌ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్‌దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు.  డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్‌ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్‌దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.

డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛన్‌ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్‌దారులకు టీడీపీ నేతల కుట్రలతో  కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి  ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్‌లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్‌లకు రూ.66,08,47,000  పంపిణీ చేయనున్నారు.

సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు 
∙ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన 
కర్నూలు(సెంట్రల్‌): లబి్ధదారులు ఎవరూ పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్‌ పంపిణీ అంశంపై స్పెషల్‌ సీఎస్‌ ఆజయ్‌జైన్, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్‌దారులు ఎవరూ పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. 

దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్‌ చైర్‌లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్‌ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్‌ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్‌ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్‌ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. 

Advertisement
Advertisement