సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు
గాంధీజీ ఆశయాల మేరకు శ్రీకారం చుట్టిన నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం
గత ఐదేళ్ల పాటు ప్రజలకు ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు
అవినీతి, పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల అమలుకు పటిష్ట వ్యవస్థ
కేవలం నాలుగు నెలల్లోనే 1.34 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల నియామకం
వీరికి తోడు ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లు
కుగ్రామాల్లోనూ సువిశాల ఆఫీసు భవనాలు.. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్‌నెట్ వసతులు
సరికొత్త వ్యవస్థ ద్వారా ఐదేళ్లలో ఏకంగా 11.48 కోట్ల వినతులు పరిష్కారం
తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ వ్యవస్థలు నిర్వీర్యం
ప్రస్తుతం సుప్తచేతన స్థితిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ
మళ్లీ ప్రభుత్వ సేవల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి
సచివాలయాల ఉద్యోగులకు సీఎం చంద్రబాబు స్టిక్కర్లు ఇళ్లకు అంటించే బాధ్యతలు
వలంటీర్ల వ్యవస్థకు దాదాపు మంగళం
సాక్షి, అమరావతి: బాపూజీ మహాత్మా గాంధీ కలలుగన్న అసలైన గ్రామ స్వరాజ్యానికి నిలువటద్దంగా.. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా రాష్ట్రంలో సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 77 ఏళ్ల పాటు రూ.లక్షల కోట్లు వెచ్చి0చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే పటిష్ట వ్యవస్థ లేనందున లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉండింది.
ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో 2019 అక్టోబరు 2వ తేదీన అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019కి ముందు రాష్టంలో దాదాపు 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో చాలా పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ ఆఫీసు తప్ప మరో ప్రభుత్వ ఆఫీసు లేని దుస్థితి.
నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అనంతరం కొత్తగా 1.34 లక్షల శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటికప్పుడే మంజూరు చేసింది. కేవలం నాలుగు నెలల కాలంలో వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు.
ఇది దేశంలోనే ఒక రికార్డు. ఫలితంగా ప్రతి గ్రామంలో 8–10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా పని చేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణాలు, నగరాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. మరో వైపు జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవిన్యూ డివిజన్లను 52 నుంచి 77కు పెంచింది.
అధునాతన వసతులు.. పారదర్శక సేవలు
» గతంలో పంచాయతీ ఆఫీసులు ఇరుకు భవనాల్లో కొనసాగితే.. గత ప్రభుత్వం ప్రతి చోటా ఒక్కోదానికి రూ.43.60 లక్షలు ఖర్చు పెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల సచివాలయం భవనాలను నిరి్మంచింది. మొత్తం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా, అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి.
» ఒక్కో సచివాలయంలో రెండేసి కంప్యూటర్లను యూపీఎస్ సహా అందించింది. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్‌లు, 15,002 ప్రింటర్లతో పాటు 3 వేల ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతో పాటు ఇతర సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించడం కోసం, టెక్నాలజీని ఉపయోగించడం కోసం 2,91,590 స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డులతో ఇచ్చింది.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ తీరు
» వలంటీర్లకు నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వం
» ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని హామీ.. ఆచరణలో గత నాలుగు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించని ప్రభుత్వం.
» లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి తూట్లు. వలంటీర్లకు కాకుండా సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యత అప్పగింత. దీంతో చాలా చోట్ల సచివాలయాల వద్దకే లబ్ధిదారులను పిలిపించుకొని పింఛన్ల పంపిణీ.
» ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకోసం మళ్లీ మండలాలు, పట్టణాల్లో ఉండే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి.
» బుడమేరు (విజయవాడ)వరదలో గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోని ప్రభుత్వం. ఫలితంగా ప్రభుత్వ సాయం కోసం జిల్లా కలెక్టరేట్ చూట్టు తిరుగుతున్న బాధితులు.
» ప్రస్తుతం ఎక్కువగా కరెంటు బిల్లుల చెల్లింపుల వినతుల పరిష్కారానికి పరిమితం.
» నాలుగు నెలలుగా వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించని వైనం.. మూడు నెలలుగా అందని గౌరవ వేతనం.
» గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం చంద్రబాబు స్టిక్కర్లను ఇంటింటికీ అంటించే పని అప్పగింత.
మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు : 15,004
» వీటిలో జగన్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1.34లక్షలు
» గ్రామ, వార్డు వలంటీర్లు 2.66 లక్షలు
» గత ఐదేళ్లలో అందించిన సేవలు 11.48కోట్లు
» కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలు :10,893
సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిన సేవలు
» రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏకంగా 11.48 కోట్ల ప్రజా వినతుల పరిష్కారం.
» 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్‌పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్విసులు
» అత్యధికంగా కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు, వ్యవసాయ భూముల అడంగులు, 1బీ వంటి కీలక వినతుల పరిష్కారం.
» వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ.
» కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాల వర్తింపు.
» పారదర్శకత కోసం ప్రతి పథకం అమలు సమయంలో సోషల్ ఆడిట్.. సచివాలయాల వద్ద అర్హుల జాబితా ప్రదర్శన.
» ఏదైనా కారణంగా పథకం లబ్ధి అందని వారి కోసం ప్రతి ఆరు నెలలకొకసారి మళ్లీ అవకాశం కలి్పంచడం.
» ప్రతి నెలా ఠంఛన్‌గా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ
» గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలు
» ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారం.. కుల, ఆదాయ, వివిధ ధృవీకరణ ప్రతాల మంజూరుకు ప్రత్యేకంగా జగనన్న సురక్షా క్యాంపుల ఏర్పాటు.
» ప్రతి నెలా ఆధార్ క్యాంపులు ఏర్పాటు
» కోవిడ్ సమయంలో వలంటీర్లు–సచివాలయాల సిబ్బంది ద్వారా వేగంగా రోగుల గుర్తింపు, తక్షణమే వైద్య సేవలు
అందించేలా చర్యలు. తద్వారా మృతుల సంఖ్య కట్టడి. దాదాపు 30 దఫాలుగా ఫీవర్ సర్వే.
» ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధించేందుకు యునిసెఫ్‌తో కలిసి ఉమ్మడి కార్యాచరణ.
» గ్రామ, వార్డు సచివాలయాల పరిశీలకు కేంద్రం, వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు.. వాటి నుంచి ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment