SLBC
-
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
రుణ లక్ష్యం రూ.4.43 లక్షల కోట్లు
సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ 2023–24 వార్షిక రుణ లక్ష్యాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ఖరారు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 లక్షల కోట్ల రుణ ప్రణాళికను నిర్దేశించుకోగా వ్యవసాయ రంగానికి అత్యధికంగా రూ.2.31 లక్షల కోట్లను కేటాయించింది. మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. గత ఏడాది వార్షిక రుణ లక్ష్యం రూ.3,19,481 కోట్లు కాగా ఈ ఏడాది 39 శాతం అధికంగా కేటాయించారు. గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి రూ.3,99,289 కోట్ల రుణాలను (125 శాతం) మంజూరు చేయడం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లాకు అత్యధికం.. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.2.31 లక్షల కోట్లలో స్వల్పకాలిక రుణాలకు రూ.1.48 లక్షల కోట్లు, టర్మ్ లోన్లు, వ్యవసాయ అనుబంధ రుణాలకు రూ.83 వేల కోట్లు (పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.9 వేల కోట్లు) నిర్దేశించారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.69 వేల కోట్లు (సూక్ష్మ పరిశ్రమలకు రూ.36 వేల కోట్లు), ఇతర ప్రాధాన్యత రంగానికి రూ.23 వేల కోట్లు కేటాయించారు. ప్రాధాన్యేతర రంగానికి మరో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్సీబీ నిర్దేశించుకుంది. రంగాల వారీగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ స్వల్పకాలిక రుణాల్లో 22 శాతం, టర్మ్ లోన్లు, వ్యవసాయ అనుబంధ రుణాల్లో 92 శాతం (వెరసి వ్యవసాయ రంగానికి 40 శాతం), ఎంఎస్ఎంఈలకు 38 శాతం, ఇతర దిగువ ప్రాధాన్యత రంగానికి 37 శాతం, ప్రాధాన్యేతర రంగానికి 43 శాతం చొప్పున రుణ కేటాయింపులు పెరిగాయి. జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాకు 12.93 శాతం రుణాలను కేటాయించారు. బ్యాంకుల వారీగా కేటాయింపులు.. వార్షిక రుణ ప్రణాళికలో బ్యాంకుల వారీగా పరిశీలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు 65 శాతం (రూ.2,88,000 కోట్లు), ప్రైవేట్ రంగ బ్యాంకులు 18 శాతం (రూ.78,250 కోట్లు), ఆర్ఆర్బీలు 10 శాతం (రూ.45,000 కోట్లు), సహకార రంగ బ్యాంకులకు 7 శాతం (రూ,31,750 కోట్లు) చొప్పున నిర్దేశించారు. -
రైతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, డీబీటీ పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కారద్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని, డీబీటీతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంగళవారం విశాఖలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుకు బ్యాంకర్లు విధిగా సహకరించాలని సూచించారు. ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బ్యాంకర్ల సేవలు మెరుగ్గా ఉన్నాయని, ఎస్ఎల్బీసీ లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవలను విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించాలని సూచించారు. ప్రైవేట్ బ్యాంకులు తీరు మార్చుకుని సేవలను మెరుగు పరచుకోవాలన్నారు. ‘ముద్ర’ రుణాల మంజూరులో కరూర్ వైశ్యా బ్యాంకు బాగా వెనకబడిందని, మూడు నెలల్లో తీరు మార్చుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మహిళలకు రుణాలివ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆరా తీశారు. కౌలు రైతులకు బ్యాంకులు సహకారం అందించాలి.. ప్రైవేట్ బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలివ్వడం లేదని, కౌలు రైతులకు కొన్ని బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకిస్తున్న రుణాలు, టిడ్కో ఇళ్ల రుణ పరిమితిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయం, అనుబంధ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు మరింత సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రం లో సక్రమంగా అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రావత్ తెలిపారు. సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ (ఏపీ) ఓఏ బషీర్, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూనియన్ బ్యాంక్ సీజీఎం మహాపాత్ర, ఎస్ఎల్బీసీ కోఆర్డినేటర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాసెసింగ్ చార్జీలొద్దు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మహ్మద్ ఇంతియాజ్ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని ఛీప్ జనరల్ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు. రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి. పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు, ఇతర అడహాక్ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి. మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది. ► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. ► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ యూనియన్ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. ► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు (అప్కాబ్) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలతో చేయూత వైఎస్సార్ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. -
AP: జగనన్న కాలనీ ఇళ్లకు.. ఉదారంగా రుణాలు
సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ (రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది) నుంచి కూడా మినహాయిస్తూ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, దీనికి గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారింది. ఇదే విషయాన్ని గత ఎస్ఎల్బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రైవేటు బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు జగనన్న కాలనీలకిచ్చే ఇంటి రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్ఎల్బీసీ.. ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదు. 1.20 లక్షల మందికి లబ్ధి పేద ప్రజల ఇంటి రుణాలకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 1,19,968 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏపీ టిడ్కో పథకం కింద 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా అందులో 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ప్రభుత్వం ఒక రూపాయికే అందిస్తోంది. 365, 435 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం 1,19,968 ఇళ్లు బ్యాంకుల ఆర్థిక సహాకారంతో నిర్మాణంలో ఉన్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు వెల్లడించారు. ఒక్కో ఇంటికి సగటున రూ.2.65 లక్షల చొప్పున మొత్తం రూ.4,107.93 కోట్ల రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు 87,756 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 46,330 మందికి రూ.1,389.90 కోట్ల రుణాలను మంజూరయ్యాయి. ఇప్పుడు సిబిల్ స్కోర్ మినహాయింపు ఇవ్వడంతో రుణ మంజూరు వేగంగా జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.35,000 వరకు పావలా వడ్డీకే రుణం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. -
గడప గడపకీ విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ గత మూడేళ్లుగా రాష్ట్రంలో గడప వద్దకే బ్యాంకింగ్ సేవలు గణనీయంగా విస్తరించాయి. డిపాజిట్లు, రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు, బ్యాంకు శాఖల విస్తరణ, ఏటీఎంలు ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్థిక సేవల సమ్మిళిత వృద్ధి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)’ కార్యక్రమంలో భాగంగా రాష్రంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ)ల సేవలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నాటికి 6,264 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా 2022 మార్చి నాటికి 38,295 మందికి చేరింది. ఇండియన్ పోస్టల్ బ్యాంక్, ఫినోపేమెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల నగదు బదిలీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు రాష్ట్ర ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 5,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 567 గ్రామాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను (సీబీఎస్) అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 5 కిలోమీటర్లకు బ్యాంకింగ్ సేవలు ఉండాలన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 243 గ్రామాలను గుర్తించారు. ఇందులో 229 గ్రామాలకు బీసీలు, పోస్టాఫీసుల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 334 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతు భరోసా కేంద్రం, సచివాలయాల వద్ద బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. లక్ష్యానికి మించి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గత మూడేళ్లుగా రాష్ట్రంలో మొత్తం రుణాలు లక్ష్యానికి మించి మంజూరవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక రంగం కాకుండా ఇతర రంగాలకు మొత్తం రూ.2,83,380 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఏకంగా 33 శాతం అధికంగా రూ.3,77,436 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో 64.97 శాతంగా ఉంది. 2021–22 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,26,871 కోట్లు మంజూరయ్యాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి బ్యాంకులు కనీసం 18 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 42.17% రుణాలను మంజూరు చేశాయి. వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకుంటే బ్యాంకులు ఏకంగా రూ.2,12,170 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.44,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.44,815 కోట్లు మంజూరు చేశాయి. -
వాస్తవ సాగుదారులకే పంటరుణాలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ).. ఇక ఈ–క్రాప్ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీతో అండ చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఎన్ఐసీ రూపొందించిన పోర్టల్‌లో బ్యాంకర్స్ అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్‌లో ఆధార్ నంబర్‌తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్ కమిటీ రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్సీ) పొందిన కౌలుదారులు, జేఎల్‌జీ గ్రూపులకు ఈ–క్రాప్ ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ–క్రాప్ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ–క్రాప్ ఆధారంగా రుణాలిస్తాం ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్‌చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్ పోర్టల్స్‌ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్‌ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు ఈ–క్రాప్ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్ ఆడిట్లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్చార్జ్ రిజిస్టర్కి అనుసంధానం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.86 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 2021–22 సంవత్సరానికి రాష్ట్రంలో ఇచ్చే రుణాల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంగా రూ.1,86,035.60 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని 79.37 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో జరిగిన ఎస్ఎల్బీసీ 29వ సమావేశంలో రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రుణాల్లో రూ.91,541 కోట్లు వ్యవసాయ రుణాలే కావడం గమనార్హం. మొత్తం రుణాల్లో 49.20 శాతం వ్యవసాయ రుణాలే ఇవ్వనున్నారు. అందులో రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.59,440.44 కోట్ల పంట రుణాలు ఇస్తారు. అందులో నిర్వహణ, మార్కెటింగ్‌కు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇవికాక వ్యవసాయంలో పెట్టుబడులు, అనుబంధ రంగాల్లో ఖర్చులు, మౌలిక సదుపాయాలు తదితరాల కోసం టర్మ్ లోన్లు ఇస్తారు. మొత్తంగా వ్యవసాయ రుణాలు 63.67 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో పంట రుణాలే 55.74 లక్షల మందికి ఇస్తారు. చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కోసం, విద్య, గృహ రుణాలను కూడా ఎస్ఎల్బీసీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వండి: హరీశ్ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఒక్క వారంలోనే దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని చెప్పారు. బ్యాంకర్లు పంట రుణాలను జాప్యం లేకుండా రైతులకు అందేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారులకు మరిన్ని ముద్రా రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వై.కృష్ణారావు పాల్గొన్నారు. -
అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్, కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరిమితం చేసింది. బ్యాంకుల కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్ఎల్బీసీ ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎల్బీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆర్బీఐ, నాబార్డు ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్–19 కట్టడిలో భాగంగా ఖాతాదారులు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని ఎస్ఎల్బీసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, యూపీఐ, బ్యాంక్ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవడం ద్వారా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరింది. బ్యాంకులు కూడా ఈ దిశగా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, వ్యాక్సినేషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను పంపించాలని ఎస్ఎల్బీసీని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కోరారు. -
సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న నగదు మొత్తాన్ని వారి పాత బకాయిల చెల్లింపులకు బ్యాంకులు సర్దుబాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గురువారం ఓ లేఖలో తెలిపారు. ఈ మేరకు గతంలోనే ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులో 74 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని కెనరా బ్యాంకు శాఖ పాత బకాయిల కింద సర్దుబాటు చేసిన విషయాన్ని ‘సాక్షి’ గురువారం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన కింద జమ చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇలాంటి చర్యలు ఎక్కడా పునరావృతం కాకుండా బ్యాంకులకు తగిన మార్గదర్శకాలను మరోసారి జారీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1920కి వచ్చే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల నిధులు దారిమళ్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు ఘటనపై కూలంకషంగా విచారణ జరిపించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే నెల్లూరు జిల్లాలోని సంబంధిత బ్యాంకు శాఖ అధికారులతో మాట్లాడి ఆ 74 మంది లబ్ధిదారులకు పూర్తి మొత్తాన్ని విడుదల చేయించారు. సాక్షికి ధన్యవాదాలు మా కుమారుడు కావలిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన కింద నగదు నా ఖాతాలో జమ అయ్యింది. కానీ మాకు బ్యాంకులో మరో అప్పు ఉండడంతో.. మా అకౌంట్ హోల్డ్‌లో ఉందని నగదు డ్రా చేసుకునేందుకు వీలు లేదని మేనేజర్ చెప్పారు. ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం స్పందించి అధికారులను ఆదేశించడంతో విద్యాదీవెన నగదును గురువారం డ్రా చేసుకోమని చెప్పారు. సాక్షికి మా ధన్యవాదాలు. – సన్నారెడ్డి భారతి, తంబుగారిపాళెం, ఆరూరు పంచాయతీ చదవండి: అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు -
రైతుల ఆదాయం రెట్టింపు
కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మరింత ముందుకు రావాలి. వారికి క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డ్స్ (సీసీఆర్సీ) కూడా ఇచ్చాం కాబట్టి రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు తోడ్పాటు అందించాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రతి ఎంఎస్ఎంఈలో కనీసం 10 మంది జీవనోపాధి పొందుతున్నారు. రుణాల రీస్ట్రక్చర్లో బ్యాంకులు సహాయం చేయాలి. 2014 నుంచి ఆ పరిశ్రమలకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీలు సుమారు రూ.1,100 కోట్లు చెల్లించాం. కోవిడ్ సమయంలో కరెంట్ ఫిక్స్డ్ చార్జీలు కూడా రద్దు చేశాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై బ్యాంకులు ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పెట్టుబడి వ్యయం తగ్గడం, పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, విపత్తుల సమయంలో ఆదుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత త్రైమాసికంలో రుణాల మంజూరులో 7.5 శాతం వృద్ధి నమోదు కావడం సంతోషకరమని, పంట రుణాలు 99 శాతం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శుక్రవారం క్యాంపు కార్యాలయంలో 213వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూబీఐ జీఎం లాల్‌సింగ్, యూబీఐ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌రాయ్ (ఎస్ఎల్బీసీ చైర్మన్) వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ... ఎస్ఎల్బీసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు రైతు భరోసాతో 80 శాతం పెట్టుబడి వ్యయాన్ని అందచేస్తున్నాం.. రైతులకు పెట్టుబడి వ్యయ్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున సహాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంది. 80 శాతం పెట్టుబడి వ్యయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందు మే నెలలో రూ.7,500, పంట కోత సమయంలో రూ.4 వేలు, సంక్రాంతి సమయంలో మిగిలిన రూ.2 వేలు ఇస్తున్నాం. సున్నా వడ్డీ రుణాలతో భారీ మార్పులు... వడ్డీ లేని రుణాల ప్రయోజనాన్ని పొందేలా రైతులను చైతన్యం చేస్తున్నాం. వడ్డీ లేని రుణాల కింద గత సర్కారు హయాంలో ఎగ్గొట్టిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాం. పంటల బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా చేశాం. వ్యవసాయ రంగంలో మేం తీసుకున్న అతి పెద్ద చర్యల్లో ఇది ఒకటి. రైతులు కట్టాల్సిన ప్రీమియంను మేమే చెల్లిస్తున్నాం. దీనివల్ల వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. అండగా రైతు భరోసా కేంద్రాలు.. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతులు పండించే పంటలకు భద్రత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలను చేయి పట్టి నడిపిస్తాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలు అమ్మే వరకూ ఆర్బీకేలు రైతులకు అండగా ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చి రైతులకు మేలు చేస్తున్నాయి. జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు భరోసా.. జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం.అసంఘటిత రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితిని తొలగించాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వారు ఏ పని చేస్తున్నారో కూడా గుర్తిస్తున్నాం. వారికి బ్యాంకులు రుణాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలి. మహిళా సాధికారత.. ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారితకు అడుగులు వేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కుటుంబంలో అత్యంత ప్రభావశీలురైన 45 – 60 ఏళ్ల లోపు మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే ఒక ఏడాది ఇచ్చాం, తర్వాత మూడు సంవత్సరాలు కూడా ఏటా రూ.18,750 చొప్పున ఇస్తాం. ఆ మహిళలకు అండగా నిలిచేలా అమూల్, అల్లానా, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గాంబల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళలకు నష్టం రాకుండా, వారి కాళ్లమీద వారు నిలబడేలా కార్యక్రమాలు రూపొందించాం. వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకర్లు తోడుగా నిలవాలి. రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలి. చేయూత, ఆసరా మహిళలకు అండగా నిలబడేందుకు గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేశాం. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి షెడ్యూల్ రూపొందించి ఇప్పటికే పంపిణీ ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం మహిళలకు సహాయం అందించేలా బ్యాంకర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. అధికారులు కూడా ఆ ప్రకారం వ్యవహరించాలి. స్వయం సహాయక బృందాలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 2020–21లో తమ ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశాయి. వాటికి బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం 3 శాతం మాత్రమే. కానీ అవే బ్యాంకులు రుణాలపై 11 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. సకాలంలో రుణాలు చెల్లిస్తున్న వారికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తున్న విషయాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలి. మహిళలను మరింత చైతన్య పరిచేలా ముందుకు వెళ్లాలని బ్యాంకర్లను కోరుతున్నా. కుటుంబంలో ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే ఆ కుటుంబం వృద్ధి లోకి వస్తున్నట్లే. టిడ్కో ఇళ్లు.. టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2.69 లక్షల యూనిట్లను 2021 డిసెంబర్, 2022 డిసెంబర్లో విడతలుగా పూర్తి చేస్తుంది. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలి. రాష్ట్రంలో పథకాలు భేష్ – రాజ్‌కిరణ్‌రాయ్, యూబీఐ ఎండీ, సీఈవో ‘కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాం. అందుకు అందరికీ అభినందనలు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకుల కార్యకలాపాలు, ఆర్థిక సహాయం కొనసాగాయి. రాష్ట్రంలో ప్రాధాన్యతా రంగంలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రూ.2,80,519 కోట్ల రుణాలిచ్చాం. ఇది మొత్తం రుణాలలో 64.60 శాతం. వాస్తవానికి మొత్తం రుణాలలో ప్రాధాన్యతా రంగానికి 40 శాతం ఇవ్వాలని నిర్దేశించినా అంతకుమించి ఇచ్చాం. అదే సమయంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణం రూ.1,85,075 కోట్లు. ఇది మొత్తం రుణాలలో 42.61 శాతం ఉంది’ -
రాష్ట్ర రుణ ప్రణాళిక 1.61లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్దేశించారు. ఇం దులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లు కాగా, పంట రుణాల లక్ష్యం రూ. 53,222 కోట్లుగా ఉంది. అందులో వానాకాలంలో 60%, యాసంగిలో 40% కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రుణ ప్రణాళిక ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.62 శాతం పెరిగాయి. ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ. 53,222 కోట్లుగా నిర్దేశించుకున్నారు. అంటే 9.20 శాతం పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ. 12,061 కోట్లు చూపారు. గతేడాది కంటే 5.38 శాతం పెంచారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ. 2,422 కోట్లు కేటాయించారు. ఇది గతం కంటే 16.02 శాతం పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 7,435 కోట్లు కేటాయించారు. రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాలు పెంచారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పడావు భూములను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేశారు. ఎంఎస్ఎంఈకి 35,196 కోట్లు సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్ఎంఈ) రూ. 35,196 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఉంది. విద్యా రుణాలు రూ. 2,165.73 కోట్లు , గృహ సంబంధిత రుణాలు రూ. 8,048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆత్మనిర్బర్ కింద రుణాలు... కరోనా నేపథ్యంలో ఆత్మనిర్బర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్ఎల్బీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్ఎంఈలకు రూ. 2,513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 1,688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చారు. అదే సమయంలో రూ. 231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్‌కు కూడా ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు, ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, నాబార్డు సీజీఎం కృష్ణారావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
పాత ప్రాజెక్టులకు.. అరకొర నిధులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో సాగునీటిశాఖకు చేసిన నిధుల కేటాయింపుల్లో నిర్మాణంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది. ప్రాజెక్టుల పూర్తికి రూ. వందల కోట్లలో కేటాయింపులు కోరితే కేవలం రూ.పదుల కోట్లలో మాత్రమే నిధులు దక్కాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రా జెక్టు, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకూ అరకొర నిధులే ఇచ్చి ంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. వీటికింద ఉన్న కొద్ది పాటి భూసేకరణ, సహాయ పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే గణనీయంగా ఆయ కట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కల్వకుర్తి పరిధిలో భూసేకరణకోసం రూ. 24.18 కోట్లు, పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండగా, నెట్టెంపాడు పరిధిలో పనులకు చెందినవి రూ.11.47 కోట్లు, భూసేకరణవి రూ.8.98 కోట్లు, పునరావాసానివి రూ.1.83 కోట్లు బకాయిలు ఉండగా, భీమా పరిధి లోనూ రూ.36 కోట్ల బకాయిలున్నాయి. వీటిని తీర్చడంతో పాటు చివరి దశ పనుల పూర్తికి కనీసం రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.అయినప్పటికీ బడ్జెట్లో మొత్తంగా రూ.50 కోట్ల నిధులే దక్కాయి. అధిక నిధుల అవసరాలున్న కల్వకుర్తి ప్రాజెక్టుకు కేవలం రూ.2.29 కోట్లతో సరిపెట్టారు.గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.3 కో ట్లు నిధుల కేటాయింపు జరగడం విశేషం.ఇక బీమాకు రూ.3.69 కోట్లు,నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.17.40 కోట్లతో నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి ఎలా సాధ్యమన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది. టన్నెల్ అక్కడే..ప్రాణహిత పడకే.. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల పూర్తికి నిధులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పనులకు గాను రూ.126 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉండగా కేటాయించింది మాత్రం రూ.3.16 కోట్లు మాత్రమే. ఈ నిధులతో 43.89 కి.మీటర్ల టన్నెల్ పనుల్లో మిగిలిన మరో 10 కి.మీ.లకు టన్నెల్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంపై ఇప్పటికీ స్పష్టత లేదు.బ్యారేజీ దిగువన పనులు జరుగుతున్న ప్యాకేజీల్లో ఇంకా భూసేకరణ అవసరాలకు రూ.269 కోట్ల నిధులు అవసరమున్నా ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించినా కేవలం రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచింది. -
రబీ పంట రుణాలు 39 శాతమే
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులు వారిని పట్టించుకోవడంలేదు. సకాలంలో ఇవ్వాల్సిన పంట రుణాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నాయి. ఈ రబీలో ఇప్పటికే 31.18 లక్షల ఎకరాల్లో (99%) పంటలు సాగు కాగా, ఇప్పటి వరకు ఇచ్చిన పంట రుణాలు 39.12 శాతమే. రబీలో రూ.19,496 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇచ్చింది రూ. 7,627 కోట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 7.60 లక్షల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ఇటీవల వ్యవసాయ శాఖకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. బ్యాంకుల్లో రుణం దొరకకపోవడంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లోనూ లక్ష్యం మేర పంట రుణాలు ఇవ్వలేదు. గడిచిన ఖరీఫ్‌లో రూ.29,244 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.18,711 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే ఖరీఫ్ లక్ష్యంలో 63.98 శాతం మాత్రమే ఇచ్చాయి. -
రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు
సాక్షి, విజయవాడ: స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్స్‌కు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎస్ఎల్బీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘ప్రభుత్వం లబ్ధిదారులకు వేసే డబ్బును బాకీ కింద బ్యాంకులు జమకట్టుకోవు. ప్రభుత్వం లబ్ధిదారులకు వేసే డబ్బును వాళ్ళకే ఇచ్చేస్తాము. రైతుల ఖాతాలో ప్రభుత్వం వేసే వైస్సార్ రైతు భరోసా మొత్తం రైతులకే అందజేస్తాము. 2019-20 సంవత్సరంకు వ్యవసాయ రుణాలను 84 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. మొదటి మూడు నెలల్లోనే 61 శాతం రుణాలు రైతులకు మంజూరు చేశాము. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు అక్టోబర్ 3 తేదీ నుంచి 7 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు నిర్వహిస్తున్నాము. బ్యాంకుల విలీనం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. విలీనాన్ని వ్యతిరేకించడం మా చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం’ అని వెల్లడించారు. -
ఎస్ఎల్బీసీ నెత్తిన మరో పిడుగు!
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో టన్నెల్ తవ్వకపు పనులకు కొత్త చిక్కొచ్చి పడింది. గడిచిన రెండు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లుల చెల్లింపు చేయకుంటే ఈ నెల 10 నుంచి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని జెన్కో అధికారులు ఏజెన్సీ సంస్థకు నోటీసులు పంపారు. ఎస్ఎల్బీసీలో ఇప్పటికే శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు కన్వేయర్ బెల్ట్ పాడవడం, టన్నెల్ బోరింగ్ యంత్రానికి మరమ్మతులు జరగని కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఈ పనులకే రూ.60 కోట్లు అడ్వాన్సులు కోరగా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీనికి తోడు మరో రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. ఈ నిధులే ఐదారు నెల లుగా రాకపోవడంతో ఏజెన్సీ సంస్థ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో మరో పిడుగు వేసింది. టన్నెల్ తవ్వకం సందర్భంగా వస్తున్న సీపేజీ నీటిని తోడేందుకు ఏజెన్సీకి ప్రతినెలా రూ.2 నుంచి రూ.3 కోట్ల మేర కరెంట్ బిల్లు వస్తోంది. గతంలో బిల్లులు లేక చెల్లింపు చేయకపోవడంతో ప్రభుత్వం విదిల్చిన అరకొర నిధులతో నెట్టుకొచ్చింది. తాజాగా మళ్లీ మూడు నెలలుగా రూ.7 నుంచి రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. వాటిని చెల్లించాలని లేదంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఇదివరకే జెన్కో హెచ్చరించింది. దీంతో ప్రాజెక్టు ఇంజనీర్లు ఆర్థిక శాఖను కలిసినా నిధుల విడుదల జరగలేదు. దీనిపై కల్పించుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కొందరు రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితో చర్చించి కొన్నాళ్లు సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని విన్నవించారు. దీంతో సరఫరా కొనసాగిస్తూ వస్తుండగా, వారు విధించిన తుది గడువు ఈ నెల 10తో ముగుస్తోంది. బిల్లు చెల్లింపు చేయకుంటే సరఫరా ఆగనుంది. అదే జరిగితే మొత్తం ప్రాజెక్టుకు మొదటికే మోసం రానుంది. ఇప్పటికే ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం భారీగా సీపేజీ ఉండటంతో నిమిషానికి 9,600 లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీ వద్ద 6 వేల లీటర్ల మేర మాత్రమే నీటిని తోడే సామర్ధ్యం ఉండటంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతే డీ వాటరింగ్ చేయడం కష్టం. అదే జరిగితే టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా మునిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
వచ్చే ఖరీఫ్ నాటికి రుణమాఫీ...
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి పంటల రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసాగుతుండటం, ఆ తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రుణమాఫీని ఖరీఫ్ ప్రారంభం నాటికి చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రుణమాఫీ కోసం ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనే దానిపై ఇటీవలే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల హామీగా.. కేసీఆర్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అంటే రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు మాఫీ కానున్నాయి. రుణాల మాఫీకి కటాఫ్ తేదీగా గతేడాది డిసెంబర్ 11ని ప్రకటించింది. ఆ తేదీని గడువుగా లెక్కించి అప్పటివరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది. బ్యాంకర్ల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 48 లక్షల మందికి రూ. 30 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు ఒక విడతగా కేటాయించిందంటే, మొత్తంగా ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ రుణమాఫీ అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. -
48 లక్షల మంది రైతులకు రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు బ్యాంకర్లు ప్రభుత్వానికి లెక్కలు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 48 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించినట్లు తెలిసింది. వారందరికీ కలిపి రూ.30 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని ఎస్ఎల్బీసీ అధికారులు వెల్లడించారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేశాక మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11లోపు రుణాలు తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించిందంటే, ఐదు విడతల్లో రుణాలను బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ఏ సంవత్సరం నుంచి లెక్కలోకి తీసుకుంటుందోనన్న విషయంపై స్పష్టత రావడంలేదు. గతం కంటే 12.69 లక్షల మంది అదనం తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 16,138 కోట్ల రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో కేటాయించి మాఫీ చేసింది. అప్పటి కంటే ఈసారి అదనంగా మరో 12.69 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించనున్నారని బ్యాంకర్లు అంటున్నారు. సొమ్ము కూడా దాదాపు రూ.14 వేల కోట్లు అధికంగా కేటాయించాల్సి వస్తోంది. రెండేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు గత రెండు సీజన్లలో తీసుకున్న పంటరుణాలను పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఒక్కో రైతు సరాసరి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. రెండు సీజన్ల లెక్క ప్రకారం 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ. 31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ. 23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ. 19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 6 లక్షల మంది రైతులు రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. కొందరు రెండుసార్లు తీసుకొని ఉండొచ్చు. అలా మొత్తం రుణమాఫీకి అర్హులయ్యే వారు 48 లక్షలు ఉన్నారని అంచనా వేశారు. ఎన్నికల్లో ప్రచారాస్త్రం... రుణమాఫీని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ జరుగుతుందని చెబుతున్నారు. దాంతోపాటు వచ్చే మే, జూన్ నెలల్లో రైతుబంధు సొమ్ము కూడా రైతుల ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. పైగా గతంలో ఏడాదికి ఎకరానికి రూ. 8 వేలు రైతుబంధు సొమ్ము ఇస్తే, ఈసారి నుంచి ఏడాదికి రూ. 10 వేలు ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు. -
రుణాలు@ 5.15 లక్షల కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్ఎల్బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనరు, ఎస్బీఐ జీఎం ఉన్ మయ్యాతో పాటు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, జనరల్ మేనేజర్ ఎస్.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
నో క్యాష్ బోర్డు కనిపించొద్దు
బ్యాంకర్ల సమావేశంలో రైతు సంఘాలు సాక్షి, హైదరాబాద్: ‘డీమోనిటైజేషన్ ప్రక్రియ తర్వాత చాలా బ్యాంకు శాఖల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ఖాతాదారులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా రైతులు పంట రుణాలకోసం వస్తే వారికి ఈ పరిస్థితి గుదిబండగా మారుతోంది. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదు. ఒక్క శాఖలోనూ ‘నో క్యాష్’ బోర్డు కనిపించొద్దు’ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ), వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితులపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మూడో విడత రుణ మాఫీ చేసినప్పటికీ రైతులకు నిధులు ఇవ్వడం లేదని, ప్రస్తుతం నాల్గో విడత మాఫీ సైతం జరుగుతోందన్నారు. గ్రామీణ బ్యాంకుల్లో రోజుల తరబడి నగదు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీంతో దత్తాత్రేయ జోక్యం చేసుకుంటూ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతుకు తప్పనిసరిగా రూ.లక్ష వరకు నగదు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. బ్యాంకు శాఖల వారీగా రైతులకు ఇచ్చిన నగదు వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. వారానికోసారి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. పంటరుణాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించినట్లు దత్తాత్రేయ చెప్పారు. జూన్ నెలాఖరు నాటికి రూ.9వేల కోట్లు బ్యాంకులకు అందించామని, అదేవిధంగా జూలై మొదటివారం నాటికి రూ.2,600 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో 2వేల కోట్లు రాష్ట్రంలోని బ్యాంకులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. -
బ్యాంకులంటే వ్యాపారమేనా!
ఎస్ఎల్బీసీలో ఈటల, పోచారం ఫైర్ సాక్షి, హైదరాబాద్: ‘బ్యాంకులంటే వ్యాపార మేనా? మానవీయ కోణం ఉండదా? రుణ మాఫీ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసినా సహకరించకుంటే ఎలా? అన్నీ వ్యాపార సంబంధాలేనా? పైసా పెసా లెక్కేస్తే ఎలా? ఇది మంచి పద్ధతి కాదు’అని బ్యాంకు వర్గాలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శుక్రవారం ఎస్ఎల్బీసీ వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతర సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని పదేపదే చెప్పినా బ్యాంకులు వినకపోవడంపై మంత్రులు ఈటల, పోచారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల నిధులు రూ.271 కోట్లు విడుదల చేయలేదని రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయడం ఏమేరకు సమంజసం? చిన్న చిన్న విషయాలపై సహకరించకపోతే ఎలా’ అని ఈటల ప్రశ్నించారు. ఉదారంగా పేద లకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు డబ్బుల కొరత లేకుండా బ్యాంకులు చూడాలని, ఈ మేరకు ఆర్బీఐకి విన్నవిం చాలని ఈటల కోరారు. రైతు ఖాతాలో జమ కాని రుణ మాఫీ... ‘రుణమాఫీ సొమ్ము విడుదల చేసి నెలలు గడిచినా ఇంకా కొన్ని బ్యాంకు బ్రాంచీల్లో రైతు ఖాతాల్లో జమ చేయలేదు. డబ్బు ఇచ్చాక కూడా ఇలాగైతే ఎలా’ అని పోచారం బ్యాంకర్లను నిలదీశారు. రుణాలు తీసుకున్న ప్రతీ రైతు నుంచి బీమా ప్రీమియం మినహాయించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. రూ. 1.14 లక్షల కోట్లు రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల చేసిన ఎస్ఎల్బీసీ రాష్ట్ర రుణ ప్రణాళిక ఖరారైంది. 2017–18లో పలు రంగాలకు రూ.1,14,353 కోట్ల మేర రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. శుక్రవారం ఎస్ఎల్బీసీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. రాష్ట్ర రుణ ప్రణాళికలో సగం, అంటే రూ.54,198 కోట్లు వ్యవసాయ రుణాలే ఉండటం గమనార్హం. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.39,752 కోట్ల పంట రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా పేర్కొంది. ఇందులో ఈ ఖరీఫ్‌లో రూ.23,851 కోట్లు, రబీలో రూ.15,901 కోట్లిస్తామని పేర్కొంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.14,446 కోట్లివ్వాలని వెల్లడించింది. గతేడాది పంట రుణ లక్ష్యం రూ.29,101 కోట్లు మాత్రమే! చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16,465 కోట్లు (గతేడాది 10,807 కోట్లు), విద్యా రుణాలు రూ.1,663 కోట్లు (గతేడాది రూ.731 కోట్లు), గృహ రుణాలు రూ.3,885 కోట్లు (గతేడాది రూ. 2,189 కోట్లు) కేటాయించారు. వరికి అత్యధికంగా రూ.16,690 కోట్ల రుణాలు: ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో ఇవ్వబోయే రూ.39,752 కోట్ల పంట రుణాల్లో అత్యధికంగా వరికి రూ.16,690 కోట్లివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. 19.18 లక్షల మంది వరి రైతులకు రుణాలిస్తారు. తర్వాత పత్తికి 7.48 లక్షల మంది రైతులకు రూ.6,809 కోట్లు; మొక్కజొన్నకు రూ.2,311 కోట్లు, జొన్న, సజ్జలకు రూ. 2,052 కోట్లు, పప్పుధాన్యాల పంటలకు రూ.1,770 కోట్లు ఇస్తారు. యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు..: వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు కేటాయించనున్నారు. రైతులు తీసుకునే వ్యవసాయ యంత్రాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లకు రూ.1,694 కోట్లు, హార్వెస్టర్లకు 336 కోట్లిస్తారు. భారీ పరిశ్రమలకు రూ.7,340 కోట్లు, డెయిరీకి 2,002 కోట్లు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లకు 1,029 కోట్లు, కోళ్ల పరిశ్రమకు 729 కోట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు 308 కోట్లు, చేపల పెంపకానికి 120 కోట్లు, పాల శీతలీకరణ ప్లాంట్లకు 81 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.88.35 కోట్లు కేటాయించారు. -
బ్యాంకుల్లో పైసల్లేవు..
అదనంగా నెలకు రూ. 2 వేల కోట్లివ్వండి - రిజర్వ్ బ్యాంకును కోరిన ఎస్ఎల్బీసీ - రూ. 400 కోట్లు అడిగిన ఎస్బీఐ - ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో నగదు కొరత వేధిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) మొరపెట్టుకుంది. ఖరీఫ్‌లో పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామని, కాబట్టి తమ అవసరాలకు తగ్గట్లు డబ్బు అందజేయాలని కోరింది. ఎస్ఎల్బీసీ విన్నపానికి స్పందించిన ఆర్బీఐ ఎంత నగదు కావాలో బ్యాంకుల వారీగా ఇండెంట్ ఇవ్వాలని కోరింది. దీంతో వెంటనే ఎస్ఎల్బీసీ పంట రుణాలు అందజేసేందుకు ఇప్పుడున్న నగదుకు అదనంగా నెలకు రూ.2 వేల కోట్లు కావాలని ఆర్బీఐని కోరినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకే నెలకు రూ.400 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో నగదు పంపిస్తామని చెప్పింది. అయితే ఎప్పటిలోగా అందజేయనుందో మాత్రం ప్రకటించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగదు కొరత ఎప్పుడు తీరుతుందో రైతు చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియకుండా ఉంది. బ్యాంకుల్లోనే వేల కోట్ల రైతు డబ్బు.. వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం రైతులు పంట రుణాలకు వెళ్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకుందామనుకున్నా అక్కడ డబ్బు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. విక్రయించిన ఆ ధాన్యానికి ప్రభుత్వం రూ.5,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. మొత్తం 7 లక్షల మంది రైతుల డబ్బు బ్యాంకుల్లోనే ఉంది. ఈ డబ్బులో దాదాపు రూ.1,500 కోట్లు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.4 వేల కోట్ల రైతు సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. అవసరాల కోసం రైతులు తమ సొమ్మును తామే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో పలు చోట్ల రైతులు బ్యాంకుల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వరి అమ్మగా వచ్చిన రూ.75 వేలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసిందని, దాన్ని తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే నగదు లేదంటూ చెబుతున్నారని బోధన్‌కు చెందిన రైతు లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇచ్చిన పంట రుణాలు 2,573 కోట్లు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఏటా దాదాపు 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా. అందులో బుధ వారం నాటికి 3.91 లక్షల మంది రైతులకు రూ. 2,573 కోట్ల పంట రుణాలు రైతులకు అందినట్లు అధికారులు తెలిపారు. రేపు పంట రుణాల ప్రణాళిక.. ఈ ఏడాది పంట రుణాల ప్రణాళికను ఎస్ఎల్బీసీ తయారుచేసింది. ఆ ప్రణాళికను శుక్రవారం విడుదల చేయనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వర్షాకాలం, యాసంగి పంటలకు రూ.39,752 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిసింది. అందులో ఖరీఫ్‌కు రూ.23,852 కోట్లు, రబీకి రూ.15,900 కోట్లు నిర్ధారించినట్లు సమాచారం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల ప్రణాళిక రూ.30,140 కోట్లు. -
ఖరీఫ్ కదిలేదెలా?
► వానాకాలం సీజన్ వచ్చినా రైతులకు రుణాలివ్వని బ్యాంకులు ► ఏప్రిల్ ఒకటి నుంచే రుణాలివ్వాలన్న నిబంధనకు తూట్లు ► ఇప్పటికీ రుణ ప్రణాళిక ప్రకటించని ఎస్ఎల్బీసీ ► రైతు ఖాతాల్లోకి చేరని నాలుగో విడత రుణమాఫీ సొమ్ము ► పంటల బీమా సంస్థలను ఖరారు చేయని వ్యవసాయశాఖ ► ఎప్పట్లాగే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్న రైతులు సాక్షి, హైదరాబాద్: చినుకు సవ్వడి మొదలైంది.. రైతన్న సాగు పనులకు సిద్ధమవుతున్నాడు.. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు చేతిలో పైసలుంటేనే నాగలి ముందుకు సాగేది! కానీ పెట్టుబడులే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. వారిని ఆదుకోవడంలో అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలేదు. బ్యాంకులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్‌కు అవసరమైన పంట రుణాలు ఇవ్వాల్సిన ఉన్నా ఇప్పటిదాకా దిక్కులేదు. అసలు రాష్ట్ర పంటల రుణ ప్రణాళికే ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే బ్యాంకుల వారీగా లక్ష్యాలు ప్రకటించాలి. కానీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు మళ్లీ ప్రైవేటు అప్పుల వైపే చూస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఇక్కట్లు గతేడాది కంటే ఈసారి ఖరీఫ్ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 2016–17లో ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18లో 1.08 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటారని అంచనా. వీరిలో సన్న, చిన్నకారు రైతులే 50 లక్షల మంది. మధ్య తరహా రైతులు 8 లక్షల మంది ఉంటారు. వీరే అధికంగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. గత లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఈసారి ఈ సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమంది రైతులు సాగు చేస్తుంటే వారికి సకాలంలో రుణ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.3 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేసినట్లు సమాచారం. రైతు ఖాతాలకు చేరని రుణమాఫీ ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినా రైతు ఖాతాల్లోకి చేర్చడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. చివరి విడత రూ.4 వేల కోట్లు విడుదల చేయగా.. ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లోకి చేరాయి. మిగిలిన సొమ్ము రైతు ఖాతాలకు చేరలేదని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అంటూ విభజన లేకుండా లబ్ధిదారులైన రైతులందరి బ్యాంకు ఖాతాలకు సొమ్ము విడుదల చేశారు. ఈసారి అలాకాకుండా ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చాకే సొమ్ము విడుదల చేస్తామని మెలికపెట్టారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతుల సంఖ్య తేలని బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది కేంద్రం నుంచి వచ్చిన ఇన్‌ఫుట్ సబ్సిడీ సొమ్ములో మిగిలిన రూ. 350 కోట్లు కూడా రైతు ఖాతాల్లో జమచేయలేదు. ఖరారు కాని పంటల బీమా వచ్చే ఖరీఫ్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయశాఖ టెండర్లు పిలిచింది. మూడు క్లస్టర్లను చోల ఎంఎస్ కంపెనీ దక్కించుకోగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు ఒక్కో క్లస్టర్ చొప్పున దక్కించుకున్నాయి. కానీ వ్యవసాయ శాఖ ఈ టెండర్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు ప్రీమియం చెల్లించడానికి వీలుపడదు. మరోవైపు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని చెప్పే సర్కారు ఇప్పటివరకు యంత్రాల ధరలు ఖరారు చేయలేదు. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ధరలను ఖరారు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతీ లేదు. రుణమాఫీ పైసలు అందలేదు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకు నుంచి ఇంకా నాలుగో విడత రుణమాఫీ అందలేదు. బ్యాంకులకు వెళ్తే నిబంధనలు చెబుతున్నరు. నాలుగో విడత రుణమాఫీ పైసలు ఇవ్వాలని అడిగితే.. రుణమాఫీ మొత్తం చెల్లించి రెన్యూవల్ చేసుకుంటేనే ఇస్తమని అంటున్నరు. పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. – చిద్రాపు రమేశ్, ఖాజాపూర్ రైతు ఇబ్బందులు పడుతున్నం విత్తనాలు వేసుకునే సీజన్ వచ్చింది. ఇప్పటి వరకు బ్యాంకు రుణం అందలేదు. రుణం కోసం బ్యాంకుకు వెళితే అప్పుడూ ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలి. – రాములు, ఉదండాపూర్, జడ్చర్ల మండలం -
14 లక్షల మందికి అందని పంట రుణం
ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకుగాను.. 22.50 లక్షల మందికే రుణాలు ఎస్ఎల్బీసీ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట రుణాలు అందడం లేదు.ఎన్నడూ లేనివిధంగా బ్యాంకుల నుంచి రైతులకు సహకారం తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ 22.50 లక్ష ల మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. అంటే ఏకంగా 14.02 లక్షల మంది రైతులకు ఖరీఫ్ పంట రుణాలు అందలేదు. రాష్ట్ర స్థాయి బ్యాం కర్ల సమితి (ఎస్ఎల్బీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రబీ సీజన్లోనూ అదే పరిస్థితి.. ఎస్ఎల్బీసీ నివేదిక ప్రకారం ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.17,460 కోట్లుకాగా... బ్యాంకులు రూ.15,205 కోట్ల (87.08%) మేర పంట రుణాలు ఇచ్చాయి. శాతంలో ఇది ఎక్కువగా కనిపించినా తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులకు రుణాలు అందలేదు. రబీ సీజన్లోనూ రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రబీలో పంట రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు రూ.4 వేల కోట్ల మేర రుణాలు మాత్రమే ఇచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.9,202 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇచ్చింది రూ.3,690 కోట్లే. రైతుల పట్ల బ్యాంకర్లు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నారంటూ వ్యవసాయ అధికారులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వెనుకబడిన ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులే మొండి చెరుు్య చూపిస్తుండడం గమనార్హం. ఖరీఫ్‌లో ప్రభుత్వ బ్యాంకుల పంట రుణ లక్ష్యం రూ.10,348.56 కోట్లు కాగా.. ఇచ్చింది రూ.7,786.42 కోట్లు (75.24 శాతం) మాత్రమే. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.812.71 కోట్లుకాగా.. రూ. 1,192.28 కోట్లు ఇచ్చాయి. అంటే 146.70 శాతం రుణాలు ఇచ్చాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,999.95 కోట్లు కాగా.. రూ.3,372.96 కోట్లు (112.43 శాతం) అందించాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. వాటి ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.3,299.60 కోట్లు కాగా.. రూ.2,853.74 కోట్లు (86.49 శాతం) మాత్రమే ఇచ్చాయి. ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య అగాధం ప్రభుత్వం రుణమాఫీ నిధులను, పావలా వడ్డీ సొమ్మును సకాలంలో విడుదల చేయకపోవడం వల్లే రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని పెంచింది. ఇటీవలి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకుల తీరుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విరుచుకుపడడం అందుకు నిదర్శనం కూడా. అంతర్గత సమావేశాల్లో కాకుండా ప్రజల్లో ఉంటే బ్యాంకుల దుమ్ముదులిపే వారమంటూ ఆయన బ్యాంకర్లపై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ఘర్షణ వైఖరి వల్ల నష్టమేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. -
కరెన్సీ కొరత ఉంది
• అంగీకరించిన ఎస్ఎల్బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ • నోట్ల రద్దు కారణంగా ఎన్నో అవస్థలు • వినియోగదారులను సంతృప్తిపరచలేక పోతున్నాం • ఆసరా పింఛన్లు పంపిణీ చేయలేని పరిస్థితి • చిన్న నోట్లు లేక ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్య • రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నోట్లు పంపాలని ఆర్బీఐకి ఈటల విజ్ఞప్తి • రైతులను కాల్చుకు తింటున్నారంటూ బ్యాంకర్లపై పోచారం ఆగ్రహం • వాడివేడిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమావేశం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నేపథ్యంలో గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల (ఎస్ఎల్బీసీ) సమావేశం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని మంత్రులు, అధికారులు మండిపడ్డారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతులను కాల్చుకు తింటున్నాయంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో తొలుత ఎస్బీహెచ్ ఎండీ, ఎస్ఎల్బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ మాట్లాడారు. ‘‘నోట్ల రద్దుతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. కానీ నగదు అవసరమైనంత లేకపోవడంతో వినియోగదారులను సంతృప్తి పరచలేకపోతున్నాం. ఆసరా పింఛన్‌దారులకు రూ. వెరుు్య చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ చిన్న నోట్లు అందుబాటులో లేవు. పోస్టాఫీసుల్లో ఇదో సమస్యగా మారింది..’’అని ఆయన పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ వ్యవస్థలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాల నేపథ్యంలో వాటికి లీడ్ బ్యాంక్ మేనేజర్లను గుర్తించామన్నారు. రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు: మంత్రి పోచారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకులు కేవలం 22.5 లక్షల మందికే ఇచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకునే రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. చాలా బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేశాయన్నారు. ఎంతో కొంత మెరుగ్గా ఆంధ్రా బ్యాంకు రైతులకు రుణాలు ఇచ్చిందని, సిండికేట్ బ్యాంకు మాత్రం దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు. సిండికేట్ బ్యాంకువారు తెలంగాణలో ఉన్నామనుకుంటున్నారా, మరెక్కడో ఉన్నామనుకుంటున్నారా అని నిలదీశారు. బ్యాంకుల తీరుతో అనేకమంది రైతులు భయపడి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకర్లు సహకరించబోమంటే మిగతా రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామన్నారు. మూడో వారుుదాలో భాగంగా రూ.2,020 కోట్లు బ్యాంకులకు ఇచ్చినా.. కొన్ని బ్యాంకులు ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బ్యాంకులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయని, ఇది దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. 5 వేల కోట్ల చిన్న నోట్లు ఇవ్వండి: ఈటల దేశంలో 86 శాతం కరెన్సీ రూ.500, రూ.వెరుు్య నోట్లేనని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదుతోనే లావాదేవీలన్నీ జరుగుతాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కూలీలకు నగదు లేక లావాదేవీలన్నీ నిలిచిపోయాయని.. అడ్డాకూలీల బతుకు ఛిద్రమైందని చెప్పారు. నగదు లేకపోవడంతో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ. 2 వేల నోటు చలామణీ కావాలంటే కొత్త రూ.500, రూ.100 నోట్లు అవసరమని స్పష్టం చేశారు. వారుుదాల ప్రకారం అరుునా సరే రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం విడుదల చేసిన సొమ్ము టిఫిన్ ఖర్చులకు కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని... డబ్బులు విడుదల చేసినా వారి చేతికి నగదు చేరలేదన్నారు. ఇక ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసిందని, అర్హులకే అది అందేలా జాగ్రత్త పడాలని బ్యాంకర్లకు సూచించారు. నోట్ల రద్దుతో నష్టపోరుున పరిశ్రమలు, వ్యా పారులకు ప్రయోజనాలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు మూడు రోజుల్లో నగదు సరఫరా: ఆర్ఎన్ దాస్ నోట్ల రద్దు పరిణామాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నగదు అందుతుందని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ డెరైక్టర్ ఆర్ఎన్ దాస్ చెప్పారు. అరుుతే రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన ప్రాముఖ్యత ఉందని... డిజిటల్, ఎలక్ట్రానిక్ నగదు రహిత వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగదు రహిత డిజిటల్ ఎకానమీ వైపు ప్రజలు మరలేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సూచించారు. -
రుణమాఫీ వడ్డీకే సరి!
♦ నాలుగు విడతలుగా రుణమాఫీ వల్లే గందరగోళం ♦ రెండు విడతల సొమ్మును వడ్డీ కిందే జమచేసుకున్న బ్యాంకులు ♦ గడువులోగా చెల్లించలేదంటూ అధిక వడ్డీ ♦ ఆ వడ్డీని అసలు రుణంలో కలిపేస్తున్న వైనం ♦ మాఫీ సొమ్ము వడ్డీ కింద జమ.. రుణమంతా అలాగే ఉన్నట్లు లెక్కలు ♦ సర్కారుకు నివేదించిన ఇంటెలిజెన్స్ విభాగం ♦ వడ్డీ సహా అప్పు చెల్లిస్తున్నామన్న సర్కారు ♦ అడకత్తెరలో పోకచెక్కలా అన్నదాత ♦ అప్రమత్తమైన ఆర్థిక శాఖ.. నేడు ఎస్ఎల్బీసీ సమావేశం ♦ లబ్ధిదారుల రుణాల సమగ్ర వివరాల ప్రకటనకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసిన తొలి రెండు విడతల సొమ్మును బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకున్నాయని... రైతుల ఖాతాల్లో ఇంకా ఎక్కువ బాకీ ఉన్నట్లుగా చూపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నాలుగు విడతలుగా రుణమాఫీయే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లింపుల విషయంలో కొన్ని బ్యాంకులకు ఇప్పటికీ అవగాహన లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని తేల్చి చెప్పింది. అందువల్లే రైతులకు కొత్త రుణాలు అందడం లేదని, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ‘‘మీరు తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించలేదు. అందుకే నిబంధనల ప్రకారం గడువు మీరిన పంట రుణాలకు వర్తించే 11 శాతం వడ్డీ చెల్లించాలి.’’ అంటూ కొన్ని బ్యాంకులు 11 శాతం వడ్డీని రైతుల ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకుంటూ పోతున్నాయని తెలిపింది. కొన్నిచోట్ల పంట రుణాలకు సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఖాతాల్లో అప్పు రికవరీ, జమ అవుతుందని.. బ్రాంచి మేనేజర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. ఈ నివేదికలతో అప్రమత్తమైన ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని గుర్తించింది. వెంటనే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కావాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మరోవైపు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది, ఇంకా ఎంత ఉందనే వివరాలతో జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల తిరకాసు వల్లే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకు పంట రుణాలను వడ్డీతో సహా మాఫీ చేసింది. దీంతో 36.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. గత ఏడాది మార్చి 31 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఆగస్టు వరకు అయ్యే వడ్డీని సైతం లెక్కగట్టి ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. మొత్తం రూ.17 వేల కోట్లు అవసరంకాగా.. నాలుగు విడతలుగా చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.8,450 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసుకుని, కొత్త రుణాలు ఇవ్వాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. కానీ కొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీ చెల్లింపులకు సంబంధించి తిరకాసు పెట్టడంతో రుణమాఫీ పథకం ప్రయోజనం నెరవేరకుండా పోయిందని సర్కారు భావిస్తోంది. దీంతోపాటు రుణమాఫీ గందరగోళం, రైతుల ఆత్మహత్యలు ఇటీవల అసెంబ్లీ సమావేశాలను కుదిపేశాయి. వీటిపై విపక్షాల నిలదీతతో ఒక దశలో అధికార పార్టీ ఇరుకునపడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌తో సర్వే చేయించింది. ఇప్పుడేం చేద్దాం.. రుణమాఫీతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని.. అయితే ఇప్పటికీ తమ రుణం ఎంత మాఫీ అయింది, ఎంత మిగులు ఉందనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ పథకంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యను పక్కాగా తెలుసుకునేందుకు గతంలో ప్రభుత్వం బ్యాంకులు, బ్రాంచీల వారీగా జాబితాలను ప్రకటించింది. అదేతీరులో లబ్ధిదారుల రుణ వివరాలను సైతం వెల్లడిస్తే... ఈ గందరగోళానికి తెరపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. బ్రాంచీల వారీగా లబ్ధిదారులు తీసుకున్న రుణమెంత, ఎంత వడ్డీ చెల్లించాలి, అందులో ఎంత మొత్తం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది, మిగులు రుణమెంత..? అనే వివరాలన్నీ పేర్కొనాలని నిర్ణయించారు. వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని, మొండికేస్తున్న కొన్ని బ్యాంకులతో అమీతుమీ తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట రుణాలకు వర్తించే వడ్డీమాఫీ పథకం అమల్లో ఉందని... కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీని ఏటా చెల్లిస్తున్నాయని బ్యాంకులకు స్పష్టత ఇవ్వటం ద్వారా రైతులపై ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించింది. -
ఎస్కలేషన్ భారం 2,712 కోట్లు
సాగు నీటి ప్రాజెక్టులపై పడే భారాన్ని తేల్చిన నీటి పారుదల శాఖ * ఏఎంఆర్‌పీపై అధికంగా రూ.865 కోట్లు * తర్వాతి స్థానంలో దేవాదులకు రూ.543 కోట్లు * కల్వకుర్తి, రాజీవ్సాగర్లపై సైతం అదనపు భారం భారీగానే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్కలేషన్ చెల్లిస్తే భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కింద కలిపి రూ.2,712 కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అధికభారం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ)పైనే ఉండనుండగా... ప్రాజెక్టులో భాగంగానే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు సైతం ఉండటంతో ఆ భారం భారీగా ఉండనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తేల్చారు. ఇక ఎస్కలేషన్ భారం అధికంగా ఉండనున్న ప్రాజెక్టుల్లో తర్వాతి స్థానం దేవాదుల ప్రాజెక్టుది కాగా, ఆ తర్వాతి స్థానాల్లో కల్వకుర్తి, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులున్నాయి. భారం భారీగానే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులు చేర్పులతో అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎస్కలేషన్‌ను మొత్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వర్తింపజేస్తే ఆ భారం రూ.2,712 కోట్లని తేల్చగా, అందులో 13 భారీ ప్రాజెక్టులకు రూ.2,479 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.233 కోట్ల భారం ఉండనుంది. మొత్తం ప్రాజెక్టుల్లో ఎస్కలేషన్ భారం ఏఎంఆర్‌పీపై అధికంగా రూ.865 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇక దేవాదుల ప్రాజెక్టులో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నందున దీనికి రూ.543 కోట్లు, కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.347 కోట్ల మేర ఎస్కలేషన్ ఉంటుందని అధికారులు తేల్చారు. ఇక మధ్యతరహా ప్రాజెక్టుల్లో మోదికుంటవాగుకు రూ.62 కోట్లు, కొమురంభీమ్‌కు రూ.37 కోట్లు, పెద్దవాగుకు రూ.29 కోట్ల మేర ఎస్కలేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. -
సాగు రుణ లక్ష్యం 31,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2015-16 సంవత్సరానికి రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదలైంది. రూ.72,119 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. ఇందులో రూ. 30,995 కోట్లను వ్యవసాయ రంగానికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు శంతను ముఖర్జీ, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కేంద్ర ఆర్థిక సంయుక్త కార్యదర్శి సుబ్బారావు, నాబార్డు సీజీఎం వీవీవీ సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూ.23,209 కోట్లు పంట రుణాలు, రూ.5,398 కోట్లు టర్మ్ రుణాలు, రూ.2,386 కోట్లు వ్యవసాయ అనుబంధ రుణాలు ఇవ్వాలని సమావేశంలోనిర్ణయించారు. విద్యారంగానికి రూ.864 కోట్లు, చిన్న పరిశ్రమల ఔత్సాహికులకు రూ.7,716కోట్లు, ఇళ్ల రుణాలు రూ.2,306కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తమ్మీద ప్రాధాన్య రంగాలకు రూ.47,359 కోట్లు, అప్రాధ్యాన్య రంగాలకు రూ.24,759 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు రుణ ప్రణాళికలో వెల్లడించారు. గత ఏడాది ఖరీఫ్, రబీల్లో రూ.18,420 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చామని, 98 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీ 15 రోజుల్లో.. రెండో విడత రుణమాఫీ సొమ్మును 15 రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రుణమాఫీ తొలివిడతగా గత ఏడాది రూ.4,230 కోట్లు విడుదల చేశామని, ఈసారి రూ.2,043 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఇప్పటికే 40 శాతం సాగు ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో బ్యాంకులు రైతులకు పంట రుణాలు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచి 34 లక్షల మంది రైతులకు ‘ఎఫ్’ ఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. 24 లక్షల మందికే ఇచ్చాయని పేర్కొన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు రుణం సరిపోక ఇతర బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. గత ఏడాది రెన్యువల్స్ విషయంలో జిల్లాల్లోని కొన్ని బ్యాంకులు రైతులను ఇబ్బందిపెట్టాయని.. రైతుల రుణాల్లో 25 శాతాన్ని ప్రభుత్వం రుణమాఫీ కింద ఇవ్వగా, మిగతా 75 శాతం చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని కొర్రీలు పెట్టాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా 75శాతం సొమ్ముకు ప్రభుత్వమే హామీ ఇచ్చినా.. రైతులను వేధించాయని మండిపడ్డారు. అలా వ్యవహరించవద్దని బ్యాంకులకు సూచించారు. ఇక గ్రీన్హౌస్ (పాలీహౌస్)కు రుణాలు అందజేయాలని కోరారు. కాగా రైతులకు తక్షణమే పంట రుణాలు అందజేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి కోరారు. రుణ ప్రణాళికలోని ప్రధాన అంశాలు.. 2014-15లో రూ.63,047 కోట్లతో రుణ ప్రణాళిక ఉండగా.. ఈసారి రూ.72,119 కోట్లకు పెంచారు. వ్యవసాయరంగానికి గత ఏడాది కంటే రూ.3,771 కోట్లు అధికంగా రూ.30,995 కోట్లు కేటాయించారు. పంట రుణాలను రూ.18,717 కోట్ల నుంచి రూ.23,209 కోట్లకు పెంచారు. ఈ సారి వరి పంట కోసం రైతులకు రూ.9,157 కోట్ల రుణాలు ఇస్తారు. పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు రూ.1,214 కోట్లు, పత్తి రైతులకు రూ.4,614 కోట్లు రుణాలు ఇస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.1,271 కోట్లు కేటాయించారు. పాలీహౌస్ కింద రూ.1,012 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమకు రూ.437 కోట్లు ఇస్తారు. మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి రూ.350 కోట్లు ఇస్తారు. -
వ్యవసాయ రుణాలు 30 వేల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రుణాలు రూ.30 వేల కోట్లకు పైగా నిర్ధారిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించినట్లు తెలిసింది. అందులో పంటరుణాలు రూ. 23 వేల కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ, అనుబంధ రుణాలు రూ.7 వేల కోట్లు ఉండొచ్చని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఎస్ఎల్బీసీ ప్రత్యేక సమావేశం మంగళవారం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర రుణ పరపతి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా ఆయన పాల్గొనడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తదితరులు హాజరుకానున్నారు. 2015-16 సంవత్సరానికి వ్యవసాయ రుణాలు రూ.35,179 కోట్లు అంచనా వేస్తూ నాబార్డు ప్రతిపాదనలు తయారుచేసింది. అందులో పంట రుణాలు రూ.25,779 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.9,400 కోట్లు ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకొని బ్యాంకర్లకు అందజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు సమావేశమై వ్యవసాయ రుణాలపై ప్రతిపాదనలు పంపాయి. నాబార్డు పంపిన ప్రతిపాదనల కంటే తక్కువ వ్యవసాయ రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్లు నివేదించడం విశేషం. -
ఏపీలో రైతుల రుణాల్లో భారీ కోత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనతో రైతులు బ్యాంకు రుణాల రాక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో రైతులకు రుణాల మంజూరులో భారీ కోత విధించారు. గతేడాది రుణాల లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను 22,443 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ 189వ ఎస్ఎల్బీసీ నివేదికను లీడ్ బ్యాంక్ ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. ఏపీలో 40 శాతం మాత్రమే రుణాలు ఇవ్వగలిగామని బ్యాంకులు వెల్లడించాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో 13,789 కోట్లు, రబీలో 8,684 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు ప్రకటించాయి. చంద్రబాబు రణమాఫీ చేస్తానని ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించలేదని ఎస్ఎల్బీసీ నివేదికలో పేర్కొన్నారు. దీంతో బకాయిలు గణనీయంగా పెరిగిపోయాయని, నిధులు, బ్యాంకుల లావాదేవీలను తీవ్రంగా దెబ్బతీశాయని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు రోజులు ముగుస్తోందని, రైతులు బకాయిలు చెల్లించి రుణాలకు అర్హత పొందాలని సూచిస్తున్నట్టు ఎస్ఎల్బీసీ పేర్కొంది. -
రెన్యువల్ లేదు..కొత్త రుణాలు రావు
ఎస్ఎల్బీసీ స్పష్టీకరణ పూర్తిస్థాయి రుణమాఫీ చేయని ఫలితం మిగతా రుణాలను సర్కారు లేదా రైతులు కడితేనే కొత్త రుణాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయనందున రైతుల రుణాలు రెన్యువల్‌కు నోచుకోవడం లేదని, అలాగే కొత్త రుణాలు మంజూరు కావడం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) స్పష్టం చేసింది. రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకులు ముందుండేవని, లక్ష్యాలకు మించి రుణాలును మంజూరు చేసేవని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 188వ ఎస్ఎల్బీసీ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపింది. తొలి దశ రుణ మాఫీని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 శాతానికే పరిమితం చేయడంతో ఆ సొమ్ము మెజారిటీ రైతుల వడ్డీకి కూడా సరిపోవడం లేదని, దీంతో ఆయా రైతుల రుణాలు రెన్యువల్ కావడం లేదని పేర్కొంది. తొలి దశలో మాఫీ కొద్ది మొత్తంలోనే ఉన్నందున మిగతా రుణ బకాయిలు చెల్లించే వరకు రైతులకు కొత్త రుణాలను మంజూరు చేయలేమని కూడా బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. రుణాలు రెన్యువల్ కావాలంటే మిగతా వడ్డీ మొత్తాన్ని రైతులైనా చెల్లించాలి లేదా ప్రభుత్వమైనా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలంటే తొలి దశలో ప్రభుత్వ మాఫీ చేయగా మిగిలిన రుణ బకాయిలను రైతులు లేదా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, అలా చెల్లిస్తే గానీ రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని వివరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేదంటే రైతులు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు దూరం అవుతారని, అంతే కాకుండా పంటల బీమా కూడా దొరకదని సూచించింది. మరోవైపు బకాయిలు అలాగే కొనసాగితే రైతులపై ఏటేటా వడ్డీ భారం పెరిగిపోవడమే కాకుండా కొత్త రుణం పుట్టదని స్పష్టం చేసింది. -
‘ఎస్కులేషన్’ ఎప్పటినుంచి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించే అంశంలో చిన్న మెలిక పడింది. పనుల ప్రారంభానికి గాను ఎస్కులేషన్ చార్జీలు (పెరిగిన ముడిసరుకుల ధరల మేరకు ఒప్పందంలో ఉన్న దాని కన్నా అదనంగా చెల్లించే మొత్తం) ఎప్పటి నుంచి చెల్లించాలన్న అంశంపై ఏమీ తేలకపోవడంతో మరోమారు ఇంజనీరింగ్ నిపుణులతో కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ మేరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్షం నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు కంపెనీ అడిగిన విధంగా 2012 నుంచి ఎస్కులేషన్ చార్జీలు ఇవ్వాలా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన జూన్ 2 నుంచి చార్జీలు లెక్కించాలా అన్నది ఈ సమావేశం అనంతరం తేలనుంది. రెండు గంటలపాటు చర్చ ముఖ్యమంత్రి సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల మంత్రి హరీష్‌రావు కాంట్రాక్టు కంపెనీ అయిన జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం), ప్రభాకర్ (బీజేపీ), తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ) హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా కాంట్రాక్టు కంపెనీకి ఎస్కులేషన్ చార్జీలు ఎప్పటి నుంచి చెల్లించాలన్న దానిపై రెండు గంటల పాటు చర్చ జరిగింది. కాంట్రాక్టర్ కోరిన విధంగా 2010 నుంచి చెల్లించాల్సి వస్తే రూ.723 కోట్ల అదనపు భారం పడుతుందని, అదే 2012 నుంచి అయితే రూ.600 కోట్లు, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి ఇస్తే దాదాపు రూ.500 కోట్లు ఎస్కులేషన్ చార్జీలు ఇవ్వాల్సి ఉం టుందని అధికారులు వివరించారు. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి ఎస్కులేషన్ చార్జీలు తీసుకోవాలని సూచించారు. దీనికి కంపెనీ తరఫున హాజరయిన జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ పంకజ్గౌర్, మరో ప్రతినిధి కామత్‌లు స్పందిస్తూ తాము 2010 నుంచే ఎస్కులేషన్ చార్జీలు చెల్లించాలని 2012లో దరఖాస్తు పెట్టుకున్నామని, కనీసం 2012 నుంచయినా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్ర జాప్రతినిధులు అంగీకరించకపోవడంతో నీటిపారుదల ఈఎన్సీ, ప్రాజెక్టు సీఈలతో సమావేశం అయి దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశం త్వరలోనే జరగనుంది. -
ఎస్ఎల్బీసీ ధరలపై అదే సందిగ్ధం
2010 నుంచే పెంచిన ధరలు ఇవ్వాలన్న కాంట్రాక్టు సంస్థ జూన్ 2 తర్వాత నుంచే చెల్లిస్తామన్న ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ కోరినట్టు చెల్లిస్తే సర్కారుపై రూ.250 కోట్ల భారం మంత్రి హరీశ్ సమక్షంలో పలు పార్టీలు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ధరల సర్దుబాటు అం శం ఎటూ తేలలేదు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2010 నుంచి ధరల సర్దుబాటును పరిగణనలోకి తీసుకుని రూ.750 కోట్ల మేర చెల్లించాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ కోరగా.. తాము అధికారంలోకి వచ్చినప్పట్నుంచి (జూన్ 2, 2014) అయ్యే ఖర్చులను మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాంట్రాక్టు సంస్థ కోరిన విధంగా ధరల సర్దుబాటు చేస్తే ఖజానాపై ఏకంగా రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోసారి భేటీ అయి ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. మేం వచ్చినప్పట్నుంచే ఇస్తాం.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించి అసంపూర్తిగా మిగిలిన మరో 19.8 కిలోమీటర్ల పనులపై గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ నిర్వహించారు. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎంవీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జయప్రకాశ్ అసోసియేషన్ కాంట్రా క్టు సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టరు కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.750 కోట్ల మేర ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు మరో రూ.150 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. 2010 నుంచి స్టీలు, సిమెంట్, ఇంధనల ధరలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇందుకు ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2010 ధరలను పరిగణనలోకి తీసుకొని చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.250 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కాంట్రాక్టు సంస్థ కనీసం 2012 నుంచైనా ధరలు చెల్లించాలని కోరింది. ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన జాప్యానికి తమకు సంబంధం లేదని, తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచే పెరిగిన ధరలను చెల్లిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష పార్టీలన్నీ అంగీకారం తెలిపాయి. మధ్యేమార్గంగా ఓ నిర్ణయానికి రావాలని సూ చించాయి. దీంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేం దుకు ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ప్రజలపైభారం మోపకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి తాటి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. -
7 కాదు.. 14శాతం వడ్డీ!
* గడువు తీరినా చెల్లించని వ్యవసాయ రుణాలపై వసూలు తప్పదు * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్ఎల్బీసీ స్పష్టీకరణ * 14 శాతం వడ్డీ వసూలు చేయొద్దన్న రాష్ట్ర సర్కారు వినతికి తిరస్కరణ * జూలై నుంచి రుణ బకాయిలపై 14 శాతం వడ్డీని రైతులు కట్టుకోవాల్సిందే సాక్షి, హైదరాబాద్: గడువు తీరినా తిరిగి చెల్లించని వ్యవసాయ రుణాలపై రైతుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయకతప్పదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గడిచిన నాలుగు నెలలుగా వివిధ ఆంక్షలు విధిస్తూ జాప్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు సకాలంలో రుణాలు చెల్లించనందున.. వారికి వడ్డీ లేని రుణాల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏడు శాతానికి బదులు ఏకంగా 14 శాతం వడ్డీ భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వ్యవసాయ రుణాలపై 14 శాతం వడ్డీ వసూలు చేయరాదని, 7 శాతం వడ్డీకే పరిమితం కావలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్ఎల్బీసీకి లేఖ రాసింది. దీనిపై ఎస్ఎల్బీసీ స్పందిస్తూ.. ఏడు శాతం వడ్డీకి పరిమితం చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. తక్కువ వడ్డీ వసూలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అమలు చేయడం సాధ్యం కాదని, ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు రావలసి ఉంటుందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీని గత డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకు, అప్పటి వరకు అయ్యే వడ్డీకి మాత్రమే వర్తింప చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ జనవరి నుంచి జూన్ వరకు రైతుల రుణాలపై ఏడు శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే జూలై 1 నుంచి రైతుల వ్యవసాయ రుణాల బకాయిలపై 14 శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించారు. ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయదో, లేదా ఎప్పటి వరకు రైతులు రుణాలను చెల్లించరో అప్పటి వరకు 14 శాతం మేర వడ్డీ వసూలు చేయక తప్పదని బ్యాంకర్లు స్పష్టంచేస్తున్నారు. గడువులోగా చెల్లించని రుణాలకు రాష్ట్ర ప్రభుత్వ వడ్డీ లేని రుణాల పథకం ఎలా వర్తించదో.. ఆర్బీఐ కూడా గడువు మీరిన రుణ బకాయిలపై 14 శాతం వడ్డీ వసూలుకు అనుమతించిందని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. రైతులపై ఏకంగా 14 శాతం వడ్డీ భారం పడటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు చెందిన రుణంలో ఒక్క రూపాయి మాఫీ చేయలేదని, రైతులు మాత్రం మాఫీ వస్తుందనే ఆశతో రుణాలను చెల్లించడం లేదని, దీంతో వడ్డీ భారం పెరుగుతోందని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతుకు ఎంత రుణం మాఫీ చేస్తారో చెప్పి మిగతా రుణాన్ని రైతులు చెల్లించుకోవాలని చెప్తే అదనపు వడ్డీ భారం నుంచి రైతు గట్టెక్కుతారని, లేదంటే రైతులు వడ్డీల భారం మోయకతప్పదని వివరిస్తున్నారు. మహిళా సంఘాలదీ అదే పరిస్థితి: డ్వాక్రా సంఘాల పరిస్థితి దారుణంగా తయారైంది. వీటి కి రుణాల వాయిదాలను ప్రతి నెలా 15లోగా చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ చేయడం లేదని స్పష్టంగా చెప్పకపోవడంతో.. ఆ సంఘాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నాయని వారు చెప్తున్నారు. రుణ మాఫీ చేస్తారని మహిళా సంఘాలు వాయిదాలను చెల్లించడం లేదని.. దాంతో వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు కోల్పోయాయని వివరిం చారు. ఫలితంగా గడువు తీరిన మహిళా సంఘాల రుణాలపై బ్యాంకులు 14 శాతం వడ్డీ వసూలు చేయనున్నాయని తెలిపారు.