‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం | Police Obstruct Volunteers Chalo Vijayawada Program | Sakshi
Sakshi News home page

‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం

Published Fri, Jan 17 2025 3:13 PM | Last Updated on Fri, Jan 17 2025 4:10 PM

Police Obstruct Volunteers Chalo Vijayawada Program

సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కేబినెట్‌లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.

‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని  వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.

వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్‌రెడ్డి 
2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.

‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా‌ జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement