1.35 లక్షలు తగ్గిన పెన్షనర్ల సంఖ్య.. కొత్త పింఛన్ల నమోదుకు ఇప్పటిదాకా అవకాశం ఇవ్వని కూటమి సర్కారు
తాము వచ్చాకే పింఛన్లు పంపిణీ చేయాలని స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. ఆధిపత్యం కోసం పలు చోట్ల కొట్టుకుంటున్న
టీడీపీ, జనసేన నేతలు
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మొరాయించిన సర్వర్లు.. అవ్వాతాతలకు ఇక్కట్లు
గత ఐదేళ్లూ రాజకీయాలకు దూరంగా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ
మరోపక్క పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు టార్చర్
వలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండా పంపిణీ చేశామని చెప్పుకోవడానికి ఆపసోపాలు
తెల్లవారుజామునే పంపిణీ మొదలు పెట్టలేదని 10 గంటలకే ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కొన్ని చోట్ల సచివాలయాల్లో, అధికార పార్టీ నేతల ఇళ్ల వద్ద పంపిణీ చేసిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య నెలనెలకూ చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 1,35,690 మందికి పింఛన్ ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు.. ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, తాజాగా నవంబర్ 1న (శుక్రవారం) 64,14,174 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు విడుదల చేశారు. గత ఐదు నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా ప్రభుత్వం సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదు.
పైగా ఏళ్ల తరబడి ప్రతి నెలా పింఛను తీసుకుంటున్న వారికి కోతలు పెట్టేందుకు ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తోంది. ఇక అక్టోబర్‌లో జరిగిన పంపిణీకి, ప్రస్తుత నెలలో జరుగుతున్న పంపిణీ మధ్య నెల రోజుల వ్యవధిలోనే పింఛన్ల సంఖ్య 24,710కి తగ్గిపోయాయి. సాధారణంగా లబ్ధిదారుల్లో మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనుకున్నా, ప్రతినెలా 10–15 వేలకు మించవని గణాంకాలు చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎడాపెడా పింఛన్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు.
పంపిణీలో ఆధిపత్యం కోసం గొడవలు
రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రతి నెలా అవ్వాతాతలకు అందజేసే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ రంగు పులిమింది. ఈ పంపిణీ పూర్తిగా తమ కనుసన్నల్లోనే జరగాలని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అత్యధిక చోట్ల స్థానికంగా పింఛన్లను పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని హెచ్చరిస్తూ, పంపిణీ చేసే ఉద్యోగుల వెంట లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెత్తనం చెలాయిస్తున్నారు.
కూటమిలోని టీడీపీ–జనసేన–బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నవంబరు 1 (శుక్రవారం) పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతలపాడులో టీడీపీ–జనసేన నాయకులు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకించిన ఏరియాల్లో పింఛను పంపిణీ తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలంటూ పట్టుబట్టి, ఘర్షణలు పడటం గమనార్హం.
సిబ్బందికి షోకాజ్ నోటీసులు
వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం 6.15 వరకు పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదంటూ ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 70 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులకు నగర కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 14 మందికి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలంలో 28 మందికి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 15 మందికి, బాపట్ల జిల్లా అద్దంకిలో ఆరుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్టు తెలిపారు.
ఇవి కేవలం తమకు అందిన సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయారు. ఒక్క జూలై నెలలోనే దాదాపు 4 వేల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని.. ఇలా ప్రతి నెలా జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన నత్తల వజ్రమ్మ (62) కావలిలో తన కూతురు శిరీష (33)వద్దకు వెళ్లింది.
1వ తేదీ పింఛను తీసుకునేందుకు కూతురితో కలిసి వస్తూ.. కావలిలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కుప్పం–3 సచివాలయం వద్దకు వృద్ధులను పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న అనిత.. చిన్నపాండూరు సచివాలయ పరిధిలోని యానాదివెట్టు, రాచర్ల గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు.
సమస్యల నడుమ పంపిణీ
నవంబరు 1వ తేదీ (శుక్రవారం) సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.76 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అయితే పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు సర్వర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపిణీ సమయంలో లబ్ధిదారులకు డబ్బులు అందజేసిన అనంతరం ఆయా లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సర్వర్ పనిచేయక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు పంపిణీ నిలిచిపోయింది.
మరోవైపు.. వేలిముద్ర నమోదుకు ఉపయోగించే స్కానర్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా అవి పని చేయలేదు. అప్పటికప్పుడు వాటి స్థానంలో వేరే స్కానర్లు మార్చాల్సి వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కింద, సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ప్రాణం మీదకు తెచ్చిన పింఛన్
కాశీబుగ్గ: పింఛను పంపిణీ ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా, పలాసలోని, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో బైనపల్లి దానమ్మ వితంతువు పింఛన్ కోసం మండుటెండలో నిరీక్షించింది. ఉదయం ఏడు గంటల లోపల నామమాత్రంగా పనిచేసిన సర్వర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పింఛన్ల పంపిణీ మళ్లీ మధ్యాహ్నానికి గానీ ప్రారంభం కాలేదు.
అప్పటి వరకూ నిరీక్షించిన దానమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో పింఛన్ ఇంటికి వచ్చి అందించేవారని, ఇప్పుడు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పింఛనుదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment