ఆశలు ఆవిరి! | Sixth rescue team reaches end of SLBC tunnel | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి!

Published Wed, Feb 26 2025 4:23 AM | Last Updated on Wed, Feb 26 2025 4:26 AM

Sixth rescue team reaches end of SLBC tunnel

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం చివరి వరకు వెళ్లగలిగిన ఆరో రెస్క్యూ బృందం

అక్కడ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద, బండరాళ్లు,కంకర, యంత్రాల తుక్కు..

కానరాని కార్మికుల జాడ..శిథిలాల కింద నలిగిపోయినట్టుగా బలపడిన అనుమానాలు

అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం 

ప్రమాద స్థలంలో 140 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు  

నేడు ఏడో ప్రయత్నంగా వెళ్లి బండరాళ్లు, తుక్కు తొలగించాలని నిర్ణయం 

ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్ల బృందాలతోనే తవ్వకాలు 

రంగంలో దిగనున్న ఎన్‌ఆర్‌ఎస్‌ఏ నిపుణులు, మరో జీఎస్‌ఐ బృందం 

సొరంగం కూలిన ఘటనపై నివేదిక కోరిన ఎన్డీఎస్‌ఏ దక్షిణాది విభాగం 

తమవారి క్షేమ సమాచారం కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ 

నేడు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం..సర్వత్రా ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌:  శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎల్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరో ప్రయత్నంలో భాగంగా మంగళవారం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. 

ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు.   టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అయితే కార్మికుల క్షేమంపై మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 


 చివరి వరకు వెళ్లిన తొలి బృందం ఇదే..: మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరో రెస్క్యూ బృందం సొరంగంలో ప్రవేశించింది. ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ టీం ప్రత్యేకంగా తమకు కావాల్సిన వస్తువులను సేకరించి, వెల్డింగ్‌ చేయించుకుని టన్నెల్‌లోకి తీసుకెళ్లింది. టన్నెల్‌లో బురద దాటేందుకు వీలుగా, టన్నెల్‌ సైడ్‌ గోడలకు రాడ్లు కొడుతూ ప్రత్యేక దారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని వెంటబెట్టుకుని వెళ్లింది. గంటన్నర ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సొరంగం చివరి అంచువరకు వెళ్లిన ఆరో బృందం గాలింపులు నిర్వహించింది. 

సొరంగం చివరన ప్రమాద స్థలానికి చేరుకున్న తొలి రెస్క్యూ బృందం ఇదే కావడం గమనార్హం. ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లు, స్నైఫర్‌ డాగ్స్, డ్రోన్‌ ఆపరేటర్లు, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) నిపుణులతో సహా మొత్తం 35 మంది బృందంలో ఉండగా, సొరంగం చివరికి 11 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లతో పాటు నలుగురు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మాత్రమే చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో 15–18 మీటర్ల ఎత్తులో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి.  

కూలిపోయే ప్రమాదం ఉంది..’ : అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్‌ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. 

నేడు ఏడో ప్రయత్నం.. : ఏడో ప్రయత్నంలో భాగంగా బుధవారం ఉదయం మళ్లీ ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లతో కూడిన బృందం సొరంగంలోకి వెళ్లనుంది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన తుక్కును గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేయడంతో పాటు కంకర, బండ రాళ్లు, మట్టిని తొలగించే ఆపరేషన్‌ను ప్రారంభించనుంది. సహాయక బృందాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి జేసీబీ యంత్రాలు వినియోగించకుండా ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్ల బృందాలతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఎన్నిరోజుల సమయం పడుతుందో చెప్పలేమని ర్యాట్‌ హోల్‌ మైనర్‌ ఫిరోజ్‌ ఖురేషీ ‘సాక్షి’తో అన్నారు.    

కన్పించిన టీబీఎం ఉపరితల భాగం: మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం) ఉపరితల భాగం కనిపించింది. బండ రాళ్లు, కాంక్రీట్‌ పడడంతో ఈ భాగం ఊర్తిగా ధ్వంసమై కనిపించగా, మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. 

సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్‌ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి, మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కిందనుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్‌ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్‌పై పడిన మట్టి, బురదను తొలగించేందుకు మెష్‌ ప్రేమ్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరుచేసి డీ వాటరింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల వరక నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు ఐదు మోటార్లతో డీ వాటరింగ్‌ చేపడుతున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం నీటిని డీవాటరింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో, ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వారిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం
» రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
»డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో టన్నెల్‌ ఇన్‌లెట్‌ పరిశీలన
» మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డితో కలిసి సహాయక చర్యల పర్యవేక్షణ 
సాక్షి, నాగర్‌కర్నూల్‌/ అచ్చంపేట: శ్రీశైల ఎడమ కా ల్వ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, ఇందు కోసం అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకుంటామని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఇన్‌లెట్‌ను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

అనంతరం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, జేపీ కార్యాలయంలో రెండుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సహా ఆయా శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, సహాయ చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. 

బురదను తొలగించడమే సమస్య
‘ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఊటతో 40 నుంచి 50 మీటర్ల మేర బురద పేరుకుంది. టన్నెల్‌లో 11 కి.మీ తర్వాత ప్రాంతం నీటితో నిండి ఉంది. 13.50 కి.మీ వద్ద టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) ఉంది. ఎయిర్‌ సప్లయ్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం టన్నెల్‌లో 10 వేల క్యూబిక్‌ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశాం. 

దీనిని తొలగించడమే ప్రధాన సమస్య’  అని మంత్రి ఉత్తమ్‌ చెప్పా రు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ, స్పెషల్‌ ఆఫీసర్‌ ఇ.శ్రీధర్, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.

గ్రౌటింగ్‌ విఫలం కావడంతోనేనా..? 
సొరంగం కూలిన ప్రాంతంలో కొన్నిరోజుల కింద నిర్మాణ సంస్థ పీయూ గ్రౌటింగ్‌ చేసింది. జీఎస్‌ఐ నుంచి జియాలజిస్టు వచ్చి పరిశీలించి, పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్‌ పనులు పునః ప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పీయూ గ్రౌటింగ్‌ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌటింగ్‌ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి.  

ఫాల్ట్‌ లైన్‌ గుర్తించేందుకు జీఎస్‌ఐ అధ్యయనం 
సొరంగం కూలడానికి కారణమైన ఫాల్ట్‌ లైన్‌ను గుర్తించడానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సొరంగం ఉపరితలం నుంచి వారు సర్వే చేసి ఏ ప్రాంతంలో మట్టి వదులుగా, బలహీనంగా ఉందో గుర్తించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది.  బుధవారం మరో జీఎస్‌ఐ బృందం రాబోతోంది. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) నిపుణుల బృందం సైతం బుధవారం సొరంగం వద్దకు రానున్నారని అధికారవర్గాలు తెలిపాయి.  

తక్షణమే నివేదిక ఇవ్వండి : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తక్షణమే నివేదిక సమరి్పంచాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) దక్షిణాది విభాగం.. రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. శ్రీశైలం జలాశయంతో సొరంగం అనుసంధానం కానుండడంతో ఈ ప్రమాదంతో జలాశయంపై ఉండనున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ నివేదిక కోరినట్టు తెలుస్తోంది.  

మా వాళ్లను క్షేమంగా అప్పగించండి
జార్ఖండ్‌ కార్మికుల కుటుంబ సభ్యుల ఆవేదన
అచ్చంపేట:     బతుకుదెరువు కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చారు.. వారు క్షేమంగా బయటికి తిరిగి వస్తారు కదా.. అంటూ దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమా దంలో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొరంగంలో వాళ్లు ఎలా ఉన్నారో తలుచుకుంటేనే భయమేస్తోంది. మా పిల్లలను మాకు క్షేమంగా అప్పగిస్తే చాలు..’ అని వేడుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులు మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వచ్చారు. 

స్థానిక అధికారులు వారితో మాట్లాడి భరోసా కల్పించారు. తమవారు క్షేమంగా బయటికి రావాలని సొరంగంలో చిక్కుకున్న జగ్దాక్షేస్‌ అన్న జల్లామ్‌క్షేస్‌ చెప్పాడు. ‘నా పెద్ద కొడుకైన సందీప్‌ సాహు ఆరేళ్ల క్రితం కంపెనీలో పనిచేసేందుకు వచ్చి ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. నా కొడుకు క్షేమంగా వస్తే మా ఊరికి తీసుకెళ్లిపోతా..’ అని సందీప్‌ తండ్రి జీత్‌రామ్‌ సాహు అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement