
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ టన్నెల్ రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది.
ఈ కమాండ్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
టన్నెల్ బురదమయం..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కాపాడేందుకు సహాయచర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ.. ధ్వంసమైన టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు.. 11.5 కి.మీ నుంచి ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం టన్నెల్‌లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది.

కూలిపోయే ప్రమాదం..
అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment