సాక్షి, విజయవాడ: దావోస్(Davos) వైఫల్యంపై సీఎం చంద్రబాబు(Chandrababu) బుకాయింపులకు దిగారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోరంటూ వింత సమాధానం ఇచ్చారు. దావోస్ వెళితే పెట్టుబడులు (Investments) వస్తాయన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు భాష్యం చెప్పారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోవాల్సిన పనిలేదంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లేముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గతంలో దావోస్‌నే ఏపీకి తెస్తానంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అక్కడ ఆయన టీమ్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో దావోస్‌లో ఏపీకి ఘోర అవమానమే మిగిలింది. జీరో ఎంవోయులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరిగొచ్చారు. తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు.
‘‘దావోస్ అంటే ఒక మిత్ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు.. ఎంత డబ్బులొచ్చాయన్నది ఓ మిత్. ఇక్కడుండే ఎంవోయూలు అక్కడ చేసుకునే పనిలేదు. దావోస్ కేవలం నెట్ వర్క్ ప్లేస్ మాత్రమే. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!
దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.
ఇదీ చదవండి: చంద్రబాబు దావోస్ పర్యటన.. దారి ఖర్చులు 'దండగ'!
Comments
Please login to add a commentAdd a comment